వాళ్ల స్థానాలు ఎవరు చేజిక్కించుకుంటారో?
దళపతి విజయ్ `జననాయగన్` రిలీజ్ అనంతరం సినిమాలకు స్వస్తి పలుకుతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 6 May 2025 9:00 AM ISTదళపతి విజయ్ `జననాయగన్` రిలీజ్ అనంతరం సినిమాలకు స్వస్తి పలుకుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తన రిటైర్మెంట్ ను అధికారికంగా ప్రకటించారు. `జన నాయగన్` విడుదల తర్వాత రాజకీయంగా బిజీ అవుతారు. మళ్లీ సినిమాల్లోకి వస్తారా? రారా? అన్నది కాలమే నిర్ణయించాలి. అయితే విజయ్ కోలీవుడ్ లో టాప్ -5 హీరోల్లో ఒకరు. సీనియర్ జనరేషన్ పక్కన బెడితే తర్వాత జనరేషన్ హీరోల్లో నెంబర్ వన్ ఎవరు? అంటే విజయ్ పేరు వినిపిస్తుంది.
కోట్లాది మంది అభిమానులున్న స్టార్. అందుకే రాజకీయ పార్టీ స్థాపించి ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నాడు. ఇండస్ట్రీలో తమిళ చిత్ర సీమలో తనకంటూ కొన్ని పేజీలు రాసుకున్నారు. అవి చరిత్రలో చిర స్థాయిగా ఉంటాయి. అలాగే తల అజిత్ కూడా సినిమాల నుంచి ఏక్షణమైనా తప్పుకునే అవకాశం ఉందన్నారు. కార్ రేసింగ్ కంటే సినిమాలపై పెద్దగా ఆసక్తి లేదన్నారు. చాలా సందర్భాల్లో నటుడిగా తన అనాసక్తిని వ్యక్తం చేసారు.
సినిమాలు చేయడం తప్ప వాటి ప్రచార కార్యక్రమాల్లో కూడా ఆయన పెద్దగా పాల్గొనడం లేదు. స్టార్ హీరోలంతా పాన్ ఇండియా మార్కెట్ అంటూ అడుగులు వేస్తుంటే అజిత్ అలాంటి ఆలోచన లేకుండా? ఎప్పుడు ఇండస్ట్రీ నుంచి ఎగ్జిట్ అవుదామా? అని ఎదురు చూస్తున్నాడు. అలాగని వారసుడిని రంగంలోకి దింపే అవకాశం ఉందా? అంటే అందుకు చాలా సమయం ఉంది. ఇంకా చదువుకుంటున్నారు.
సినిమాలంటే ఆసక్తి ఉందా? లేదా? అన్నది క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో విజయ్, అజిత్ స్థానాలు తదు పరి ఏ హీరో దక్కించుకుంటాడు? అన్నది ఆసక్తికరంగా మారింది. ధనుష్, సూర్య, కార్తీ లాంటి నటులు విజయ్ ప్లేస్ లోకి వెళ్లే అవకాశం ఉంది. సూర్య, కార్తీ లకంటే మెరుగైన స్థానంలో ధనుష్ ఉన్నాడు. ఇక అజిత్ స్థానం విషయంలో మాత్రం ఏనటుడు కనిపించలేదు. ఆ స్థానాన్ని రీప్లేస్ చేయడం అంత సులభం కాదన్నది కోలీవుడ్ వర్గాల మాట.
