Begin typing your search above and press return to search.

ఎట్ట‌కేల‌కు ఐదేళ్ల‌కు ప‌ట్టాలెక్కుతోన్న ఏవియేష‌న్ థ్రిల్ల‌ర్!

బాలీవుడ్ యువ సంచ‌ల‌నం కార్తీక్ ఆర్యన్ న‌టిస్తోన్న‌ అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం `కెప్టెన్ ఇండియా` గురించి ఓ కీలక అప్‌డేట్ వెలువడింది.

By:  Tupaki Desk   |   24 April 2026 4:00 PM IST
ఎట్ట‌కేల‌కు ఐదేళ్ల‌కు ప‌ట్టాలెక్కుతోన్న ఏవియేష‌న్ థ్రిల్ల‌ర్!
X

బాలీవుడ్ యువ సంచ‌ల‌నం కార్తీక్ ఆర్యన్ న‌టిస్తోన్న‌ అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం `కెప్టెన్ ఇండియా` గురించి ఓ కీలక అప్‌డేట్ వెలువడింది. ఐదేళ్ల క్రితం ప్ర‌క‌టించిన‌ సినిమా అనేక మలుపుల తర్వాత ఎట్టకేలకు పట్టాలె క్కేందుకు సిద్ధమైంది. ఈ చిత్రానికి సంబంధించి తాజాగా విడుదల తేదీని కూడా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కార్తీక్ ఆర్యన్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తోన్న‌ ఈ ఏవియేషన్ థ్రిల్లర్ 2027 ఆగస్టు 13న విడుదల కానుంది. 2027లో రిలీజ్ అవుతోన్న భారీ దేశభక్తి చిత్రాలలో ఇది ఒకటిగా నిలవనుంది. ఆగస్టు నెలలో సెలవులు కలిసొచ్చే సమయం కాబ‌ట్టి బాక్సాఫీస్ వసూళ్లకు ఎంతో కీలకమని మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ దర్శకుడు షిమిత్ అమిన్. `చక్ దే ఇండియా` వంటి క్లాసిక్ సినిమాను అందించిన షిమిత్ సుదీర్ఘ విరామం తర్వాత మెగాఫోన్ పడుతున్నారు. దాదాపు 17 ఏళ్ల తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న ఫీచర్ ఫిలిం ఇదే కావడం విశేషం. కార్తీక్ ఆర్యన్ - షిమిత్ అమిన్ తొలిసారి కలిసి పని చేస్తుండటంతో ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కార్తీక్ ఆర్యన్ వైమానిక దళ పైలట్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఓ భారీ రెస్క్యూ ఆపరేషన్ నేపథ్యంలో కథ సాగుతుందని సమాచారం.

యాక్షన్, ఎమోషన్స్ కలగలిసిన ఈ పాత్ర కోసం కార్తీక్ ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాడు. అతని కెరీర్‌లోనే ఇదో విభిన్నమైన , సవాలుతో కూడిన పాత్ర కానుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ లేదా జులైలో ప్రారంభం కానుంది. ఇండియా , మొరాకో వంటి దేశాలు స‌హా భారీ సెట్టింగ్‌ల మధ్య చిత్రీకరణ జరపాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే లొకేషన్ల ఎంపిక పూర్తయింది. టి-సిరీస్ - బావేజా స్టూడియోస్ సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. హర్మన్ బావేజా ఈ చిత్రానికి రచయితగా - నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

వాస్త‌వానికి హన్సల్ మెహతా ఈ చిత్రానికి దర్శకత్వం వహించాల్సి ఉంది. కొన్ని కారణాలతో షిమిత్ అమిన్ చేతుల్లోకి ఈ ప్రాజెక్ట్ వెళ్ళింది. ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్ `నాగ్జిల్లా` స‌హా అనురాగ్ బసు మ్యూజికల్ సాగా వంటి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఆ చిత్రాల తర్వాత కార్తీక్ పూర్తి స్థాయిలో `కెప్టెన్ ఇండియా`పై దృష్టి పెడ‌తాడు. దేశభక్తి నేపథ్యంలో సాగే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తుందని చిత్ర వర్గాలు భావిస్తున్నాయి.