ఆత్మహత్య చేసుకుందామనుకున్నా!
సీరియల్ నటిగా కెరీర్‌ను ప్రారంభించిన మృణాల్ అందులో నటిస్తూనే సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేశారు.
By: Tupaki Desk | 6 July 2025 9:00 PM ISTసీతారామం సినిమాతో టాలీవుడ్‌లో, తెలుగు అభిమానుల హృదయంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న మృణాల్ ఠాకూర్ అన్ని భాషాల్లోనూ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. బుల్లి తెరపై సిరీయల్స్‌లో కెరీర్‌ను మొదలుపెట్టి తన అందం, అభినయంతో సిల్వర్ స్క్రీన్‌పై తిరుగులేని హీరోయిన్‌గా వెలుగుతున్న ఈ మరాఠీ ముద్దుగుమ్మ ఒక దశలో ఆత్మహత్య చేసుకుందామనుకున్నానని తాజాగా ఒక ఇంటర్వ్యూలో సంచలన విషయాలను బయటపెట్టారు.
హీరోయిన్ కావాలని మృణాల్‌కు చిన్నప్పటి నుంచి కోరిక. అయితే సినిమా రంగం గురించి ఆమె తల్లిదండ్రులకు ఉన్న అపోహలు కారణంగా వారు మృణాల్‌ను తొలుత ప్రోత్సహించలేదట. ఒకసారి త్రీ ఇడియెట్స్ సినిమాను చూపించి నటి అయితే ఇలాంటి సమాజహితంను కోరే పాత్రలు కూడా చేయవచ్చునని చెప్పి వారిని ఒప్పించారట. ఇప్పటికీ మృణాల్ నటించే ప్రతి సినిమాలో తన పాత్ర ఎలా ఉంటుందో ముందు వారి తల్లిదండ్రులకు వివరించి, వారు ఒప్పుకున్నాకే సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారట.
సీరియల్ నటిగా కెరీర్‌ను ప్రారంభించిన మృణాల్ అందులో నటిస్తూనే సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేశారు. సినిమాల్లో కొత్త నటుల కోసం నిర్వహించే ఆడిషన్స్‌కు వెళ్లినప్పుడు సీరియల్ యాక్టర్ అనే ట్యాగ్‌తో అక్కడున్న వారు చులకనగా చూడడంతో చాలా సార్లు ఆ అవమానం భరించలేక ఏడ్చానని, ఓసారి డిప్రెషన్‌లోకి వెళ్లిపోయి లోకల్ ట్రైన్‌లో నుంచి దూకి ఆత్మహత్య చేసుకుందామనుకుని, తల్లిదండ్రులు గుర్తొచ్చి ఆగిపోయినట్టు మృణాల్ తెలిపారు.
టీవీ సీరియల్స్‌లో తనతో పాటు నటించిన కొందరు యాక్టర్లు, రైటర్లు, మ్యూజిక్ డైరెక్టర్లతో డేటింగ్ ఉన్నట్లు వచ్చిన రూమర్లు, వార్తలపై కెరీర్ ప్రారంభంలో చాలా బాధపడ్డానని, ఆతర్వాత తేరుకొని వాటిని పట్టించుకోవడం మానేశానని, తానెవరితో రిలేషన్‌షిప్‌లో ఉన్నాను, ఎవరికి బ్రేకప్ చెప్పా అనే విషయాలు పబ్లిక్‌గా చెప్పాల్సిన అవసరం లేదని, పెళ్లి చేసుకున్నప్పుడు ఎలాగో చెబుతా కదా అప్పుడు అన్ని విషయాలు అందరికి తెలుస్తాయని తాజా మృణాల్ డేటింగ్ రూమర్లపై కూడా క్లారిటీ ఇవ్వగా ఇప్పుడా కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.