మెగాస్టార్ ఆఫర్ తిరస్కరించిన మధుబాల
రోజా చిత్రంతో సౌత్ లో అడుగుపెట్టింది మధుబాల. ఫూల్ ఔర్ కాంటే తర్వాత రోజా చిత్రంలో నటనకు గొప్ప పేరు తెచ్చుకుంది.
By: Tupaki Desk | 2 July 2025 5:00 AM ISTరోజా చిత్రంతో సౌత్ లో అడుగుపెట్టింది మధుబాల. ఫూల్ ఔర్ కాంటే తర్వాత రోజా చిత్రంలో నటనకు గొప్ప పేరు తెచ్చుకుంది. దక్షిణాదిన మేటి కథానాయికగా నిరూపించిన మధూ హిందీ పరిశ్రమలోను తనదైన ముద్ర వేసింది. కానీ 1999లో సడెన్ గా ఆనంద్ షా అనే వ్యక్తిని వివాహం చేసుకుని సినిమాలకు దూరమైంది.
అయితే అప్పట్లోనే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సినిమాలో నటించే అవకాశం వరించినా, దానిని నిరభ్యంతరంగా తిరస్కరించానని మధుబాల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే ఈ ఆఫర్ ని తిరస్కరించడానికి కారణం పెళ్లి కుదరడమేనని తెలిపింది. అప్పటికే పెళ్లి తేదీ ఫిక్స్ చేసారు..పెద్ద ఆఫర్ కాదనుకున్నాను. ఆ అవకాశం సౌందర్యకు వెళ్లింది అని తెలిపింది. ఈ సినిమా - సూర్య వంశం. అమితాబ్ బచ్చన్, జయసుధ సహా ప్రముఖ ఆర్టిస్టులు నటించిన ఈ హిందీ చిత్రం పెద్ద ఫ్లాపైంది. కానీ ఆ తర్వాత కల్ట్ ఫాలోయింగ్ తో బుల్లితెరపై ఆదరణ దక్కించుకుంది.
మధుబాల చాలా గ్యాప్ తీసుకున్న తర్వాత టాలీవుడ్ లో `అంతకుముందు ఆ తరవాత` అనే చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది. ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ తర్వాత వరుసగా టాలీవుడ్ కోలీవుడ్ చిత్రాలతో బిజీ అయిన సంగతి తెలిసిందే. ఇటీవల మధుబాల తిరిగి సినిమాలతో బాగా బిజీ అవుతోంది.
తాజా ఇంటర్వ్యూలో తాను బిజీ నాయికగా ఉన్న సమయంలో వరుసగా అవకాశాలొస్తున్నా, ఎందుకనో నటనపై విసుగు చెందానని మధుబాల చెప్పింది. కమర్షియల్ సినిమాల ఒరవడిలో వాస్తవిక దర్శకులతో పని చేయకపోవడం అసంతృప్తికి కారణమైందని చెప్పింది. బాలీవుడ్ లో ఏ లిస్టర్లతో అవకాశాల్ని కాదనుకుని సౌత్ లో వాస్తవికతను చూపే దర్శకులతో పని చేయడం ప్రారంభించానని మధుబాల పేర్కొంది.
మధూ ఇటీవల `కన్నప్ప`లో కనిపించింది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ భక్తి చిత్రంలో విష్ణు మంచు ప్రధాన పాత్రలో మోహన్ బాబు, ఆర్. శరత్ కుమార్, అర్పిత్ రంకా, బ్రహ్మానందం తదితరులు నటించారు. మధు బాల తదుపరి `చిన్న చిన్న ఆసై`లో కనిపించనున్నారు. ఈ రొమాంటిక్ డ్రామాను వర్ష వాసుదేవ్ రచించి దర్శకత్వం వహించారు.
