Begin typing your search above and press return to search.

రాధిక గ్యాప్ తీసుకుందా.. లేక వ‌చ్చిందా?

`డీజే టిల్లు` మూవీ తో రాధికగా కుర్రకారు గుండెల్లో ముద్ర వేసుకుంది నేహా శెట్టి. కర్ణాటకకు చెందిన ఈ వయ్యారి.. 2014లో మిస్ మంగళూరు టైటిల్ గెలుచుకుంది.

By:  Tupaki Desk   |   20 May 2025 8:15 AM IST
రాధిక గ్యాప్ తీసుకుందా.. లేక వ‌చ్చిందా?
X

`డీజే టిల్లు` మూవీ తో రాధికగా కుర్రకారు గుండెల్లో ముద్ర వేసుకుంది నేహా శెట్టి. కర్ణాటకకు చెందిన ఈ వయ్యారి.. 2014లో మిస్ మంగళూరు టైటిల్ గెలుచుకుంది. 2015లో మిస్‌ సౌత్ ఇండియా రన్నరప్ గా నిలిచింది. దాంతో కన్నడ డైరెక్టర్ శశాంక్ 2016 లో `ముంగారు మాలే 2` మూవీతో నేహా శెట్టిని హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఈ సినిమా యావరేజ్ గా ఆడినప్పటికీ.. నేహా అందం, అభినయానికి ప్రశంసలు దక్కాయి. 2018లో పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన `మెహబూబా` మూవీ తో నేహా శెట్టి తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయింది. ఈ మూవీ ఫలితం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఆ తర్వాత ఆరు నెలలు పాటు న్యూయార్క్ ఫిల్మ్‌ అకాడమీలో యాక్టింగ్ కోర్స్ తీసుకున్న నేహా శెట్టి.. 2021లో `గల్లీ రౌడీ` మూవీతో హీరోయిన్ గా రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో సందీప్ కిషన్ కు జోడిగా నటించి ఆకట్టుకుంది. అదే ఏడాది `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` చిత్రంలో మేఘాగా మెరిసిన నేహా.. 2022లో `డీజే టిల్లు`తో బ్రేక్ అందుకుంది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో నేహా శెట్టి పోషించిన రాధిక పాత్రకు ఎంతటి రీచ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. డీజే టిల్లుతో రాధికగా గుర్తుండి పోయిన‌ నేహా శెట్టి.. ఆ తర్వాత `బెదురులంక 2012`, `రూల్స్ రంజన్`, `టిల్లు స్క్వేర్` వంటి చిత్రాల్లో నటించింది.

చివరిగా విశ్వ‌క్ సేన్‌తో క‌లిసి `గ్యాంగ్స్‌ ఆఫ్ గోదావరి` సినిమాతో పలకరించింది. భారీ అంచ‌నాల న‌డుమ విడుదలైన ఈ చిత్రం అనుకున్న స్థాయిలో ఆడలేదు. అయితే గ్యాంగ్స్‌ ఆఫ్ గోదావరి వచ్చి ఏడాది కావొస్తున్నా నేహా శెట్టి నుంచి మరో సినిమా రాక‌పోవ‌డం గమనార్హం. దాదాపు రెండేళ్ల క్రితం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు జోడిగా `టైసన్ నాయుడు` అనే సినిమాకు నేహా శెట్టి సంతకం చేసింది. `భీమ్లానాయ‌క్` హేమ్ సాగర్ కే. చంద్ర ఈ సినిమాకు దర్శకుడు. ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రూల్స్ బ్యానర్ లో టైసన్ నాయుడు ప్రారంభమైంది.

కానీ ఇంతవరకు షూటింగ్ పూర్తి కాలేదు. పడుతూ లేస్తూ అన్నట్టుగా చిత్రీకరణ జరుగుతుంది. గత ఏడాది నేపాల్ లో కొంత షూటింగ్ చేశారు. ఆ తర్వాత ఎటువంటి అప్డేట్ లేదు. అసలు ఈ చిత్రం ఉందా? ఆగిపోయిందా? అన్న విషయం కూడా తెలియని పరిస్థితి. ఇక గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తర్వాత నేహా శెట్టి కొత్త ప్రాజెక్ట్‌ల‌కు సైన్ చేసింది లేదు. మ‌రి ఆఫ‌ర్లు లేక‌ రాధికకు గ్యాప్ వచ్చిందా? లేక తనకు సెట్ అయ్యే కథలు రాక గ్యాప్ తీసుకుందా? అన్నది తెలియాల్సి ఉంది.