స్టార్ హీరో బ్యానర్‌లో మరో స్టార్ హీరో..!
యూనివర్శల్ స్టార్ కమల్ హాసన్ తాజాగా థగ్ లైఫ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమాకు మణిరత్నం దర్శకత్వం వహించినప్పటికీ ఆశించిన స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకోలేక పోయింది.
By: Tupaki Desk | 10 Jun 2025 7:00 PM ISTయూనివర్శల్ స్టార్ కమల్ హాసన్ తాజాగా థగ్ లైఫ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమాకు మణిరత్నం దర్శకత్వం వహించినప్పటికీ ఆశించిన స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకోలేక పోయింది. ఏకంగా నాయగన్ సినిమాను మరిపిస్తుంది అంటూ కామెంట్స్ చేసి మరీ ప్రమోట్ చేశారు. కానీ థగ్ లైఫ్ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. కన్నడంలో ఈ సినిమా విడుదల కాలేదు. అంతే కాకుండా తెలుగులో పెద్ద ఎత్తున విడుదల చేసేందుకు ప్రయత్నించినా కూడా ఓపెనింగ్స్ దారుణంగానే నమోదు అయ్యాయి. ఇక సినిమాలో కమల్ హాసన్ నటన విషయంలో మాత్రం మంచి మార్కులు పడ్డాయి.
కమల్ హాసన్ ఈ మధ్య కాలంలో తన సినిమాలను మాత్రమే కాకుండా ఇతర హీరోలతోనూ సినిమాలను నిర్మిస్తున్నాడు. అందులో భాగంగానే తమిళ్ స్టార్ హీరో సూర్యతో కమల్ హాసన్ ఒక సినిమాను నిర్మించేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం అందుతోంది. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే సినిమా వచ్చింది. విక్రమ్ సినిమాలో సూర్య చిన్నదైన రోలెక్స్ పాత్రలో కనిపించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ సమయంలోనే కమల్ హాసన్ మాట్లాడుతూ కచ్చితంగా సూర్యతో ఫుల్ లెంగ్త్ మూవీ చేస్తాను అంటూ ప్రకటించాడు. అన్నట్లుగానే తన బ్యానర్‌లో సూర్య హీరోగా సినిమా నిర్మించబోతున్నాడు.
తమిళ మీడియా సర్కిల్స్‌లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం రోలెక్స్ తో విక్రమ్ సినిమాను నిర్మించబోతున్నాడు. అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఈ ఏడాదిలో కాకున్నా వచ్చే ఏడాదిలో కమల్ బ్యానర్‌లో సూర్య మూవీ పట్టాలు ఎక్కడం ఖాయం అంటూ వారు మాట్లాడుకుంటున్నారు. అంతే కాకుండా తమిళ్‌లో ఇప్పటికే దర్శకుడిగా నిరూపించుకున్న అరుణ్ కుమార్‌ను దర్శకుడిగా ఈ సినిమాకు అనుకున్నారనే వార్తలు వస్తున్నాయి. అరుణ్ కుమార్ చెప్పిన కథ నచ్చడంతో సూర్య హీరోగా కమల్ హాసన్ సినిమాను నిర్మించేందుకు రెడీ అవుతున్నాడు. అందుకు సంబంధించిన ప్రకటన అతి త్వరలోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి.
కమల్ హాసన్ కూడా ఆ సినిమాలో చిన్న రోల్ లేదా, కీలక పాత్రలో నటిస్తే బాగుంటుంది అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడు ఒక మంచి పాత్రతో కన్విన్స్ చేస్తే కచ్చితంగా కమల్ హాసన్ ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయి. ఈమధ్య కాలంలో కమల్ హాసన్ హీరోగానే కాకుండా ఇతర హీరోల సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించేందుకు సిద్ధం అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. కల్కిలో చిన్న పాత్రలో కమల్ కనిపించిన విషయం తెల్సిందే. సూర్యతో తన సొంత బ్యానర్‌లో నిర్మించబోతున్న సినిమాలోనూ కమల్ కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం బాలాజీ దర్శకత్వంలో ఒక సినిమాను, ఆ తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న సూర్య ఆ తర్వాత కమల్ బ్యానర్‌లో అరుణ్ కుమార్ దర్శకత్వంలో సినిమాను చేసే అవకాశాలు ఉన్నాయి.