Begin typing your search above and press return to search.

ఈగోతో కెరీర్‌ని న‌ష్ట‌పోయిన టాప్ హీరోయిన్

ఈగో లేనిదే ఏదీ లేదు! అది ప్ర‌తి ఒక్క‌రినీ వెంటాడే భూతం. 'నేను' అనేది కొన్నిసార్లు డామినేట్ చేస్తుంది

By:  Tupaki Desk   |   26 Feb 2024 11:30 AM GMT
ఈగోతో కెరీర్‌ని న‌ష్ట‌పోయిన టాప్ హీరోయిన్
X

ఈగో లేనిదే ఏదీ లేదు! అది ప్ర‌తి ఒక్క‌రినీ వెంటాడే భూతం. 'నేను' అనేది కొన్నిసార్లు డామినేట్ చేస్తుంది. అయితే ఇదే ఈగో ఒక్కోసారి కెరీర్ ని స‌ర్వ‌నాశ‌నం చేసినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. 90ల‌లో ప్ర‌ముఖ న‌టిగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుని, ఆ త‌ర్వాత స్టార్ హీరోయిన్ గా అనుకున్న స్థాయికి ఎద‌గ‌లేక‌పోయిన ఒక న‌టి.. త‌న ఈగో వ‌ల్ల‌.. తాను త‌న‌ ద‌ర్శ‌కుడికి క్రెడిట్ ఇవ్వ‌క‌పోవ‌డం వ‌ల్ల‌ తీవ్రంగా న‌ష్ట‌పోయాన‌ని అంగీక‌రించింది. ఆ రోజు ఆయ‌న‌కు క్రెడిట్ ఇవ్వాల్సింద‌ని, నేను అనే అహంకార‌మే అడ్డు ప‌డింద‌ని కూడా బ‌హిరంగంగా వెల్ల‌డించింది.

అంతేకాదు ఆ రోజు తాను త‌న విజ‌యానికి క్రెడిట్ ద‌ర్శ‌కుడికి ఇవ్వాల్సి ఉంద‌ని కూడా అంగీక‌రించింది. కానీ తాను త‌న ద‌ర్శ‌కుడితో మంచి బంధం మెయింటెయిన్ చేయ‌లేక‌పోయాన‌ని ఒప్పుకున్నారు. ఈ ఎపిసోడ్ లో క‌ర్త ఎవ‌రు? అంటే.. ప్ర‌ముఖ క‌థానాయిక మ‌ధు బాల‌. 'రోజా' చిత్రం సాధించిన‌ విజయానికి మణిరత్నంకి క్రెడిట్ ఇవ్వనందుకు రిలేష‌న్ షిప్‌ని కోల్పోయాన‌ని, తన అహంకారం బాధ దీనికి కార‌ణ‌మ‌ని తెలిపింది. మణిరత్నంతో మంచి బంధం మెయింటైన్ చేయకపోవడం వల్లే మళ్లీ ఆయ‌న సినిమాల్లో నటించలేదని మధు చెప్పింది.

1992 చిత్రం 'రోజా'లో త‌న న‌ట‌న‌కు గొప్ప పేరొచ్చింది. ఎప్ప‌టికీ త‌న జీవితాంతం గుర్తుండిపోయే ఈ చిత్రం విజయం తర్వాత త‌న ద‌ర్శ‌కుడు మణిరత్నంతో సంబంధం కొన‌సాగించ‌లేక‌పోయాన‌ని మ‌ధుబాల అన్నారు. ఈ వైఖరి కారణంగా పరిశ్రమలో కొన్ని బంధాలను సృష్టించడంలో విఫలమ‌య్యాన‌ని..ప్రారంభ రోజుల్లో మణిరత్నంకు తాను ఎందుకు క్రెడిట్ ఇవ్వలేదో కూడా మ‌ధుబాల‌ వివరించింది. అయితే రోజా విజ‌యంలో, త‌న న‌ట‌న‌కు వ‌చ్చిన పేరుకు మణిరత్నంకే క్రెడిట్ ద‌క్కాలి. అత‌డు ఎందుకు అర్హుడో తనకు ఇప్పుడు అర్థమైందని.. అప్పుడు ఆయనను మెచ్చుకోనందుకు చింతిస్తున్నానని మధు తాజా ఇంట‌ర్వ్యూలో చెప్పింది.

సిద్ధార్థ్ కన్నన్‌తో ఒక ఇంటర్వ్యూలో రోజా 'ఇరువర్' తర్వాత మణిరత్నం చిత్రాలలో నటించడం లేదని అడిగారు. మధు మాట్లాడుతూ.. ''మణి సర్‌కి వేర్వేరు ఆర్టిస్టులతో బంధం ఏర్పడి ఉండవచ్చు ..నేను చాలాసార్లు చేరుకోవాలని ప్రయత్నించాను. నేను సందేశాలు పంపాను. ఆయనంటే నాకు చాలా అభిమానం. ఆ సమయంలో నేను ఎవరినీ నా గాడ్‌ఫాదర్‌గా భావించలేదు. మణి సర్ నాకు మేలు చేశారని నాకు అనిపించలేదు.. అని మ‌ధు అన్నారు. ''మణి సార్‌కి రోజా కావాలి, నాలో తన రోజా కనిపించింది. అందులో ప్రత్యేకత ఏమిటి?'' ఇదీ నా వైఖరి... అంటూ త‌న ప్ర‌వ‌ర్త‌న గురించి విశ‌ద‌ప‌రిచింది మ‌ధుబాల‌.

ఈ చిత్రం తర్వాత అహంకారం మొద‌లైందా? అని అడిగినప్పుడు.. ''ఇది బాధాకరమైన ప్రదేశం నుండి వచ్చింది'' అని న‌ర్మ‌గ‌ర్భంగా చెప్పింది. తన కెరీర్ లో తనను ఎవరూ సపోర్ట్ చేయలేదని మధు చెప్పింది. తన మేకప్ నుండి కాస్ట్యూమ్స్ వరకు అన్నీ తానే చేశానని మ‌ధుబాల‌ పేర్కొంది. 'నేను' అనే అంశం ఉంది. నేను అన్నీ చేసాను. నేను ఎవరికీ క్రెడిట్ ఇవ్వడానికి నిరాకరించాను.. అని కూడా మ‌ధుబాల వెల్ల‌డించింది. ఈ వైఖరి ఇత‌రులకు చికాకు కలిగించవచ్చని కూడా అన్నారు.

''మణి సర్‌కి క్రెడిట్‌ దక్కుతుంది. ఆ సమయంలోనే ఆయనకు చెప్పాల్సింది. ఇప్పుడు క్రెడిట్ అంతా అతడికే ఇస్తున్నాను. ఆయ‌నే నాకు గుర్తింపునిచ్చారు. నేను చాలా మంచి బంధాలను ఏర్పరచుకోలేదు.. అందుకే నేను సినిమాల్లో పునరావృతం కాలేదు'' అని తెలిపారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. మ‌ధు బాల‌ ఇటీవల సమంత రూత్ ప్రభు నటించిన 'శాకుంతలం' చిత్రంలో మేనక పాత్రను పోషించింది. తమిళ వెబ్ షో 'స్వీట్ కారం కాఫీ'లో కూడా కనిపించింది. త‌దుప‌రి వ‌రుస చిత్రాల్లో న‌టించేందుకు ప్ర‌య‌త్నాల్లో ఉంది.