Begin typing your search above and press return to search.

నందమూరి సుహాసిని కుమారుడి పెళ్లిలో అనుకోని అతిథులు!

నందమూరి హరికృష్ణ మనవడు, నందమూరి సుహాసిని కుమారుడు శ్రీ హర్ష పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది

By:  Tupaki Desk   |   21 Aug 2023 6:08 AM GMT
నందమూరి సుహాసిని కుమారుడి పెళ్లిలో అనుకోని అతిథులు!
X

దివంగత ఎన్టీఆర్‌ ముని మనవడు, నందమూరి హరికృష్ణ మనవడు, నందమూరి సుహాసిని కుమారుడు శ్రీ హర్ష పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్‌ గచ్చిబౌలిలో జరిగిన ఈ పెళ్లికి దివంగత ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు మొత్తం హాజరయ్యారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేశ్‌ పాదయాత్రలో ఉండటంతో ఆయన పెళ్లికి హాజరు కాలేదు.


పెళ్లికి హాజరయినవారిలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, ప్రముఖ సినీ నటులు నందమూరి బాలకృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్, కళ్యాణ్‌ రామ్, చైతన్య కృష్ణ, దివంగత ఎన్టీఆర్‌ కుమారుడు నందమూరి రామకృష్ణ, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తదితరులు ఉన్నారు. ఈ వివాహానికి నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధరాదేవి కూడా హాజరయ్యారు. నందమూరి కళ్యాణ్‌ రామ్‌ కుటుంబసభ్యులు, దివంగత జానకీరామ్‌ భార్య, పిల్లలు హాజరయ్యారు. ఈ వేడుకలో నందమూరి, నారా కుటుంబాల సందడితో కోలాహలం నెలకొంది.


కాగా ఈ పెళ్లికి నరసాపురం వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణరాజు, తెలంగాణ పంచాయతీరాజ్‌ శాఖ ఎర్రబెల్లి దయాకరరావు కూడా హాజరయ్యారు. ముఖ్యంగా ఎక్కువ కాలం ఢిల్లీలోనే ఉంటున్న రఘురామకృష్ణరాజు ఈ పెళ్లిలో సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌ గా నిలిచారు. చంద్రబాబు, బాలయ్యలతో కలిసి ఫొటోలు దిగారు. ఇవి సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి. అలాగే జూనియర్‌ ఎన్టీఆర్, కల్యాణ్‌ రామ్, బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ దిగిన ఫొటోను కూడా సోషల్‌ మీడియాలో వారి అభిమానులు ట్రెండ్‌ చేస్తున్నారు.


కాగా దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె అయిన నందమూరి సుహాసిని 2018 ఎన్నికల్లో హైదరాబాద్‌ లోని కూకట్‌ పల్లి స్థానం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ (ప్రస్తుతం బీఆర్‌ఎస్‌) అభ్యర్థి మాధవరం కృష్ణారావు చేతిలో సుహాసిని పరాజయం పాలయ్యారు. ఆమె సోదరులు జూనియర్‌ ఎన్టీఆర్, కళ్యాణ్‌ రామ్‌ ఎన్నికల్లో ఆమె తరఫున ప్రచారం చేయలేదు. గెలిపించాలని సోషల్‌ మీడియా వేదికగా మాత్రం పిలుపునిచ్చారు.


కాగా తెలంగాణలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో మరోసారి సుహాసిని కూకట్‌ పల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేయొచ్చని అంటున్నారు. కూకట్‌ పల్లిలో ఆంధ్రా ఓటర్ల సంఖ్య ఎక్కువ. ఈ నేపథ్యంలో మరోసారి ఆమె తన అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చని చెబుతున్నారు.