'సీన్' మూవీ రివ్యూ
సూర్య నటించిన ‘సీన్’ డిఫరెంట్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్గా ఆకట్టుకుంటుంది. డీఎస్పీ ప్రేమ్ రాజ్ పాత్రలో సూర్య కొత్తగా కనిపించడంతో పాటు తన కామెడీ టైమింగ్తో మెప్పించారు. విలన్గా నస్లీన్ నటన, చివరి 40 నిమిషాలు సినిమాకు బలంగా నిలిచాయి. అయితే సాధారణ కథనం, లాజిక్కు అందని సన్నివేశాలు, ఉత్కంఠ లోపించడం మైనస్. సూర్య ప్రయోగం ఆసక్తికరంగా ఉన్నా సినిమా యావరేజ్ స్థాయికే పరిమితమైంది.
By: Tupaki Desk | 6 Nov 2026 1:24 PM IST‘సీన్’ మూవీ రివ్యూ
నటీనటులు: సూర్య-నజ్రియా నజీమ్- నస్లీన్- లాల్- ఆనంద్ రాజ్ తదితరులు
సంగీతం: సుశీన్ శ్యామ్
ఛాయాగ్రహణం: వినీత్ ఆగస్టియన్
నిర్మాతలు: సూర్య- జ్యోతిక
రచన-దర్శకత్వం: జీతు మాధవన్
ఎన్నో ఏళ్ల ఫ్లాప్ స్ట్రీక్ ను బ్రేక్ చేస్తూ.. ఈ ఏడాది ‘కరుప్పు’.. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రాలతో ఘనవిజయాలు అందుకున్నాడు సూర్య. ఇప్పుడు ‘సీన్’ మూవీతో అతను హ్యాట్రిక్ కొడతాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సూర్యకు మరో విజయాన్ని అందించేలా ఉందా? చూద్దాం పదండి.
కథ: ప్రేమ్ రాజ్ (సూర్య) ఒక డీఎస్పీ. క్లిష్టమైన కేసులను పరిష్కరించడంలో అతడికి గొప్ప నేర్పుంటుంది. ఏడు హత్యలు చేసిన ఒక సైకో కిల్లర్ని పట్టుకుని జైల్లో వేయించిన అతను.. ఉన్నట్లుండి తన ఉద్యోగానికి రాజీనామా చేయాలనుకుంటాడు. పై అధికారి ఎంత సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోడు. అలాంటి టైంలోనే మళ్లీ వరుస హత్యలు జరగడంతో ప్రేమ్ రాజ్ పట్టుకున్నది అసలైన కిల్లర్ని కాదనే అనుమానాలు ముసురుకుంటాయి. దీంతో అతను మళ్లీ రంగంలోకి దిగుతాడు. ఇంతకీ ప్రేమ్ రాజ్ రాజీనామా చేయాలనుకోవడానికి కారణమేంటి.. సంక్లిష్టంగా మారిన వరుస హత్యల కేసును అతను ఛేదించాడా.. ఈ ప్రశ్నలకు తెర మీదే సమాధానం తెలుసుకోవాలి.
కథనం-విశ్లేషణ: స్టార్ హీరోల్లో సూర్య రూటు వేరు. భిన్నమైన కథలు.. పాత్రల కోసం అతను పడే తపన ఎలాంటిదో తన ఫిల్మోగ్రఫీని చూస్తే అర్థమవుతుంది. అప్పుడప్పుడూ మాస్ మసాలా సినిమాలు చేసినా సరే.. మళ్లీ రూటు మార్చేస్తుంటాడు. ఇమేజ్ ఛట్రంలో ఇరుక్కోకుండా ప్రయోగాలు చేస్తూనే ఉంటాడు. వేరే స్టార్లు ఎవ్వరూ అస్సలు టచ్ చేయలేని వైవిధ్యమైన కథల్లో సులువుగా ఒదిగిపోతుంటాడు. ‘సీన్’ కూడా అలాంటి డిఫరెంట్ అటెంప్టే. ‘సింగం’ సిరీస్ లో అంత పవర్ ఫుల్ పోలీస్ పాత్ర చేసిన సూర్యనే ఇప్పుడు ‘సీన్’లో ఒక పెద్ద బలహీనత ఉన్న కాప్ క్యారెక్టర్లో ప్రేక్షకులకు పెద్ద షాకే ఇస్తాడు. సినిమా మొదలైన కాసేపటికే తన పాత్రకు సంబంధించిన ట్విస్ట్ చూసి ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఆ ట్విస్టు వల్ల పాత్రకు అనేక పరిమితులు ఏర్పడినా సరే.. కథకు మాత్రం డిఫరెంట్ కలర్ వచ్చింది. సూర్యను మునుపెన్నడూ చూడని పాత్రలో చూడడం కొత్తగా అనిపిస్తుంది. అలాగే విలన్ పాత్రలో నస్లీన్ క్యారెక్టర్ కూడా క్రేజీగానే అనిపిస్తుంది. మర్డర్ ఇన్వెస్టిగేషన్ మీద కామెడీ ట్రీట్మెంట్ తో నడిచే సినిమాలో నవ్వులకు కూడా ఢోకా లేదు. కానీ ఎంత డిఫరెంట్ రోల్ అయినా సరే సూర్య లాంటి స్టార్ నుంచి ఆశించే హై మూమెంట్స్ మిస్ కావడం.. కథలో బిగి కొరవడడంతో ‘సీన్’ ఒక స్థాయికి మించి ఎంటర్టైన్ చేయలేకపోయింది.
