'మీరేడిస్తే కన్నీళ్ళు.. మరి నావి?'.. ప్రసాద్ బెహరా అలా అన్నారేంటి?
ఇలాంటి సమయంలో ఆయన వ్యక్తిగత విషయాలకు సంబంధించిన వార్తలు కొన్ని మీడియా వేదికల్లో తప్పుగా రావడం రీసెంట్ గా పెద్ద చర్చకు దారితీసింది.
By: M Prashanth | 16 April 2026 1:12 PM ISTనటుడు, యూట్యూబర్ ప్రసాద్ బెహరా ఇటీవల చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా సోషల్ మీడియాలో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆయన, తన ప్రత్యేకమైన కంటెంట్, పంచ్ డైలాగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ క్రేజ్ తో సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుని, ప్రస్తుతం బిజీగా గడుపుతున్నారు.
ఇలాంటి సమయంలో ఆయన వ్యక్తిగత విషయాలకు సంబంధించిన వార్తలు కొన్ని మీడియా వేదికల్లో తప్పుగా రావడం రీసెంట్ గా పెద్ద చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో పాపం ప్రతాప్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రసాద్ బెహరా స్పందించారు. వేదికపై మాట్లాడిన ఆయన భావోద్వేగానికి లోనై పలు వ్యాఖ్యలు కూడా చేయగా, అవి వైరల్ అవుతున్నాయి.
'పాపం ప్రతాప్ అనే టైటిల్ గురించి మాట్లాడుతున్న సమయంలో, గత కొద్ది రోజులుగా నాకే 'పాపం' అనిపించేలా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. ఇక్కడికి రావడానికి పెద్దగా పరిస్థితులు లేకపోయినా, మాట్లాడాలని వచ్చాను. ఒక సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుంది. ఓపెనింగ్ నుంచి రిలీజ్ వరకు మీడియా మాకు అవసరం' అని ఆయన తెలిపారు.
అయితే, తన మాటలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 'నేను టీజర్ ఈవెంట్‌లో ఒక విధంగా మాట్లాడితే, కొందరు దాన్ని వేరేలా రాశారు. నా గురించి ఎవ్వరూ ఏడవరు. ఏ యూట్యూబ్ లింక్ పంపినా ఓపెన్ చేయలేని వ్యక్తి మా అమ్మ. ఎవరైనా ఓపెన్ చేసి చూపిస్తే కోపపడుతుంది కానీ ఏడవదు' అని తెలిపారు.
తన వ్యక్తిత్వంపై వస్తున్న విమర్శలపై కూడా ఆయన తీవ్రంగా స్పందించారు. 'నాతో స్నేహం చేయడానికి వచ్చినా నేను పంపించేస్తా. నేను అంతటి ఉదార స్వభావం కలిగిన వాడిని. నా గురించి ఏమైనా రాయండి, నేను బాధపడను. కీటకం, మృగాడు అంటూ రాసినా నాకు అభ్యంతరం లేదు. కానీ ఇతరుల పేర్లు, ముఖ్యంగా అమ్మాయిల పేర్లు ఇందులోకి లాగొద్దు' అని మీడియాను కోరారు.
ఇటీవల జరిగిన ఒక సంఘటనను ప్రస్తావిస్తూ, అది సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతుందని, తన వెబ్ సిరీస్ కంటే ఆ విషయాలే ఎక్కువగా ప్రచారం అవుతున్నాయని అన్నారు. 'నా మీద పడిన మచ్చలు తుడిచేయాలని అనుకుంటున్నాను. కానీ గుర్తుచేస్తూనే ఉన్నారు. నన్ను ఎలా అయినా విమర్శించండి కానీ ఇతరులను ఇబ్బందులకు గురి చేయవద్దు' అని స్పష్టం చేశారు.
తన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ ప్రసాద్ భావోద్వేగానికి గురయ్యారు. 'నేను కూడా మీడియా నుంచే వచ్చాను. కెమెరా పట్టుకుని వీడియోలు కవర్ చేస్తూ, షార్ట్ ఫిల్మ్స్ రాస్తూ ఇక్కడికి చేరుకున్నాను. ప్రొడక్షన్ హౌసుల్లో మెట్లపై కూర్చుని స్క్రిప్టులు రాసుకునే రోజులు కూడా ఉన్నాయి. గెస్టులు వస్తున్నారని అక్కడ కూర్చోనివ్వని పరిస్థితులు ఎదుర్కొన్నాను' అని చెప్పారు. చివరగా 'మీరు ఏడిస్తే కన్నీళ్లు వస్తాయి… నేను ఏడిస్తే మాత్రం వేరేలా చూస్తున్నారు' అంటూ ఎమోషనలయ్యారు.
