Begin typing your search above and press return to search.

నాన్న క‌ల కోసం హీరోయిన్ గా!

సాధారణంగా మధ్యతరగతి కుటుంబాల్లో పిల్లలు డాక్టర్లో? ఇంజనీర్లో? కావాలని తల్లిదండ్రులు కోరుకుంటారు.

By:  Tupaki Desk   |   29 March 2026 9:00 PM IST
నాన్న క‌ల కోసం హీరోయిన్ గా!
X

సాధారణంగా మధ్యతరగతి కుటుంబాల్లో పిల్లలు డాక్టర్లో? ఇంజనీర్లో? కావాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. ముఖ్యంగా సినిమా రంగుల ప్రపంచం అంటే ఒక రకమైన భయం, అభద్రతా భావం ఉండటం సహజం. కానీ నటి మాళవిక నాయర్ విషయంలో కథ పూర్తిగా భిన్నం. తన తండ్రి కన్న కలనే తన శ్వాసగా మార్చుకుని నేడు టాలీ వుడ్‌లో ప్రతిభావంతమైన నటిగా ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమా నేపథ్యం లేకపోయినప్పటికీ మాళవిక తండ్రికి వెండితెరపై మెరవాలనే బలమైన కోరిక ఉండేది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన నటుడు కాలేకపోయారు.

అయితే తనలో మిగిలిపోయిన ఆ అసంతృప్తిని తన కుమార్తె విజయంలో వెతుక్కున్నారు. తండ్రి ఆశయాన్ని కుమార్తెపై బలవంతంగా రుద్దకుండా ఆమెలోని నటన పట్ల ఉన్న ఆసక్తిని గమనించి ఆమెను ప్రోత్సహించి సరైన మార్గంలో నడిపించారు. చాలామంది తల్లిదండ్రులు సినిమా అంటే వద్దు అని వారించే ఈ రోజుల్లో, మాళవిక తండ్రి ఆమెకు వెన్నుముకగా నిలిచారు. కేరళకు చెందిన బ్యూటీ తెలుగులో `ఎవడే సుబ్రహ్మణ్యం`, `కల్యాణ వైభోగమే` విజేత స‌హా దాదాపు ప‌ది సినిమాల్లో న‌టించి తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకుంది. గ్లామర్ కంటే నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తండ్రి గర్వపడేలా కెరీర్‌ను నిర్మించుకుంటుంది.

ఈ ప్రయాణం అంత సులభంగా సాగలేదు. బయటి వ్యక్తులకు సినిమా గ్లామర్ కనిపిస్తుంది కానీ దాని వెనుక ఉండే శ్రమ, ఒత్తిడి మాళవిక తండ్రికి తెలుసు. అందుకే ఆమె చదువును దెబ్బ‌తిన‌య‌కుండా సినిమా రంగంలో మెళ కువలు నేర్చుకునేలా ఆయన జాగ్రత్త పడ్డారు. తన తండ్రి తనపై ఉంచిన నమ్మకమే తనను ఈ స్థాయికి చేర్చిందని మాళవిక పలు ఇంటర్వ్యూల్లో ఎమోషనల్‌గా చెప్పుకొచ్చారు. అలాగే అమ్మ‌డు చ‌ద‌వుల్లోనూ మంచి బ్రిలియంట్. పుస్త‌కాల పురుగు. త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన లైబ్ర‌రీ కూడా ఉంది. చ‌ద‌వ‌డం కోస‌మే గంట‌ల పాటు స‌మ‌యాన్ని కేటాయిస్తుంది.

ఎవ‌రికైనా చ‌ద‌వ‌మంటే బోర్ కొడుతుంది. కానీ మాళ‌విక‌ను చ‌ద‌వుకోమంటే? ఆ చ‌దువుకే చిరాకు పుట్టించేలా చ‌దువుతుతుందిట‌. నేటి తరానికి మాళవిక నాయర్ ప్రయాణం చక్కని ఉదాహరణ. తల్లిదండ్రుల ప్రోత్సాహం, పిల్లల కృషి తోడైతే ఏ రంగంలోనైనా రాణించవచ్చని ఆమె నిరూపించారు. తన తండ్రి కన్న కలని సాకారం చేయడమే కాకుండా తనదైన సహజ సిద్ధమైన నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లోస్థానాన్ని ప‌దిలం చేసుకుంటుంది. త్వ‌ర‌లో `బైక‌ర్` సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఇందులో అమ్మ‌డు శ‌ర్వానంద్ కు జోడీగా న‌టించింది. ఈ సినిమాపై మంచి అంచ‌నాలున్నాయి. అలాగే పాన్ ఇండియా లో రిలీజ్ అయిన `క‌ల్కి 2898`లో కూడా మాళ‌విక‌ న‌టించింది. `క‌ల్కి 2` లో కూడా మాళ‌విక పాత్ర ఉంటుంద‌ని న‌మ్ముతుంది. ఎందుకంటే త‌న‌లో ట్యాలెంట్ గుర్తించి తొలుత అవ‌కాశం ఇచ్చింది నాగ్ అశ్విన్. అప్ప‌టి నుంచి నాగీ త‌న ప్ర‌తీ సినిమాలోనూ భాగం చేస్తున్నారు.