పైరసీపై సైలెంట్ వార్.. పవన్ కళ్యాణ్ తో ప్రయత్నాలు..
ఈ పైరసీకి చెక్ పెట్టే క్రమంలో భాగంగా కేంద్ర మంత్రి సురేష్ గోపి గారితో పాటు పవన్ కళ్యాణ్ గారిని కూడా తాము ప్రత్యేకంగా కలిశామని ఆయన తెలియజేశారు.
By: Tupaki Desk | 27 May 2026 4:56 PM IST'సమ్మర్ హాలిడేస్' సినిమా ప్రెస్ మీట్ లో నిర్మాత ధీరజ్ మొగిలినేని కొన్ని ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకున్నారు. కొత్తగా ప్రారంభించిన డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ గురించి, అలాగే సినిమా ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న పైరసీ భూతం గురించి విలేకరులు అడిగిన ప్రశ్నలకు ధీరజ్ చాలా సూటిగా, ఎలాంటి మొహమాటం లేకుండా స్పష్టంగా సమాధానం ఇచ్చారు.
కొత్తగా డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పెట్టడంపై ఇండస్ట్రీలో జరుగుతున్న చర్చపై పెద్దగా కాంట్రవర్సీ లేకుండా రియాక్షన్ ఇచ్చిన ధీరజ్ డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ అనేది చాలా కష్టంతో కూడుకున్న పని అని ఆయన ఓపెన్ గా అంగీకరించారు. ఇక ఇండస్ట్రీకి సంబంధించిన అసలు సమస్య అంతా పైరసీ మీదే ఉందని, దానిపై నిర్మాతలు ఎందుకు పోరాడటం లేదన్న విలేకరి ప్రశ్నకు ఆయన డీటెయిల్డ్ గా వివరణ ఇచ్చారు.
ఇండస్ట్రీ సమస్యల విషయంలో పైరసీ మీద తాము నూరు శాతం పోరాటం చేస్తున్నామని, ఇప్పటికే సౌత్ ఇండియన్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అందరూ కలిసి ఈ వ్యవహారంపై మూడు మీటింగ్ లు కూడా నిర్వహించారని ధీరజ్ వెల్లడించారు. దీనికి సంబంధించిన కొన్ని పరిష్కారాలను కూడా తాము ప్రతిపాదించినట్లు చెప్పారు. ఈ పైరసీకి చెక్ పెట్టే క్రమంలో భాగంగా కేంద్ర మంత్రి సురేష్ గోపి గారితో పాటు పవన్ కళ్యాణ్ గారిని కూడా తాము ప్రత్యేకంగా కలిశామని ఆయన తెలియజేశారు.
వాళ్ళిద్దరి సపోర్ట్ తీసుకుని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారి దగ్గరకు కూడా వెళ్లి ఒక శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా అడుగులు వేస్తున్నట్లు ధీరజ్ స్పష్టం చేశారు. త్వరలోనే దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనే దానిపై సీరియస్ గా వర్క్ జరుగుతోందని ఆయన అన్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారని, సెంట్రల్ లో ఆయనకున్న ఇమేజ్ గురించి తెలుసు మాకు, సుప్రియ గారు ఈ సమస్య విషయంలో లీడ్ తీసుకొని చర్చలు జరుపుతున్నారు.
అయితే పైరసీపై చేస్తున్న ఈ పోరాటం గురించి తాము బయటకు ఎందుకు చెప్పడం లేదో కూడా ఆయన క్లియర్ గా వివరించారు. పైరసీ చేసే వాళ్ళు మనకంటే చాలా అలర్ట్ గా ఉన్నారని, ఇప్పుడు తాను పైరసీ గురించి బయట గట్టిగా మాట్లాడితే కక్ష కట్టి మరీ తన 'సమ్మర్ హాలిడేస్' సినిమాను టార్గెట్ చేసే ప్రమాదం ఉందని చెప్పారు. మొదటి రోజే సినిమాను వాట్సాప్, టెలిగ్రామ్ లాంటి యాప్స్ లో లీక్ చేసి తన మీద కూర్చుంటారని ఆయన ప్రాక్టికల్ గా ఆలోచించి చెప్పారు.
అందుకే పైరసీకి సంబంధించిన విషయాలను, దాన్ని అరికట్టే ప్రాసెస్ ను తాము చాలా సీక్రెట్ గా ఉంచుతున్నట్లు ధీరజ్ తెలిపారు. బయటకు హడావుడి చేయకుండా గుట్టుచప్పుడు కాకుండా పనయ్యేలా చూసుకుంటున్నామని ఆయన ఫైనల్ గా క్లారిటీ ఇచ్చారు. దీన్ని బట్టి చూస్తే పైరసీని అంతం చేయడానికి తెరవెనుక నిర్మాతలు చాలా గట్టిగానే ప్లాన్ చేస్తున్నారని అర్థమవుతోంది.
