వార్ VS కూలీ... సూపర్ స్టార్ అయినా మెప్పిస్తాడా?
రజనీకాంత్ అభిమానులు మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు 'కూలీ' టీజర్ ఎప్పుడు వస్తుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
By: Tupaki Desk | 21 May 2025 8:00 PM ISTసూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రూపొందిన 'కూలీ' సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసిన మేకర్స్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పనిలో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. సినిమాను ఆగస్టులో విడుదల చేయడం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. కూలీ సినిమాతో దర్శకుడు లోకేష్ కనగరాజ్ మరోసారి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్‌ను తన ఖాతాలో వేసుకుంటాడా అనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తుంది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రాబోతున్న మరో సినిమా కూలీ కావడంతో అంచనాలు సహజంగానే భారీగా ఉన్నాయి. దానికి తోడు ఈ సినిమా భారీ స్టార్ కాస్ట్‌తో రూపొందింది.
కూలీ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన విషయం తెల్సిందే. నాగార్జున మాత్రమే కాకుండా కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, మలయాళ స్టార్ నటుడు సౌబిన్ షాహిర్, తమిళ స్టార్ నటుడు సత్యరాజ్, హీరోయిన్ శృతి హాసన్, ఇంకా ఈ సినిమాలో రెబా మోనికా జాన్ వంటి ప్రతిభావంతులు అయిన నటీనటులు నటించారు. లోకేష్ కనగరాజ్ ఒక విభిన్నమైన ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకు వెళ్తాడు. కూలీ సినిమాతోనూ అదే జరుగుతుంది అంటూ అభిమానులు నమ్మకంగా ఉన్నారు. కూలీ సినిమాను ఆగస్టులో విడుదల చేయబోతున్న నేపథ్యంలో అదే సమయంలో విడుదల కాబోతున్న హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ల వార్ 2 తో బిగ్ క్ల్యాష్ ఉండబోతున్న విషయం తెల్సిందే.
వార్ 2 సినిమా బాలీవుడ్‌లో రూపొంది పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కాబోతుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న వార్ 2 సినిమా స్పై థ్రిల్లర్ జోనర్‌లో రూపొందింది. తప్పకుండా ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి స్పందన దక్కే అవకాశాలు ఉన్నాయంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. తాజాగా ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా విడుదలైన టీజర్‌కు మిశ్రమ స్పందన వచ్చింది. వార్ 2 టీజర్ చూసిన తర్వాత సినిమాపై ఒక అంచనాకి రాలేక పోతున్నామని కొందరు కామెంట్ చేస్తే, గతంలో వచ్చిన స్పై థ్రిల్లర్ మాదిరిగానే వార్ 2 ఉంటుందేమో అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఇక కూలీ సినిమా విషయం ఏంటి అనేది తేలాలి అంటే టీజర్ రావాల్సిందే.
రజనీకాంత్ అభిమానులు మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు 'కూలీ' టీజర్ ఎప్పుడు వస్తుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. లోకేష్ కనగరాజ్ తన సినిమా కంటెంట్ మొత్తంను టీజర్ లో చూపించేందుకు ప్రయత్నిస్తాడు. అంటే తాను సినిమాలో ఏం చూపించబోతున్నాడు అనే విషయాన్ని టీజర్‌లో చూపించడం ద్వారా సినిమాపై అంచనాలు పెంచుతూ ఉంటాడు. కూలీ టీజర్ విడుదలైన తర్వాత అంచనాలు పెరుగుతాయా? తగ్గుతాయా? అనేది చూడాలి. కూలీ వర్సెస్ వార్ 2 పోటీలో నెగ్గెది ఎవరు అనేది తేలాంటే సినిమాలు వచ్చే వరకు వెయిట్ చేయాలి. అయితే ఏ సినిమా బలం ఎంత అనేది టీజర్‌లను చూస్తే అర్థం అవుతుంది. వార్ 2 విషయంలో ఆసక్తి తగ్గిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరి కూలీ టీజర్ వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది అనేది చూడాలి.
