CM తో టాలీవుడ్ పెద్దల భేటీ వాయిదా వెనక?
ఒక బహిరంగ లేఖలో పవన్ ఘాటైన పదజాలం ఉపయోగించడం కలకలం రేపింది.
By: Tupaki Desk | 15 Jun 2025 5:39 AMఏడాది కాలంగా అధికారంలో ఉన్నా, చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఎవరూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలవలేదని పవన్ కళ్యాణ్ తెలుగు చిత్ర పరిశ్రమపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఒక బహిరంగ లేఖలో పవన్ ఘాటైన పదజాలం ఉపయోగించడం కలకలం రేపింది. టాలీవుడ్ తీరుతెన్నులు నచ్చని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఇకపై ప్రభుత్వ అధికారులతో వ్యక్తిగత సమావేశాలు ఉండవని, ఏ సమావేశం జరిగినా ఫిలింఛాంబర్ ద్వారా రావాలని కొత్త ప్రతిపాదన తెచ్చారు.
కట్టలు తెంచుకున్న పవన్ ఆగ్రహం చూశాక సినీపరిశ్రమ ప్రముఖులు చాలా కంగారుపడ్డారు. దీనికి తోడు `హరిహర వీరమల్లు` రిలీజ్ ముందు ఎగ్జిబిటర్ల థియేటర్ల మూసివేత డ్రామాపైనా పవన్ చాలా సీరియస్ అయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహా ప్రభుత్వాధీశులను సినీపెద్దలు కలవాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆదివారం (15 జూలై 2025) నాడు జరగాల్సిన ఈ సమావేశం వాయిదా పడిందని తెలిసింది.
దీనికి ప్రత్యేక కారణం ఉంది. మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు అగ్ర తారలు ఔట్ డోర్ షూటింగుల్లో బిజీగా ఉన్నారు. వారికి షూట్లు క్యాన్సిల్ చేసుకునే పరిస్థితి లేకపోవడంతో కీలక సమావేశాన్ని వాయిదా వేశారని తెలిసింది. ముఖ్యమంత్రులతో భేటీలో పెద్దలంతా సినీపరిశ్రమ సమస్యలను ప్రస్థావించే వీలుంది. టికెట్ ధరల పెంపు, ఎగ్జిబిషన్ రంగంలో కష్టాలు సహా పలు అంశాలపై ముఖ్యమంత్రితో చర్చిస్తారు. ఏపీలో లొకేషన్లకు సింగిల్ విండో విధానం సహా పలు అంశాలు ప్రస్థావనకు రానున్నాయని తెలిసింది. అలాగే ఏపీలో కొత్త సినీపరిశ్రమ ఏర్పాటు, పూణే ఫిలింఇనిస్టిట్యూట్ తరహా ఇనిస్టిట్యూట్ ఏర్పాటు వంటి అంశాల్ని కూడా చర్చించాలని సినీ ఔత్సాహికులు కోరుకుంటున్నారు. తదుపరి సమావేశం ఎప్పుడు జరగనుందో, సంబంధిత వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.