Begin typing your search above and press return to search.

శేఖర్ కమ్ముల @25.. చిరు ఫిదా!

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు శేఖర్ కమ్ముల 25 ఏళ్ల సినీ ప్రస్థానంపై హృదయపూర్వక ఆశీర్వాద సందేశాన్ని అందించారు.

By:  Tupaki Desk   |   3 Jun 2025 4:17 PM IST
శేఖర్ కమ్ముల @25.. చిరు ఫిదా!
X

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు శేఖర్ కమ్ముల 25 ఏళ్ల సినీ ప్రస్థానంపై హృదయపూర్వక ఆశీర్వాద సందేశాన్ని అందించారు. శేఖర్ కమ్ముల ‘ఆనంద్’ సినిమాతో 2000లో దర్శకుడిగా అడుగుపెట్టి, ‘గోదావరి’, ‘హ్యాపీ డేస్’, ‘లీడర్’, ‘ఫిదా’, ‘లవ్ స్టోరీ’ లాంటి హిట్‌లతో ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు. ఇక నెక్స్ట్ కుబేర సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే.

సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు నిర్మాణంలో ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న నటిస్తున్న ఈ సినిమాతో మరోసారి సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. చిరంజీవి శేఖర్ కమ్ములకు తన విషెస్ అందిస్తూ.. “మై డియర్ శేఖర్, మీలాంటి అభిమాని ఉండటం నాకు ఆనందకరం. మీ ప్రస్థానానికి స్ఫూర్తి నిచ్చానని తెలిసి సంతోషించాను. మీ 25 ఏళ్ల జర్నీలో నేను భాగమైనందుకు గర్వంగా ఉంది” అని రాశారు.

శేఖర్ సినిమాల్లో సున్నితమైన వినోదంతో పాటు సామాజిక సందేశాన్ని జత చేసే తీరును ఆయన ప్రశంసించారు. శేఖర్ ఫిల్మ్‌మేకింగ్‌లో ప్రత్యేక శైలిని సృష్టించుకున్నారని కొనియాడారు. మరో 25 ఏళ్లు శేఖర్ కమ్ముల మరెన్నో సినిమాలు తీసి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

“సున్నితమైన వినోదంతో సామాజిక సందేశాన్ని జత చేసే మీ సినిమాలు నాకు ఎంతో ఇష్టం. ఇలాగే మరో 25 ఏళ్లు మరెన్నో సినిమాలు ‘వ్రాస్తూ’, తీస్తూ, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశీర్వదిస్తున్నాను” అని పేర్కొన్నారు. ఈ రికార్డ్ పై శేఖర్‌కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

శేఖర్ కమ్ముల ‘కుబేర’ సినిమా జూన్ 20న విడుదల కానుంది. ఈ సినిమా సమాజంలో ఆర్థిక అసమానతలు, అధికార ఆకాంక్షల చుట్టూ తిరుగుతుందని, ధనుష్ ఒక బిచ్చగాడు పాత్రలో, నాగార్జున ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా నటిస్తున్నారని టీజర్ హైలెట్ చేసింది. ఇక మరోవైపు చిరంజీవి ‘విశ్వంభర’ సినిమా ఫాంటసీ యాక్షన్ డ్రామాగా, వసిష్ఠ డైరెక్షన్‌లో రూపొందుతోంది. త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా రూ. 200 కోట్ల బడ్జెట్‌తో UV క్రియేషన్స్ నిర్మిస్తోంది. అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వంలో కూడా మెగాస్టార్ ఒక మాస్ సినిమాను స్టార్ట్ చేశారు.