Begin typing your search above and press return to search.

ఏం మాట్లాడాలన్నా భయం వేస్తోంది.. మీడియా విస్తృతిపై కింగ్ నాగార్జున టెన్షన్!

ఒక సినిమా ఈవెంట్‌లో కింగ్ నాగార్జున నేటి మీడియా పరిణామాలపై, సోషల్ మీడియా విస్తృతిపై చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.

By:  Sivaji Kontham   |   9 July 2026 9:43 AM IST
ఏం మాట్లాడాలన్నా భయం వేస్తోంది.. మీడియా విస్తృతిపై కింగ్ నాగార్జున టెన్షన్!
X

ఒక సినిమా ఈవెంట్‌లో కింగ్ నాగార్జున నేటి మీడియా పరిణామాలపై, సోషల్ మీడియా విస్తృతిపై చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. నాటి కాలానికి, నేటి కాలానికి మీడియా రంగంలో వచ్చిన మార్పులను ఆయన గుర్తుచేసుకుంటూ సరదాగా.. అదే సమయంలో కాస్త టెన్షన్‌గా మాట్లాడిన మాటలు సినిమా ఇండస్ట్రీతో పాటు సాధారణ ప్రేక్షకులను సైతం ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

నాగార్జున తన గతాన్ని గుర్తుచేసుకుంటూ.. ``ఆరోజుల్లో నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ప్రెస్ మీట్ పెడితే కేవలం ఆరుగురు మీడియా వ్యక్తులు మాత్రమే నా ముందు క్యూ అండ్ ఏ (Q&A) సెషన్ కోసం ఉండేవారు. అలాగే ఒకే ఒక్క ఫోటోగ్రాఫర్ ఉండేవారు. వాళ్లు అడిగే ప్రశ్నలు.. మనం చెప్పే సమాధానాలు చాలా పరిమితంగా.. ఎంతో ప్రశాంతంగా సాగిపోయేవి! అని పాత రోజులను ఎంతో గుర్తుచేసుకున్నారు.

కానీ ఈరోజు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మా(లెనిన్ టీమ్) చుట్టూ ఇంతమంది మీడియా ప్రతినిధులు, ఇన్ని మైకులు, వందలాది కెమెరాలు కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటోంది. ఇప్పుడు ఏ చిన్న తప్పు మాట్లాడినా, ఏమరపాటుగా ఏ పదం నోరు జారినా క్షణాల్లో వైరల్ అయిపోతుంది. అందుకే ఇప్పుడు మీడియా ముందు నిలబడి ఏం మాట్లాడాలన్నా ఒక రకమైన భయం వేస్తోంది! అంటూ నాగార్జున నవ్వుతూ తన మనసులోని అసలు టెన్షన్‌ను బ‌య‌ట‌కు చెప్పారు.

నిజానికి ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు మీడియా వేవ్ పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం యూట్యూబ్ చానెళ్లు, వెబ్‌సైట్లు, డిజిటల్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల రాకతో సెలబ్రిటీల న్యూస్ కవరేజ్ ఎంతో జోష్‌ఫుల్‌గా సాగుతోంది. ఒకప్పుడు కేవలం ఒక డజను ప్రధాన పత్రికలు... మరో డజను ప్రధాన ఎలక్ట్రానిక్ (టీవీ) మీడియాలు.. ఒక అరడజను పురాతన సినిమా మ్యాగజైన్లు మాత్రమే టాలీవుడ్ సెలబ్రిటీ న్యూస్‌ను కవర్ చేస్తున్నాయనుకుంటే పొరపాటే అవుతుంది.

ప్రస్తుతం డిజిటల్ విప్లవం పుణ్యమా అని ఎక్కడ చూసినా వందలాది సరికొత్త మీడియా ప్లాట్‌ఫామ్‌లు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు యూట్యూబ్ చానెళ్లు, డిజిటల్ నెట్‌వర్క్‌లు, ఇన్ స్టా పేజీలు వగైరా వగైరా అన్ని కలుపుకుని ప్రతి ఈవెంట్‌లోనూ దాదాపు 100 మందికి పైగా మీడియా ప్రతినిధులు మైకులతో సిద్ధంగా ఉంటున్నారు. ఎక్కడికక్కడ లైవ్ కవరేజ్‌లు, ఇన్‌స్టంట్ ట్రోల్స్ నడుస్తున్న నేటి రోజుల్లో చిన్న పొరపాటు దొర్లినా కెరీర్‌కే ఇబ్బందిగా మారుతోంది. అందుకే సీనియర్ మోస్ట్ స్టార్ హీరో అయిన నాగార్జున సైతం కెమెరాల ముందుకు రాగానే అంతటి భయం, టెన్షన్ వ్యక్తపరిచారన్నమాట. అయితే సుదీర్ఘ అనుభ‌వం ఉన్న కింగ్ మీడియాతో ఎంతో స‌న్నిహితంగా వ్య‌వ‌హ‌రిస్తూ త‌న‌కు కావాల్సిన ప్ర‌మోష‌న్ ని రాబ‌ట్టుకోవ‌డంలో దిట్ట అనేది అంద‌రికీ తెలుసు! నాగార్జున వార‌సుడు అఖిల్ న‌టించిన‌ `లెనిన్` పెద్ద విజ‌యం సాధించాల‌ని తెలుగు మీడియా బ‌లంగా కోరుకుంటున్న విష‌యం తాజా స‌మావేశంలో బ‌య‌ట‌పడింది.