ఈ రెండు టీజర్లలో క్రియేటివిటీ ఎక్కువగా ఏ టీజర్ లో కనిపించింది?
ఈ సీజన్ లో థియేటర్లలో సందడి చేయబోతున్న ఓ రెండు సినిమాల టీజర్లు ప్రధానంగా ప్రజల్లో చర్చకు వచ్చాయి.
By: Tupaki Desk | 31 May 2025 9:37 AM ISTఈ సీజన్ లో థియేటర్లలో సందడి చేయబోతున్న ఓ రెండు సినిమాల టీజర్లు ప్రధానంగా ప్రజల్లో చర్చకు వచ్చాయి. ఇవి రెండూ భారీ వీఎఫ్ఎక్స్ ఆధారిత టీజర్లు. అత్యంత భారీతనం నిండిన విజువల్స్ తో దూసుకొచ్చాయి. అయితే ఈ రెండు టీజర్లలో క్రియేటివిటీ ఎక్కువగా ఏ టీజర్ లో కనిపించింది? అభిరుచి, కొత్తదనం ఏ టీజర్ లో ఉంది? అంటూ నెటిజనులలో డిబేట్ మొదలైంది.
ఆసక్తికరంగా ఈ డిబేట్ లో పెద్ద స్టార్లు నటించిన సినిమాకి సంబంధించిన టీజర్ తో పోలిస్తే, అభిరుచిలో, వీఎఫ్ఎక్స్ నాణ్యతలో, కంటెంట్ పరంగా చిన్న హీరో నటించిన టీజర్ ప్రశంసలు అందుకుంది. పెద్ద హీరోల కోసం బడా నిర్మాణ సంస్థ ఏకంగా వందల కోట్ల పారితోషికాలు చెల్లించుకోవాలి. కానీ అంత పెద్ద మొత్తం పారితోషికంతో పని లేకుండా ఒక సాధారణ భత్యంతో పని చేసే ఒక యువహీరో తన టీజర్ తో తన లుక్స్ తో, తన ఛరిష్మాతో ఆశ్చర్యపరిచాడు. విడుదల చేసింది చిన్న గ్లింప్స్ కావొచ్చు.. కానీ ఇది దూసుకెళుతోంది. తెలుగు సినిమా ఖ్యాతిని మరో స్థాయికి ఇనుమడింపజేసే సినిమా ఇది అవుతుందని నిరూపించబోతోంది.
ఈ సినిమా మరేదో కాదు.. మిరాయ్. ప్రఖ్యాత పీపుల్స్ మీడియా నిర్మిస్తున్నీ ఈ ప్రతిష్ఠాత్మక చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని అనే యువ ప్రతిభావంతుడు తెరకెక్కిస్తున్నారు. అతడి ఆలోచన, అభిరుచి, వీఎఫ్ ఎక్స్ పనితనాన్ని తీసుకున్న విధానం, యాక్షన్ ఎపిసోడ్స్ ఎంపిక ప్రతిదీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇక హనుమాన్ తో పాన్ ఇండియాలో మ్యాజిక్ చేసిన యువహీరో తేజ సజ్జా, మిరాయ్ లో ఇంకా అద్భుతంగా కనిపిస్తున్నాడు. అతడి బాడీ లాంగ్వేజ్, ఫ్లెక్సిబిలిటీ భవిష్యత్ స్టార్ గా ఆవిష్కరిస్తోంది. ఇక బడ్జెట్లు పెడితే తెలుగు డైరెక్టర్లు హాలీవుడ్ రేంజు సినిమాలు తీయగలరనడానికి ఈ టీజర్ ఒక నాణ్యమైన ఉదాహరణగా నిలుస్తోంది.
అయితే బడా హీరోలతో వచ్చిన ఆ టీజర్ ఏదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హృతిక్ రోషన్- ఎన్టీఆర్ లాంటి అగ్ర హీరోలతో యష్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తున్న 'వార్ 2' భారీ విజువల్స్ - వీఎఫ్ ఎక్స్ కంటెంట్ తో రూపొందుతోంది. అయితే ఇక్కడ ఒకటే సమస్య. ప్రతిసారీ చూసేసిన విజువల్స్ నే తిరిగి చూపిస్తే, అది ఆడియెన్ కి కొత్తగా కనిపించదు... కిక్కివ్వదు.. రొటీన్ ఛేజ్ లు.. జంప్ లు.. స్టంట్స్ వగైరా ఇండియన్ ఆడియెన్ కి కొత్తేమీ కాదు. దానికి మించి ఇంకేదైనా చేయాల్సి ఉంటుంది. హృతిక్ ని ధూమ్ 2, క్రిష్ ఫ్రాంఛైజీలో చూసిన కళ్లు, ఇప్పుడు వార్ 2లో కొత్తగా చూడటం లేదు. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం ధూమ్, వార్ తరహా సినిమాలో నటించడం తన అభిమానులకు స్పెషల్ ట్రీట్ గా ఉంటుంది. కానీ దీనికి ముందు ఆర్.ఆర్.ఆర్ తో అంతకుమించిన మ్యాజికల్ వార్ యాక్షన్ ఎపిసోడ్స్ లో తారక్ ని చూసిన ప్రజలకు ఇంకా ఇంకా స్పెషల్ ఏదైనా కావాలి. అయితే ఇలాంటి విజువల్స్ లో కూడా తారక్ ని ఇంకా మెరుగ్గా క్రియేటివ్ గా ఆవిష్కరించాల్సి ఉంటుందని దర్శకుడు అయాన్ ముఖర్జీకి గుర్తు చేయడానికి విశ్లేషకులు వెనకాడటం లేదు. మారిన ప్రేక్షకుల అభిరుచి, పెరిగిన విజ్ఞానం దృష్ట్యా క్రియేటివిటీలో ఇంకా కొత్తదనం చాలా అవసరం. బడ్జెట్ల పరంగా చూస్తే మిరాయ్ కంటే, వార్ 2 బడ్జెట్ ఎన్నో రెట్లు ఎక్కువ. కానీ ఏం ప్రయోజనం. ఇప్పుడు బాలీవుడ్ చిత్రసీమ ఇన్ సెప్షన్, ఇంటర్ స్టెల్లార్ లను మించిన సినిమాలను దేశీ మాస్ కి కూడా ఎక్కేలా, స్థానికతతో చూపించాల్సి ఉంటుంది. అలాంటి సినిమాల్లో మాత్రమే తారక్, హృతిక్ లాంటి ట్యాలెంట్ ను ఉపయోగించుకోవాలి. అనవసరంగా ప్రతిభను వృథా చేయకూడదు. ఆగస్టులో వార్ 2 విడుదలవుతుండగా, సెప్టెంబర్ లో మిరాయ్ విడుదలవుతుంది. ఈ రెండిటిలో ఏది బెస్ట్ అనేది ప్రేక్షకులే తేల్చాల్సి ఉంది.