మర్డర్ ఇన్వెస్టిగేషన్ స్టోరీలో ఒక పెద్ద స్టార్ హీరో నటించాడు అంటే.. భారీ సెటప్ ఆశిస్తాం. హీరోయిజం ఎలివేట్ అయ్యేలా.. హీరో-విలన్ ఫేసాఫ్ చాలా ఉత్కంఠభరితంగా ఉండేలా.. ట్విస్టుల మీద ట్విస్టులు పేలేలా సినిమాను ఊహించుకుంటాం. కానీ ‘సీన్’లో ఇవేవీ లేవు. అందరూ ఊహించేలా సినిమా ఉండొద్దని.. డిఫరెంటుగా ట్రై చేద్దామని.. సూర్య-జీతు మాధవన్ చాలా కాన్షియస్ గా ఈ కథ ట్రై చేసినట్లున్నారు. పేరుకు డీఎస్పీ కానీ సినిమా అంతా షార్ట్స్.. టీషర్టుతో కనిపిస్తాడు సూర్య ఇందులో. వీర లెవెల్లో ఫైట్లు చేయడం లాంటి సీన్లేమీ ఉండవు. ఒక చోట హీరోయినే హీరోను కాపాడడానికి ఫైట్ చేస్తుంది. ఇక సూర్య పాత్రకున్న బలహీనత గురించి చెబితే షాకవ్వడం గ్యారెంటీ. సూర్యను ఇంత భిన్నంగా చూడడం భలేగా అనిపిస్తుంది. హీరోయిజం పక్కన పెట్టి వినోదాన్ని పంచడంలో తన పాత్ర బాగానే సక్సెస్ అయింది. ఇవన్నీ ఓకే అనిపించినా.. కథ మరీ సింపుల్ గా ఉండడం.. ఇంటెన్సిటీ మిస్ కావడం.. హీరో-విలన్ మధ్య జరిగే క్యాట్ అండ్ మౌస్ గేమ్ లో ఉత్కంఠ మిస్ కావడం వల్ల ‘సీన్’ ఒక లెవెల్ కు మించి వినోదాన్ని పంచలేకపోయింది.
