'గ్యాంగ్' తర్వాత సూర్య-కీర్తి కాంబో మిస్.. ఆ తెలుగు హీరోనే కారణమా?
By: Tupaki Desk | 30 May 2025 12:00 AM IST'మహానటి'గా తెలుగు ప్రేక్షకులను అలరించిన కీర్తి సురేశ్, ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయి తన నటనతో మెప్పించగల నటిగా పేరుపొందింది. ఆమె పెళ్లి తర్వాత కూడా సినీ కెరీర్ కొనసాగిస్తూ వరుస ఆఫర్లతో బిజీగా మారింది. తాజాగా, ఓ ఆసక్తికరమైన వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తమిళ హీరో సూర్యతో కలిసి నటించే అవకాశాన్ని కీర్తి సురేశ్ వదులుకుందని, దీనికి కారణం ఓ తెలుగు హీరో సినిమా అని అంటున్నారు .
ప్రస్తుతం సూర్య హీరోగా, వెంకీ అట్లూరి దర్శకత్వంలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఆయన 46వ సినిమా రూపొందనుంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించే అవకాశం కీర్తి సురేశ్‌ను వరించిందట. అయితే, విజయ్ దేవరకొండతో జతకట్టే అవకాశం రావడంతో కీర్తి సురేశ్ సూర్య సినిమాను వదులుకుందని తెలుస్తుంది . సూర్య, కీర్తి గతంలో 'గ్యాంగ్' సినిమాలో కలిసి నటించారు. మరి ఈ కొత్త ప్రచారంలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ, కీర్తి పెళ్లి తర్వాత కూడా వరుస ఆఫర్లతో దూసుకుపోతోందని స్పష్టమవుతోంది.
బాలీవుడ్‌లో కీర్తి సురేశ్ తొలి సినిమా 'బేబీ జాన్' ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, ఆమెకు అక్కడ మరో అవకాశం దక్కింది. దేశంలోని ప్రస్తుత విద్యా వ్యవస్థ విధానంపై బాలీవుడ్‌లో ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేశ్, రాజ్ కుమార్ రావు సరసన నటించనుందని సమాచారం. 'సెక్టార్ 36' ఫేమ్ ఆదిత్య నింబాల్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారట. పలువురు బాలీవుడ్ దర్శకనిర్మాతలు ఇప్పటికే కీర్తితో చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. ఇది ఆమె కెరీర్‌కు మంచి బూస్ట్ ఇచ్చే అవకాశం ఉంది.
ఇక సూర్య విషయానికి వస్తే, ఆయన వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ఇటీవల 'కంగువా' సినిమాతో బిజీగా ఉన్న ఆయన, ఇప్పుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో కొత్త సినిమాను మొదలుపెట్టారు. 'సార్', 'లక్కీ భాస్కర్' వంటి చిత్రాలతో వెంకీ అట్లూరి సౌత్ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. ఈ క్రమంలో కీర్తి సురేశ్ ఎంపికపై వస్తున్న వార్తలు సినిమా పరిశ్రమలో మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
