పవన్ సినిమా కోసం లాఠీ దెబ్బలు తిన్న సంతోష్ శోభన్.. ఏమన్నారంటే?
టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ తన సహజ సిద్ధమైన నటనతో అందరినీ అలరిస్తుంటారు.
By: Tupaki Desk | 10 Feb 2026 11:00 PM ISTటాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ తన సహజ సిద్ధమైన నటనతో అందరినీ అలరిస్తుంటారు. ప్రస్తుతం 'కపుల్ ఫ్రెండ్లీ' ప్రమోషన్లలో బిజీగా ఉన్న ఆయన, ఓ ఇంటర్వ్యూలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి చెప్పిన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అభిమానం ఏ స్థాయికి వెళ్తే దెబ్బలను కూడా తీపి జ్ఞాపకాలుగా మార్చుకుంటుందో సంతోష్ చెప్పిన ఈ ముచ్చట వింటే అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఆయన లాఠీ దెబ్బలు తిన్న ఆ సరదా ఉదంతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వివిరాలు ఇలా వున్నాయి..
అత్తారింటికి దారేది సెట్స్‌లో ఆ చేదు తీపి జ్ఞాపకం:
సంతోష్ శోభన్ తన తాజా చిత్రం 'కపుల్ ఫ్రెండ్లీ' ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. "మీరు పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడైనా చూశారా?" అని అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. 'అత్తారింటికి దారేది' సినిమా షూటింగ్ సమయంలో పవన్ ను చూసినట్లు తెలిపారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిందే. షూటింగ్ స్పాట్ కి భారీగా అభిమానులు తరలిరావడంతో పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు ప్రయత్నించారని, ఆ క్రమంలో తోపులాట ఎక్కువ అవ్వడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారని సంతోష్ గుర్తుచేసుకున్నారు. ఆ జనసమూహంలో ఉన్న సంతోష్ శోభన్ కూడా అందరితో పాటు ఒక పోలీసు లాఠీ దెబ్బ తిన్నారట!
పవర్ స్టార్ క్రేజ్ మరియు సంతోష్ అభిమానం:
తను స్వయంగా హీరో అయినప్పటికీ, పవన్ కళ్యాణ్ పట్ల సంతోష్ కు ఉన్న అభిమానం ఈ మాటల ద్వారా స్పష్టమవుతోంది. "అప్పుడు అక్కడ క్రౌడ్ విపరీతంగా పెరిగిపోయింది. ఆ తోపులాటలో అందరితో పాటు నన్ను కూడా ఓ దెబ్బ వేశారు" అని నవ్వుతూ చెప్పారు సంతోష్. సాధారణంగా లాఠీ దెబ్బలు తినడం ఎవరికైనా ఇబ్బందిగా అనిపిస్తుంది, కానీ పవర్ స్టార్ సినిమా షూటింగ్ సమయంలో తిన్న ఆ దెబ్బ తనకు ఒక తీపి జ్ఞాపకంలా మిగిలిపోయిందని ఆయన భావం. ఈ సంఘటన ద్వారా పవన్ కళ్యాణ్ కు సామాన్య ప్రజల నుండే కాకుండా తోటి నటీనటుల్లో కూడా ఎంతటి క్రేజ్ ఉందో మరోసారి నిరూపితమైంది. ఈ ఇంటర్వ్యూ బిట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
కపుల్ ఫ్రెండ్లీ' మూవీ:
ఇక మొత్తానికి 'కపుల్ ఫ్రెండ్లీ' ప్రెస్ మీట్ ద్వారా చిత్ర యూనిట్ ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది. ఇది కేవలం వినోదం కోసమే కాదు, నేటి యువత ఆలోచనా దృక్పథాన్ని, వారి వ్యక్తిగత స్వతంత్రతను గౌరవించే ఒక స్వచ్ఛమైన కథగా తెరకెక్కింది. మిస్ ఇండియా మానస వారణాసి తన సహజత్వంతో, సెటిల్డ్ పర్ఫార్మెన్స్‌తో మెప్పించగా.. సంతోష్ శోభన్ తన అద్భుతమైన ఎమోషనల్ యాక్టింగ్‌తో సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించారు.మూవీ ఫిబ్రవరి 14 న రిలీజ్ కానుంది. ఈ అందమైన ప్రేమకథ వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ చేసి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుందో చూడాలి..
