మ్యూజిక్ డైరెక్టర్లు లేకుండా ప్రీరిలీజ్!
ఒక భారీ కమర్షియల్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ అంటే? ఆ చిత్రానికి ప్రాణం పోసిన మ్యూజిక్ డైరెక్టర్ స్టేజ్ మీద ఉండి తన పాటలతో, మాటలతో అభిమానుల్లో జోష్ నింపడం ఆనవాయితీ.
By: Tupaki Desk | 17 March 2026 12:01 AM ISTసినిమా ప్రచార వేడుకల్లో సంగీత దర్శకుల పాత్ర అత్యంత కీలకమైంది. ఒక భారీ కమర్షియల్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ అంటే? ఆ చిత్రానికి ప్రాణం పోసిన మ్యూజిక్ డైరెక్టర్ స్టేజ్ మీద ఉండి తన పాటలతో, మాటలతో అభిమానుల్లో జోష్ నింపడం ఆనవాయితీ. అయితే నిన్న జరిగిన `ఉస్తాద్ భగత్ సింగ్` ప్రీ-రిలీజ్ వేడుకలో మాత్రం వింత పరిస్థితి కనిపించింది. చిత్రానికి పని చేసిన ఇద్దరు సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్ , థమన్ వేడుకకు హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
తొలి నుంచి ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. సినిమాలోని పాటలు, టీజర్ మ్యూజిక్ ఆయన అందించినవే. అయితే ఈ వేడుకకు ఆయన రాకపోవడం వెనుక అలిగారనే వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో దర్శకుడు హరీష్ శంకర్ , పవన్ కళ్యాణ్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు దేవిశ్రీకి నచ్చలేదని అందుకే ఆయన అసంతృప్తితో ఈ వేడుకకు దూరంగా ఉన్నారని ఇప్పటికే కథనాలు వస్తున్నాయి. ఒక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తన సినిమా ఈవెంట్‌కు రాకపోవడం నిజంగా చర్చనీయాంశమే.
మరోవైపు సంగీత దర్శకుడు థమన్ కూడా ఈ వేడుకలో కనిపించలేదు. ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాధ్యతలను థమన్‌కు అప్పగించారు. అందుకు కారణంగా పవన్ కళ్యాణ్ పేరు వినిపించింది. ఆయన పిలిచి మరీ ఆర్ ఆర్ బాధ్యతలు ఇచ్చారని వార్తలొచ్చాయి. ఇందులో దర్శకుడి ప్రమేయం ఎంత మాత్రం లేదని ప్రచారం జరిగింది.
ఏదేమైనా ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు ఒకేసారి గైర్హాజరు అవ్వడం ఆశ్చర్యకరమే. సంగీత దర్శకులు లేకుండానే ఒక భారీ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగడం బహుశా ఇదే తొలిసారి కావొచ్చు.
సాధారణంగా హరీష్ శంకర్ సినిమాల్లో సంగీతానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. అలాంటిది తన మార్క్ సాంగ్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ వేదికపై లేకపోవడం అభిమానులను కొంత నిరాశకు గురిచేసింది. సోషల్ మీడియాలో కూడా దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మ్యూజిక్ టీమ్ లేకుండానే పవన్ కళ్యాణ్ తన స్పీచ్‌తో ఈవెంట్‌ను బ్యాలెన్స్ చేయాల్సి వచ్చింది.
అయితే ఇదే ఈవెంట్ కు హరీష్ శంకర్ ఇద్దర్నీ ఆహ్వానించడం జరిగిందని తాజాగా ఆయన రిలీజ్ చేసిన వీడియోను బట్టి తెలుస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ బిజీగా ఉన్నాడు. ఎలాగూ రాలేదు. నువ్వైనా రావాలి బావా అని హరీష్ థమన్ అడగగా? ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్. నేను బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాను. నన్ను బ్యాక్ గ్రౌండ్ లోనే ఉంచ్చు అని థమన్ రిక్వెస్ట్ చేసినట్లు హరీష్ శంకర్ తెలిపారు. థమన్ కూడా బిజీగా ఉండటంతోనే రాలేకపోయారు అని హరీష్ క్లారిటీ ఇచ్చారు.
