Begin typing your search above and press return to search.

నెగెటివ్ మ‌నుషుల‌కు దూరంగా ఉండండి: చిరంజీవి

ఏదైనా విష‌యాన్ని పాజిటివ్ గా చూడ‌టం లేదా నెగెటివ్ గా చూడ‌టం.. ఈ రెండిటి మ‌ధ్యా స‌న్న‌ని లైన్ అడ్డు ఉంటుంది. పాజిటివిటీ ఉన్న చోట ప్ర‌తిదీ సక్సెస్ గా మారుతుంది.

By:  Sivaji Kontham   |   28 March 2026 1:00 AM IST
నెగెటివ్ మ‌నుషుల‌కు దూరంగా ఉండండి: చిరంజీవి
X

ఏదైనా విష‌యాన్ని పాజిటివ్ గా చూడ‌టం లేదా నెగెటివ్ గా చూడ‌టం.. ఈ రెండిటి మ‌ధ్యా స‌న్న‌ని లైన్ అడ్డు ఉంటుంది. పాజిటివిటీ ఉన్న చోట ప్ర‌తిదీ సక్సెస్ గా మారుతుంది. అందుకే చాలా మంది నెగెటివిటీని ద‌రి చేర‌నివ్వ‌రు. ఈ జాబితాలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు. మెగాస్టార్ తన జీవితానుభవాల నుండి నెగెటివిటీ పాజిటివిటీ గురించి అందించిన ఈ విలువైన సందేశం అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది.

జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనుకునే ప్రతి ఒక్కరికీ సానుకూల దృక్పథం చాలా అవసరమని మెగాస్టార్ చిరంజీవి ఓ సంద‌ర్భంలో పేర్కొన్నారు. ముఖ్యంగా కెరీర్ ప్రారంభ దశలో ఉన్నప్పుడు మన చుట్టూ ఉండేవారు మనల్ని ప్రోత్సహించేలా ఉండాలే తప్ప నిరుత్సాహపరిచేలా ఉండకూడదని ఆయన సూచించారు. మ‌ద్రాసు - పాండి బ‌జార్ లో తాను ఎదుర్కొన్న ఒక చేదు అనుభవాన్ని ఉదాహరణగా చూపుతూ.. నెగటివ్ ఆలోచనలు ఉన్న వ్యక్తుల వల్ల మనలోని ఆత్మవిశ్వాసం ఏ విధంగా దెబ్బతింటుందో వివరించారు.

1977లో సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న రోజుల్లో మద్రాసులోని పాండీ బజార్‌లో జరిగిన సంఘటనను ఆయన గుర్తు చేసుకున్నారు. అక్కడ కొందరు వ్యక్తులు తన రూపాన్ని, ముక్కును చూసి ``వీడు హీరో అయిపోతాడంట.. వీడి మొహం చూడు`` అని వెటకారంగా మాట్లాడటం తనను ఎంతో కలిచివేసిందని చెప్పారు. ఉత్సాహంగా వెళ్లిన తాను ఆ నెగటివ్ మాటల వల్ల తీవ్రమైన నిరాశకు లోనై ఎంతో డల్ అయిపోయి రూమ్ కి తిరిగి వచ్చానని ఆవేదన వ్యక్తం చేశారు.

మనం ఎదిగే క్రమంలో చాలా సున్నితంగా మానసిక సంఘర్షణతో ఉంటామని.. అటువంటి సమయంలో ఎప్పుడూ పాజిటివ్ వాతావరణంలోనే ఉండాలని చిరంజీవి హితవు పలికారు. ఫ్రస్ట్రేషన్‌లో ఉండే నెగటివ్ వ్యక్తుల దగ్గరకు వెళ్తే మనలోని శక్తి సన్నగిల్లుతుందని ఆయన హెచ్చరించారు. అందుకే ఆ రోజు ఆ సంఘటన తర్వాత తాను మళ్ళీ ఎప్పుడూ పాండీ బజార్ వైపు వెళ్లలేదని.. తన చుట్టూ ఎప్పుడూ సానుకూలత ఉండేలా జాగ్రత్త పడ్డానని తెలిపారు.

ఈ విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా ఆయన రెండు అద్భుతమైన ఉదాహరణలతో వివరించారు. ఇల్లు కట్టేటప్పుడు స్లాబ్ వేసిన వెంటనే వర్షం పడితే అది ఎలా నిరుపయోగం అవుతుందో.. అలాగే పాలు పెరుగుగా తోడుకుంటున్న సమయంలో ఒక్క చుక్క నిమ్మరసం పడితే ఎలా విరిగిపోతాయో చిరు లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్పారు. కానీ స్లాబ్ ఆరిన తర్వాత నీరు పడినా, పాలు పెరుగుగా మారిన తర్వాత నిమ్మకాయ కలిపినా అవి మేలే చేస్తాయి. అంటే.. మనం ఇంకా నిలదొక్కుకుంటున్న సమయంలో వచ్చే విమర్శలు మన భవిష్యత్తును దెబ్బతీస్తాయని ఆయన విశ్లేషించారు.

ప్రతికూల పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవడం వల్లే తనకు ఈ స్థాయి మానసిక స్థైర్యం వచ్చిందని చిరంజీవి స్పష్టం చేశారు. నెగటివిటీకి దూరంగా ఉంటూ.. కేవలం లక్ష్యం వైపు దృష్టి సారించడం ద్వారానే విజయం సాధ్యమవుతుందని చిరు సందేశాన్ని ఇచ్చారు. నిరంతరం మనల్ని మనం ప్రోత్సహించుకుంటూ.. సానుకూల మనుషుల మధ్య ఉంటేనే అనుకున్నది సాధించగలమని ఈ వీడియో ద్వారా అత‌డు తెలియజేశారు. మెగాస్టార్ చిరంజీవిలో ఉండే పాజిటివిటీ ఆయ‌న అభిమానుల‌తో పాటు ప్ర‌జ‌లంద‌రిలో పాజిటివ్ ఎన‌ర్జీని నింపుతుంది. మెగాస్టార్ చిరంజీలో ఈ పాజిటివిటీని నింపిన‌ది ఆధ్యాత్మిక‌త‌. అన్ని క‌ష్ట స‌మ‌యాల్లోను త‌నను ఆంజ‌నేయ‌స్వామి త‌న‌ను ఆదుకున్నార‌ని చెబుతుంటారు. త‌న‌కు ఏ క‌ష్టం వ‌చ్చినా ఆంజ‌నేయుడికి చెప్పుకుంటాన‌ని చిరు చాలా సంద‌ర్భాల్లో చెప్పారు.