ఆరంభంలో సాధారణంగా అనిపించే ‘సీన్’.. సూర్య పాత్రలో ట్విస్ట్ తర్వాత వేగం పుంజుకుంటుంది. తనకున్న పెద్ద బలహీనతతో హీరో ఎలా మేనేజ్ చేశాడన్నది చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు. ఇక ముందు ఎలా మేనేజ్ చేస్తాడనే క్యూరియాసిటీ కూడా కలుగుతుంది. ఒక దశ వరకు ఈ వ్యవహారాన్ని ఆసక్తికరంగా చూపించారు. ఐతే మధ్యలో కథ మరీ నాన్ సీరియస్ అయిపోవడం.. విలన్ పాత్ర తేలికగా మారిపోవడంతో ‘సీన్’ ట్రాక్ తప్పుతుంది. అంత ప్రమాదకర సైకో కిల్లర్ కు సంబంధించిన కేసును హీరో అనఫీషియల్ గా డీల్ చేస్తుంటే.. పోలీసులు ఏం చేస్తున్నారు.. విలన్ అంత సులువుగా ఎలా తప్పించుకుంటున్నాడు అన్నది లాజిక్ కు అందదు. ఇలాంటి లూజ్ ఎండ్స్ వల్ల ఆసక్తి సన్నగిల్లిపోతుంది. ఐతే చివరి 40 నిమిషాల్లో మాత్రం ‘సీన్’ బలంగా పుంజుకుంది. ఇటు హీరో.. అటు విలన్ పాత్రలు రెంటిలోనూ ఇంటెన్సిటీ పెరుగుతుంది. ఇద్దరి మధ్య గేమ్ కూడా రసవత్తరంగా మారుతుంది. సూర్య-నస్లీన్ ఇద్దరూ పెర్ఫామెన్సులు కూడా అదరగొట్టేయడం.. క్లైమాక్స్ కూడా బాగానే పేలడంతో ‘సీన్’ సంతృప్తికరంగానే ముగుస్తుంది. కానీ సినిమాలో లూజ్ ఎండ్స్ చాలా ఉండడం.. మధ్యలో బోర్ కొట్టడం.. హై మూమెంట్స్ అనుకున్నంత స్థాయిలో లేకపోవడంతో ఇది యావరేజ్ స్థాయిని మించదు. సూర్య నుంచి ఒక డిఫరెంట్ సినిమా చూడాలనుకుంటే.. ఒక మోస్తరు కామెడీతో సంతృప్తి చెందుతాం అంటే ‘సీన్’ చూడొచ్చు. ఎక్కువ ఆశిస్తే మాత్రం కష్టం.
నటీనటులు: ఎప్పటికప్పుడు తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే సూర్య.. మరోసారి ఆశ్చర్యపరిచాడు. తనలాంటి పెద్ద స్టార్ ఇలాంటి పాత్రను ఒప్పుకోవడం షాకింగే. డిఫరెంట్ రోల్ ఎంచుకోవడమే కాదు.. దాన్ని కన్విన్సింగ్ గా ప్లే చేయడం ద్వారా సూర్య తన ప్రత్యేకతను చాటుకున్నాడు. అతను కామెడీ పండించిన తీరు సూపర్. నజ్రియా బాగానే నటించినా.. ఆమెలో మునుపటి ఛార్మ్ లేకపోవడంతో ఆ పాత్రకు మైనస్ అయింది. విలన్ పాత్రలో నస్లీన్ అదరగొట్టాడు. కూల్ పెర్ఫామెన్సుతో ఆ పాత్రను పండించిన విధానం తనకు మరింతగా అభిమానులను తెచ్చిపెడుతుంది. సీనియర్ నటుడు లాల్ కామెడీ పాత్రలో ఆకట్టుకున్నారు. టొవినో థామస్ క్యామియో బాగుంది. ఒకప్పటి విలన్ ఆనంద్ రాజ్.. కామెడీ పాత్రలో ఓకే అనిపించారు. మిగతా ఆర్టిస్టులంతా మామూలే.
సాంకేతిక వర్గం: సుశీన్ శ్యామ్ సినిమా నడతకు తగ్గట్లే డిఫరెంట్ మ్యూజిక్ ఇచ్చాడు. స్టైలిష్ బీజీఎంతో సన్నివేశాలను ఎంటర్టైనింగ్ గా మార్చే ప్రయత్నం చేశాడు. తన పాటలు మాత్రం గుర్తుంచుకునేలా లేవు. వినీత్ ఆగస్టియన్ ఆకట్టుకుంటుంది. విజువల్స్ డిఫరెంటుగా.. కలర్ ఫుల్ గా సాగాయి. సూర్య సొంత బేనర్లో తెరకెక్కిన చిత్రంలో క్వాలిటీ పరంగా ఏమీ రాజీ పడలేదు. ఇక రోమాంచం.. ఆవేశం చిత్రాలతో ఆకట్టుకున్న జీతు మాధవన్.. సూర్యతో జట్టు కట్టాడంటే భారీ అంచనాలు పెట్టుకుంటాం. కానీ అంచనాలకు తగ్గ పనితనం అతను చూపించలేకపోయాడు. సూర్యతో అతను ప్రయోగం చేయాలనుకోవడం బాగుంది కానీ.. పకడ్బందీ కథనం రాసుకోవాల్సింది. హై మూమెంట్స్ ఉండేలా చూసుకోవాల్సింది. తన బలం అయిన కామెడీ విషయంలో మెప్పించినా.. ఓవరాల్ గా అతను ఒక మోస్తరు ఔట్ పుటే ఇచ్చాడు.
చివరగా: సీన్.. సరికొత్త సూర్య-సోసో ఎంటర్టైన్మెంట్
రేటింగ్- 2.5/5
