రూట్ మార్చిన పూరీ జగన్నాథ్.. ఆ హీరోలకు లైఫ్ ఇవ్వనున్నారా?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు పూరీ జగన్నాథ్ అంటే ఒక బ్రాండ్. ఫ్లాపుల్లో ఉన్న హీరోలకు తన మార్క్ మ్యానరిజంతో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చి వారి కెరియర్‌ను మలుపు తిప్పిన ఘనత ఆయనది.
By: Madhu Reddy | 27 Feb 2026 1:00 AM ISTతెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు పూరీ జగన్నాథ్ అంటే ఒక బ్రాండ్. ఫ్లాపుల్లో ఉన్న హీరోలకు తన మార్క్ మ్యానరిజంతో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చి వారి కెరియర్‌ను మలుపు తిప్పిన ఘనత ఆయనది. అయితే, వరుస పరాజయాలతో సతమతమవుతున్న పూరీ, ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్‌లో రూట్ మార్చినట్లు కనిపిస్తోంది. టాలీవుడ్‌ను వదిలి ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరోలపై గురిపెట్టిన పూరీ అక్కడ కూడా తన మ్యాజిక్‌ను రిపీట్ చేసి ఆ హీరోల కెరియర్‌కు కొత్త ఊపిరి పోస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆ వివరాలలోకి వెళితే ..
డిజాస్టర్ల తర్వాత పూరీ మార్క్ జాక్ పాట్:
సాధారణంగా ఏ దర్శకుడికైనా రెండు భారీ డిజాస్టర్లు పడితే, టయర్ వన్ హీరోలు అపాయింట్‌మెంట్ ఇవ్వడమే కష్టం. కానీ 'లైగర్' 'డబుల్ ఇస్మార్ట్' వంటి ఫలితాల తర్వాత కూడా పూరి జగన్నాథ్ తన క్రేజ్‌ను ఏమాత్రం తగ్గించుకోలేదు. విజయ్ సేతుపతితో 'స్లమ్ డాగ్' పూర్తి చేసిన పూరీ, ఇప్పుడు కోలీవుడ్ టాప్ స్టార్ సూర్యతో ఒక మెగా ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ పొందినట్లు ఇండస్ట్రీ టాక్. ఇక ఈ అనూహ్య కలయిక గురించి ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ, ఫిలిం నగర్ వర్గాలు మాత్రం ఈ కాంబో పక్కా అని అంటున్నాయి. తెలుగు హీరోలకు గతంలో లైఫ్ ఇచ్చినట్టే, ఇప్పుడు కోలీవుడ్ స్టార్స్‌ను కూడా పూరీ తనదైన స్టైల్లో సరికొత్తగా ప్రెజెంట్ చేయబోతున్నారట.
స్లమ్ డాగ్‌పై భారీ ఆశలు.. సూర్యతో నెక్స్ట్ లెవల్:
ప్రస్తుతం పూరి జగన్నాథ్ దృష్టి అంతా 'స్లమ్ డాగ్' సినిమాపైనే ఉంది. విజయ్ సేతుపతి హీరోగా, సంయుక్త మీనన్ హీరోయిన్‌గా తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామాలో టబు మరియు దునియా విజయ్ కీలక పాత్రలు పోషించారు. గతం కంటే భిన్నంగా, ఈ సినిమాను పూరి చాలా జాగ్రత్తగా రాసుకున్నారని సమాచారం. ఇక ఈ సినిమా రిజల్ట్ తర్వాతే సూర్య ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం ఉంది. ఒకవేళ స్లమ్ డాగ్ క్లిక్ అయితే, సూర్యతో పూరి చేయబోయే సినిమా 'బిజినెస్ మేన్' రేంజ్ మాస్ ఎలివేషన్లతో ఉంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. తమిళ హీరోలతో వరుసగా సినిమాలు సెట్ చేసుకుంటున్న పూరి, తన సెకండ్ ఇన్నింగ్స్ మొత్తాన్ని చెన్నై బేస్డ్ గా ప్లాన్ చేస్తున్నట్లు అర్థమవుతోంది.
పాత పూరి ఈసారి కొత్తగా వస్తారా?:
ఇక తన కెరియర్ మొదట్లో రవితేజ, మహేష్ బాబు వంటి హీరోలకి ఇమేజ్ మార్చిన పూరి, ఇప్పుడు తన పాత తప్పులను సరిదిద్దుకుని మళ్ళీ ఫామ్ లోకి రావాలని కసితో ఉన్నారు. కోలీవుడ్ హీరోలు కూడా పూరి జగన్నాథ్ హీరో క్యారెక్టరైజేషన్లకు ఫిదా అవుతుంటారు. అందుకే సూర్య వంటి స్టార్ హీరోలు కూడా ఆయనకు అవకాశం ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం సూర్య తన 'కరుప్పు' సినిమా రిలీజ్ కోసం చూస్తుండగా, వెంకీ అట్లూరి సినిమా తర్వాత పూరితో సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. ఈ వేసవిలో స్లమ్ డాగ్ విడుదలై పూరికి విజయాన్ని అందిస్తే, కోలీవుడ్ లో పూరి జగన్నాథ్ హవా మళ్ళీ మొదలైనట్టే.
