Begin typing your search above and press return to search.

కల్కి 2898 AD ప్రీ-రిలీజ్: ఇద్దరు నాయకులు అతిథులుగా?

ప్రభాస్ న‌టించిన మోస్ట్ అవైటెడ్ చిత్రం 'కల్కి 2898 AD'ని ప్రమోట్ చేయడానికి నిర్మాతలు అన్ని విధాలుగా త‌మ‌వంతు ప్ర‌య‌త్నం చేస్తున్నారు

By:  Tupaki Desk   |   16 Jun 2024 7:42 AM GMT
కల్కి 2898 AD ప్రీ-రిలీజ్: ఇద్దరు నాయకులు అతిథులుగా?
X

ప్రభాస్ న‌టించిన మోస్ట్ అవైటెడ్ చిత్రం 'కల్కి 2898 AD'ని ప్రమోట్ చేయడానికి నిర్మాతలు అన్ని విధాలుగా త‌మ‌వంతు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే బుజ్జి - భైరవ పాత్ర‌ల ప‌రిచ‌యం ఉత్కంఠ‌ను క‌లిగించ‌గా, ఈ సినిమాలో సాంకేతిక అంశాలు, సైన్స్ ఫిక్ష‌న్ క‌థాంశం భార‌తీయ సినిమాకి కొత్త‌ద‌నాన్ని అద్దాయ‌ని అంతా భావిస్తున్నారు. అద్భుతమైన పోస్టర్‌లు, వీడియోలతో ఇప్ప‌టికే సంచలనం సృష్టించారు. దిల్జీత్ దోసాంజ్ తో ప్ర‌చార గీతానికి భారీ స్పందన వచ్చింది.

క‌ల్కి ట్రైలర్ జూన్ 10న సాయంత్రం 6 గంటలకు చెన్నై, బెంగళూరు, తెలుగు రాష్ట్రాల్లోని ఎంపిక చేసిన థియేటర్లలో విడుదలైంది. కేవ‌లం 24 గంట‌ల్లో 1.74 కోట్ల వ్యూస్ తో సంచ‌ల‌నం సృష్టించింది. ఇప్ప‌టికీ ఈ ట్రైల‌ర్ నెట్ లో సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది. ఇప్పుడు ప్రీరిలీజ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నార‌ని స‌మాచారం. ఆంధ్ర ప్రదేశ్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించేందుకు టీమ్ ప్లాన్ చేస్తోంది.

ఈ ఈవెంట్‌కు దేశవ్యాప్తంగా ఉన్న ప‌రిశ్ర‌మ ప్ర‌ముఖుల‌ను ఆహ్వానిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా టీడీపీ అధినేత, ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత కం ఏపీ ఉప ముఖ్య‌మంత్రి పవన్ కల్యాణ్ హాజరయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో న‌టించిన క‌మ‌ల్ హాస‌న్, సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్, మెగాస్టార్ చిరంజీవిల‌ను అతిథులుగా ఆహ్వానించార‌ని కూడా టాక్ వినిపిస్తోంది. ఈ ప్రీ-రిలీజ్ వేడుక‌ జూన్ 23న అమ‌రావ‌తిలో జరగనుందని క‌థ‌నాలొస్తున్నాయి. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వ‌నీదత్ నిర్మించిన ఈ చిత్రం ఈనెల‌ 27న విడుదల కానుంది.