సినిమా వ్యాపారం.. దయాధర్మం కాదు! మధురా శ్రీధర్ సంచలన పోస్ట్!
పరిశ్రమలోని కొందరు వ్యక్తులు ప్రతి చిన్న విషయానికి మైకుల ముందుకు వచ్చి ఏడవడంపై ఆయన ఘాటుగా స్పందించారు.
By: Sivaji Kontham | 27 May 2026 4:44 PM ISTటాలీవుడ్‌ను ప్రస్తుతం కుదిపేస్తోన్న `పర్సంటేజ్ వర్సెస్ రెంటల్` వివాదం రోజురోజుకూ ముదురుతోంది. థియేటర్ల యజమానులు తమకు కలెక్షన్లలో పర్సంటేజీ విధానం కావాలని పట్టుబడుతుండగా, నిర్మాతలు మాత్రం పాత అద్దె విధానమే మేలని వాదిస్తున్నారు. ఈ సంక్షోభంపై నియమించిన కమిటీ నివేదిక జూన్ 30న రావాల్సి ఉన్నా.. ఈలోగానే ఇరు వర్గాలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ఎగ్జిబిటర్లు పరిశ్రమ పెద్ద దిక్కు మెగాస్టార్ చిరంజీవిని కలిసి పరిష్కారం కోరడంతో ఆయన రంగప్రవేశం చేసి మే 30 లోపు సయోధ్య కుదిర్చేందుకు చర్చలు జరుపుతున్నారు. మరోవైపు నిర్మాతలు నేరుగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను కలిసి తమ గోడును వెల్లబోసుకున్నారు. ఇలా ఇండస్ట్రీ పెద్దలు, రాజకీయ ప్రముఖుల చుట్టూ ఈ పంచాయితీ తిరుగుతున్నా వివాదానికి ఇంకా తెరపడలేదు.
ఈ ఉత్కంఠభరిత వాతావరణంలో టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నిర్మాత మధురా శ్రీధర్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా సినిమా వ్యాపారంపై చేసిన ఒక సుదీర్ఘమైన పోస్ట్ ఇప్పుడు ఇండస్ట్రీలో సరికొత్త చర్చకు- డిబేట్‌కు తెరతీసింది. పరిశ్రమలోని కొందరు వ్యక్తులు ప్రతి చిన్న విషయానికి మైకుల ముందుకు వచ్చి ఏడవడంపై ఆయన ఘాటుగా స్పందించారు. ``ఏ వ్యాపారంలోనైనా నష్టాలు, ఒత్తిళ్లు, రిస్కులు సహజం. వాటిని ముందుగానే ఊహించి అర్థం చేసుకున్నవారే రంగంలోకి దిగుతారు. సినిమా వ్యాపారం కూడా ఇందుకు మినహాయింపు ఏమీ కాదు`` అంటూ ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
మధురా శ్రీధర్ తన విశ్లేషణను కొనసాగిస్తూ.. ఇండస్ట్రీలోని ప్రస్తుత ధోరణిని తీవ్రంగా తప్పుపట్టారు. పరిస్థితులు నిజంగా అనుకూలంగా లేకపోతే సినిమాలు తీయడం ఆపేయండి.. ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోండి. అంతేకానీ ప్రతిసారీ మైకుల ముందుకు వచ్చి `సమస్యలు.. సమస్యలు..` అంటూ ఏడవడం వల్ల కేవలం సినీ పరిశ్రమ ప్రతిష్ట మాత్రమే దిగజారుతుంది. చూసేవారికి ఇదేదో ప్రపంచాన్ని కుదిపేసే అంతర్జాతీయ సమస్యలా లేదా భారతదేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సంక్షోభంలా బిల్డప్ ఇస్తున్నారు. సినిమా అనేది ఒక పక్కా వ్యాపారం.. అంతే తప్ప ఇదేమీ దయాధర్మం కాదు! అని ఆయన చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.
సినిమాలు తీసే విధానంపై, వ్యక్తిగత మేనేజ్‌మెంట్‌పై నిర్మాతలకు ఆయన కొన్ని కీలక సూచనలు చేశారు. ``సినిమాలను చిత్తశుద్ధితో తీయండి. వర్కవుట్ అయితే ఇండస్ట్రీలో ఉండండి.. లేదంటే బయటకు వెళ్లి వేరే ఏదైనా వ్యాపారం చూసుకోండి. ఒక సినిమాలో నష్టం వస్తే ఆ నష్టాన్ని భరించే శక్తి మీకు ఉంటేనే మరో సినిమా తీయండి. లేదంటే అక్కడితో ఆపేయండి. అంతే కానీ మీ వ్యక్తిగత సమస్యలను, మీ కంపెనీ సమస్యలను, మీ ఆర్థిక ఇబ్బందులన్నింటినీ తెచ్చి సినిమా ప్రాజెక్టు మీదా, ఇండస్ట్రీ మీద రుద్దకండి`` అంటూ ఇండస్ట్రీలోని కొందరి మేనేజ్‌మెంట్ లోపాలను ఎండగట్టారు.
సినిమా రంగాన్ని `బాధల వేదిక` గా మార్చవద్దని ఆయన వినమ్రంగా కోరారు. సినిమా అనేది ఒక అద్భుతమైన మాధ్యమం. దానిని దుఃఖాలు చెప్పుకునే వేదికగా మార్చకండి. నిజాయితీతో సినిమాలు తీయండి.. ప్రతి మంచి సినిమాకు ప్రేక్షకుల హృదయాల్లో కచ్చితంగా మంచి స్థానం లభిస్తుంది! అంటూ ఆయన సానుకూల ముగింపు ఇచ్చారు. పర్సంటేజీల గొడవలతో ఇండస్ట్రీ పరువు బజారున పడుతోందని ఇండస్ట్రీ వర్గాల్లో అంతర్గతంగా సాగుతున్న ఆందోళనకు మధురా శ్రీధర్ పోస్ట్ అద్దం పడుతోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
