తమిళంలో హిట్.. తెలుగులో ఫట్.. మరీ అంత తేడానా!
కోలీవుడ్ కు చెందిన అనేక మంది హీరోల సినిమాలు.. తెలుగులో కూడా ఎప్పటికప్పుడు రిలీజ్ అవుతుంటాయి.
By: Tupaki Desk | 5 May 2025 10:48 AM ISTకోలీవుడ్ కు చెందిన అనేక మంది హీరోల సినిమాలు.. తెలుగులో కూడా ఎప్పటికప్పుడు రిలీజ్ అవుతుంటాయి. అదే సమయంలో అక్కడి హీరోల్లో చాలా మందికి టాలీవుడ్ లో స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. వారి సినిమాలు వస్తున్నాయంటే చాలు.. ఎంతో వెయిట్ చేస్తుంటారు. థియేటర్లలో ఫస్ట్ డే చూడాలని సిద్ధమవుతుంటారు.
అయితే కొంతకాలంగా కోలీవుడ్ సినిమాలు తేలిపోతున్నాయని చెప్పాలి. ముఖ్యంగా తెలుగు సినీ ప్రియులను మెప్పించలేకపోతున్నాయి. ఒకప్పుడు దేశంలోనే టాప్ ఇండస్ట్రీగా పేరుగాంచిన తమిళ చిత్రసీమ నుంచి వస్తున్న సినిమాలు అలరించలేకపోతున్నాయి. కానీ కోలీవుడ్ లో ఆయా చిత్రాలు సూపర్ హిట్స్ గా నిలుస్తున్నాయి.
బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు కూడా రాబడుతున్నాయి. రొటీన్ మాస్ మసాలా మూవీస్ అయినా అక్కడ అదరగొడుతున్నాయి. రీసెంట్ గా రెండు సినిమాల విషయంలో అదే జరిగింది. గత నెలలో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్.. గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే.
ఆ సినిమా తెలుగులో సాధారణ చిత్రంగా నిలిచింది. అదే తమిళంలో మంచి వసూళ్లను రాబట్టింది. పలు రికార్డులు కూడా క్రియేట్ చేసింది! ఇప్పుడు సూర్య రెట్రో మూవీ కూడా అదే కోవలోకి వెళ్తోంది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఆ సినిమాపై తెలుగు ప్రేక్షకులు భారీ హోప్స్ పెట్టుకున్నారు. మూవీ అలరిస్తుందని అనుకున్నారు.
కానీ తెలుగు ఆడియన్స్ కు నచ్చలేదు. రెండో రోజే పేలవ వసూళ్లు వచ్చాయి. ఆ సినిమా టాలీవుడ్ లో ఫ్లాపే. అదే కోలీవుడ్ లో రెట్రో మూవీని అంతా కొనియాడుతున్నారు. థియేటర్స్ కు తరలివెళ్తున్నారు. మంచి వసూళ్లు వచ్చేలా చేస్తున్నారు. వీకెండ్ ఫిగర్స్ ను చూస్తుంటే మూవీ హిట్ అయినట్లు ఉంది. అలా అది చూసి అంతా షాకవుతున్నారు. తమిళ, తెలుగు సినీ ప్రియుల అభిరుచుల్లో చాలా తేడా ఉందని చెబుతున్నారు.
