సౌత్ (Vs) నార్త్: దర్శకుల మధ్యనే అసలు పోటీ?
కూలీ చిత్రంలో రజనీకాంత్, నాగార్జున లాంటి పెద్ద స్టార్లు నటించినా కానీ దర్శకుడు లోకేష్ కనగరాజ్ పనితనం గురించే ఎక్కువ ముచ్చట సాగుతోంది.
By: Tupaki Desk | 4 July 2025 7:00 AM ISTఇటీవలి కాలంలో బాలీవుడ్ దర్శకుల క్రియేటివిటీపై సందిగ్ధత నెలకొన్న సంగతి తెలిసిందే. రీమేక్‌లపై ఆధారపడుతున్న బాలీవుడ్ కి సక్సెస్ కరువవ్వడంతో సినీదిగ్గజాల్లో మేథోమథనం మొదలైంది. ఇందులో ప్రధానంగా దర్శకుల వైపే అన్ని వేళ్లు చూపిస్తున్నాయి. దర్శకరచయితలు సరైన కంటెంట్ ని క్రియేట్ చేయలేకపోవడం వల్లనే అసలు సమస్య తలెత్తుతోందని చాలా మంది బహిరంగంగా విమర్శించారు.
ఇలాంటి సమయంలో ఒక సౌత్ అగ్ర దర్శకుడి సినిమా, ఒక నార్త్ అగ్ర దర్శకుడి సినిమాతో పోటీపడబోతోంది. ఇది హీరోలను మించి ఆ సినిమాలకు కెప్టెన్సీ చేపట్టిన దర్శకులనే ఫోకస్ చేస్తోంది. లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన కూలీ, అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన `వార్ 2` చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీకి దిగనున్నాయి. ఈ రెండు సినిమాల్లో ఏది బెస్ట్ అవుతుంది? అన్నదానిపై చాలా ఆసక్తి నెలకొంది.
కూలీ చిత్రంలో రజనీకాంత్, నాగార్జున లాంటి పెద్ద స్టార్లు నటించినా కానీ దర్శకుడు లోకేష్ కనగరాజ్ పనితనం గురించే ఎక్కువ ముచ్చట సాగుతోంది. లోకేష్ ఇప్పటికే స్క్రీన్ ప్లే మాస్టర్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. గ్రిప్పింగ్ గా స్క్రీన్ ప్లేలను మలచడంలో సీట్ ఎడ్జ్ థ్రిల్లర్లను రూపొందించడంలో స్పెషలిస్ట్ అన్న ప్రశంసలు అందుకున్నాడు. అదే సమయంలో హృతిక్, ఎన్టీఆర్ లాంటి స్టార్లతో `వార్ 2` తెరకెక్కిస్తున్న అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్ర లాంటి కాస్ట్ ఫెయిల్యూర్ సినిమా తీసాడు. రొటీన్ స్టఫ్ తో చాలా విమర్శల్ని ఎదుర్కొన్నాడు. అయితే అతడు ఎక్కువగా మీడియాలో ఫోకస్ అవుతుండటంతో భారీ కాస్టింగ్ సినిమాతో ఏమేరకు పనితనం చూపిస్తాడు? అన్నది కూడా ఆసక్తిగా మారింది.
కూలీ vs వార్ 2 బాక్సాఫీస్ వార్ లో విన్నర్ ఎవరు? అన్నదే ఇప్పుడు ప్రధాన చర్చ. ఈ రెండు చిత్రాలు భారీ క్రేజుతో ఆగస్టులో ఒకే తేదీకి రిలీజ్ బరిలోకి దిగుతున్నాయి. దీంతో ఇది ఒక సౌత్ దర్శకుడికి, నార్త్ దర్శకుడికి మధ్య పోటీ మాత్రమేనన్న చర్చకు తెర తీసింది. లోకేష్ కనగరాజ్ ఉత్తముడా? అయాన్ ముఖర్జీ ఉత్తముడా? అన్నది తేలాల్సి ఉంటుంది. అసలు సౌత్ లో క్రియేటివిటీ ఉందా? నార్త్ లో క్రియేటివిటీ ఉందా? అనేది కూడా తేలే సమయం ఆసన్నమైందన్న ముచ్చటా సాగుతోంది. ఆగస్ట్ 14 డి డే.. ఆరోజు తేల్తుంది ఎవరి సత్తా ఎంత?
