ముంబైకి విమానంలో చెన్నై బిరియానీ రప్పించిన స్టార్ హీరో
ఆరోజు ముంబైలో షూటింగ్ జరుగుతోంది. ఏదో సీరియస్ సీన్ తెరకెక్కిస్తున్నారు. అసలే పురాణేతిహాస కథను ఎంచుకుని ప్రయోగాత్మకంగా భారీ సినిమాని చిత్రీకరిస్తుంటే సెట్లో అంతా గంభీరంగా ఉంది.
By: Tupaki Desk | 21 Feb 2026 10:14 AM ISTఆరోజు ముంబైలో షూటింగ్ జరుగుతోంది. ఏదో సీరియస్ సీన్ తెరకెక్కిస్తున్నారు. అసలే పురాణేతిహాస కథను ఎంచుకుని ప్రయోగాత్మకంగా భారీ సినిమాని చిత్రీకరిస్తుంటే సెట్లో అంతా గంభీరంగా ఉంది. అయితే లంచ్ టైమ్ లోనే అది ఎవరూ ఊహించని ట్విస్ట్. హీరోగారు డైరెక్టర్ మధ్య సంభాషణల్లో ఒక వింత పరిణామం చోటు చేసుకుంది. దర్శకుడు ఇవాళ ఫుడ్ ఏంటి.. ఎక్కడ నుంచి తెస్తున్నారు? అని ప్రశ్నించాడు. అప్పుడు ఆ హీరో చెన్నై ఫుడ్ తెప్పిస్తాను.. జస్ట్ వెయిట్... అంటూ అక్కడ ఉన్న ఫుడ్ ని ముట్టుకోకుండా ఆపేసాడు.
కట్ చేస్తే, ఇంతకీ రాదు అంతకీ రాదు.. ఆకలితో ఆ దర్శకుడు సహా ఇతర టీమ్ వెయిట్ చేస్తున్నారు. ఆ హీరో మాత్రం వెయిట్ వెయిట్.. చెన్నై ఫుడ్ వచ్చేస్తోంది! అని ఆపి ఉంచారు. చెన్నయ్ ఫుడ్ సరే.. ఇంతసేపు దేనికి? అని ప్రశ్నిస్తే, అప్పుడు చెప్పాడట. చెన్నయ్ నుంచి ఫ్లైట్ లో వేడి వేడిగా వస్తోంది... వెయిట్ చేస్తే వడ్డించేస్తాను అని కూల్ గా చెప్పాడట. ఆ మాట విని షాక్ తిన్న ఆ డైరెక్టర్ ఇలాంటోడిని ఎక్కడా చూడలేదయ్యా బాబూ! అంటూ కంగారు పడ్డాడట.
ఏదో చెన్నై ఫుడ్ అంటే.. ముంబైలోనే అదొక రెస్టారెంట్ నుంచి వస్తోంది అనుకున్నాడట. కానీ ముంబైకి ఏకంగా విమానంలో వేడి వేడిగా మసాలా వాసనలతో చెన్నై నుంచి వచ్చింది ఈ స్పెషల్ అని చెప్పాడు ఆ హీరో. అయితే ఈ వ్యవహారంలో హీరో ఎవరు? దర్శకుడు ఎవరు? అంటే.. `ఆదిపురుష్` చిత్రీకరణ సమయంలో ప్రభాస్ కి దర్శకుడు ఓంరౌత్ కి మధ్య సంభాషణ ఇది. ఓం రౌత్ కోసం డార్లింగ్ ప్రభాస్ ఏకంగా చెన్నయ్ నుంచి బిరియానా, పాయా వంటివి వేడి వేడిగా విమానంలో తెప్పించి వడ్డించాడు.
పాయా, బిరియానీ చెన్నయ్ లో ఆ చోట చాలా స్పెషల్ గా ఉంటాయని, హైదరాబాద్ బిరియానీకి ఫేమస్ అయినా కానీ చెన్నయ్ లోని ఆ బిరియానీ కాస్త టమోటా ఫ్లేవర్ తో ఎంతో టేస్టీగా ఉంటుందని డార్లింగ్ ప్రభాస్ అన్నాడు.
చట్నీలు ఈసారి ఎక్కడి నుంచి వస్తాయి? అంటే.. అంటే ఏదో ఒక స్టేట్ నుంచి వస్తూ ఉంటాయని కూడా ప్రభాస్ ఓ సందర్భంలో అన్నారట.
ప్రభాస్ చెప్పిన ఈ విషయాలు వింటుంటే నిజంగా ఆశ్చర్యం కలగక మానదు. డార్లింగ్ మంచి భోజన ప్రియుడు. తనతో పాటే సెట్లో ఉన్న అందరికీ అద్భుతమైన రుచికరమైన భోజనాన్ని కడుపుబ్బా వడ్డించడం అతడి అలవాటు. ఇండస్ట్రీలో చాలా మంది కథానాయికలు ప్రభాస్ వడ్డించిన భోజనం తిని అతడిని పొగిడేయకుండా ఉండలేకపోయారు. అతడి హాస్పిటాలిటీ అతడి మంచి మనసును కొనియాడని కథానాయికలు, కోస్టార్స్ లేరు. ప్రభాస్ ప్రస్తుతం స్పిరిట్ సెట్లో సందీప్ రెడ్డి వంగా, ఇతర టీమ్ కి అలాంటి ట్రీట్ నే కంటిన్యూ చేస్తున్నాడన్నమాట.
