ఎన్టీఆర్ 'వార్ 2' తెలుగు రిలీజ్ ప్లానింగ్..!
ఎన్టీఆర్ నటించిన మొదటి హిందీ సినిమా 'వార్ 2' రిలీజ్‌కి సిద్ధం అవుతోంది. పాట చిత్రీకరణ మినహా మొత్తం షూటింగ్ పూర్తి అయింది.
By: Tupaki Desk | 10 Jun 2025 1:00 PM ISTఎన్టీఆర్ నటించిన మొదటి హిందీ సినిమా 'వార్ 2' రిలీజ్‌కి సిద్ధం అవుతోంది. పాట చిత్రీకరణ మినహా మొత్తం షూటింగ్ పూర్తి అయింది. ఆ పాట కూడా ఇప్పటికే షూట్ చేయాల్సి ఉన్నా హృతిక్ రోషన్ గాయం కారణంగా వాయిదా పడ్డ విషయం తెల్సిందే. ఈ నెలలో ఆ పాట కూడా పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాను ఆగస్టులో విడుదల చేయబోతున్నారు. విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్పీడ్ పెంచారు. పాన్ ఇండియా రేంజ్‌లో ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేసేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం అందుతోంది.
హిందీలో యశ్ రాజ్ ఫిల్మ్స్ వారు తమకు ఉన్న పలుకుబడితో ఉత్తర భారతంలో భారీ ఎత్తున విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక సౌత్ విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్‌కి ఉన్న క్రేజ్ నేపథ్యంలో బిగ్ రిలీజ్ దక్కే అవకాశాలు ఉన్నాయి. కానీ తమిళనాట మాత్రం అదే సమయంలో సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ కూలీ ఉన్న కారణంగా మినిమం థియేటర్లు కూడా వార్ 2 కి దక్కే అవకాశాలు లేవు అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. అక్కడ సినిమా సూపర్ హిట్ అయితే తప్ప రెండో వారం నుంచి కలెక్షన్స్ వచ్చే పరిస్థితి లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కోలీవుడ్‌లో ఈ సినిమా బిగ్ రిలీజ్‌కి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కొన్ని ఏరియాల్లో అమ్మి, కొన్ని ఏరియాలను నేరుగా రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమా యొక్క ఉత్తరాంధ్ర రైట్స్‌ను కొనుగోలు చేశాడని సమాచారం అందుతోంది. మరో రెండు మూడు ఏరియాల్లోనూ సినిమాను అమ్మే అవకాశాలు ఉన్నాయి. కొన్ని ఏరియాల్లో ఇప్పటికే నిర్మాణ సంస్థ స్వయంగా థియేటర్లను బుక్ చేస్తుందని సమాచారం అందుతోంది. సింగిల్ స్క్రీన్ థియేటర్ల విషయంలో చాలా పట్టుదలతో మేకర్స్ ఉన్నారు. అందుకు తగ్గట్లుగానే థియేటర్లను ముందస్తుగా బుక్ చేసి పెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్‌కి ఉన్న క్రేజ్ నేపథ్యంలో వార్ 2 తెలుగు రాష్ట్రాల్లో కనీసం రూ.250 కోట్ల వసూళ్లు రాబట్టే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.
హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో విలన్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు మేకర్స్ నుంచి ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ అనే విషయమై క్లారిటీ ఇవ్వలేదు. హీరోయిన్‌గా ఈ సినిమాలో కియారా అద్వానీ నటించిన విషయం తెల్సిందే. ఇటీవల విడుదలైన టీజర్ కాస్త అసంతృప్తి కలిగించినా సినిమా మాత్రం కచ్చితంగా అంచనాలను అందుకుంటుంది అనే అభిప్రాయంతో మేకర్స్ ఉన్నారు. ఎన్టీఆర్ పాత్ర కోసం తెలుగు ప్రేక్షకులు ముఖ్యంగా నందమూరి అభిమానులు చాలా ఆసక్తిగా ఉన్నారు. అందుకు తగ్గట్లుగా దర్శకుడు ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రను డిజైన్ చేశాడని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీగా నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.
