దైవమే దిక్కు: భర్తకు విడాకులు- సోదరుడికి జైలు.. నటి తీవ్ర మనోవేదన!
ఈ మానసిక కుంగుబాటు, దుఃఖం వంటి పరిస్థితుల్లో మనశ్శాంతిని వెతుక్కుంటూ ఈమె దైవచింతన వైపు మొగ్గు చూపారు.
By: Tupaki Desk | 21 May 2026 5:47 PM ISTగోరుచుట్టుపై రోకటి పోటులా.. కొన్నిసార్లు ఒకదాని వెంట ఒకటిగా వచ్చి పడే తీవ్రమైన సమస్యలు మనిషిని నిలువునా కుంగదీస్తాయి. అలాంటి ధైన్యస్థితిని ఎదుర్కొంటోంది ఈ నటి. గత కొన్ని నెలలుగా వ్యక్తిగత జీవితంలో ఎదురవుతున్న తీవ్రమైన ఒడిదుడుకులు, మానసిక సంఘర్షణల కారణంగా సదరు నటీమణి అష్టకష్టాలను ఎదుర్కోవడం చర్చగా మారింది. ఒకవైపు జైలుకు వెళ్లిన సోదరుడి కోసం సుదీర్ఘ చట్టపరమైన పోరాటం...మరోవైపు విదేశీ భర్త నుండి విడాకులు తీసుకునేందుకు జరుగుతున్న న్యాయపరమైన పోరాటాలతో ఈ నటి తన జీవితంలో అత్యంత క్లిష్టమైన దశను ఎదుర్కొంటున్నారు. ఈ వివాదాలకు ముందే తనకు పుట్టిన పసికందును, తన తల్లిదండ్రుల మరణ వ్యథను ఎదుర్కొన్నారు సదరు నటి.
ఈ మానసిక కుంగుబాటు, దుఃఖం వంటి పరిస్థితుల్లో మనశ్శాంతిని వెతుక్కుంటూ ఈమె దైవచింతన వైపు మొగ్గు చూపారు. బుధవారం నాడు హిమాచల్ ప్రదేశ్‌లోని అత్యంత పవిత్రమైన మా బగళాముఖి ఆలయాన్ని దర్శించుకున్న సదరు నటి, అక్కడ జరిగిన పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఒక వీడియోను తన ఇన్‌స్టాలో అభిమానులతో షేర్ చేసారు.
హిమచల్‌లోని అమ్మవారి గర్భగుడిలో ఈ విధంగా మొక్కుకున్నారు.. నా సోదరుడుతో తిరిగి కలవాలని... నా పిల్లలతో మళ్లీ ఒకటి కావాలని ఆ జగన్మాత పాదాల చెంత నా ప్రార్థనలు... ప్రేమ, విధి ఎప్పటికీ విడదీయకూడని బంధాలను పునరుద్ధరించాలని వేడుకున్నాను. అమ్మవారి ఆశీస్సులు, రక్షణ, న్యాయం .. తనకు అత్యంత ఆప్తులైన వారిని తిరిగి ఇంటికి తెచ్చుకునే శక్తి కోసం ఎదురుచూసే ప్రతి ఒక్క ఆత్మతో ఈ పవిత్రమైన పూజను ఆచరిస్తున్నాను..! అంటూ సదరు హీరోయిన్ అత్యంత భావోద్వేగంతో ఒక నోట్ రాసుకొచ్చారు.
నిజానికి గత ఏడాది ఈ నటి ముంబైలోని అంధేరి కోర్టును ఆశ్రయించి, గృహహింస నుండి మహిళల రక్షణ చట్టం (డొమెస్టిక్ వయోలెన్స్ యాక్ట్) కింద తక్షణ ఉపశమనం కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌లో తన భర్త వల్ల తనకు జరిగిన ఆర్థిక నష్టానికి, గౌరవ భంగానికి, ఆస్తి నష్టానికి ప్రతిఫలంగా రూ. 50 కోట్ల భారీ నష్టపరిహారాన్ని డిమాండ్ చేశారు. రకరకాల వంకలు పెట్టి షాకులు చెప్పి.. తనను నటనారంగంలో పని చేయకుండా నిరోధించాడని.. తన ఆర్థిక స్వాతంత్య్రాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాడని ఈ నటి తన భర్తపై సంచలన ఆరోపణలు చేశారు.
అంతేకాకుండా పుట్టిన చిన్నారి మరణించడంతో పాటు స్వల్ప వ్యవధిలోనే తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయి తీవ్ర మానసిక ఆందోళనలో ఉన్న సమయంలో.. ముంబైలోని తన సొంత ఇంటిని తన పేరిట బదిలీ చేయాలంటూ భర్త తీవ్ర ఒత్తిడి తెచ్చాడని ఈ హీరోయిన్ ఆవేదన వ్యక్తం చేశారు.
తనపై జరిగిన తీవ్రమైన శారీరక, మానసిక, లైంగిక దాడులపైనా.. ఆర్థిక వేధింపుల గురించి తీవ్రమైన ఫిర్యాదులు చేసారు. విదేశాలలోని ఇంటిని వదిలి... పిల్లలు లేకుండా ఒంటరిగా భారతదేశానికి తిరిగి రావాల్సి వచ్చిందని కూడా సదరు హీరోయిన్ కోర్టుకు సమర్పించిన పత్రాలలో పేర్కొన్నారు. 2010 సెప్టెంబర్ 18న ముంబైలో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్న ఈమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం తన పిల్లల సంరక్షణ బాధ్యతలు, కోల్పోయిన ఆస్తులు, నష్టపోయిన నటన రంగ ఆదాయాన్ని తిరిగి పొందడంతో పాటు చట్టపరమైన రక్షణ కల్పించాలని కోర్టును గట్టిగా అభ్యర్థిస్తున్నారు.
ఈ నటి మరెవరో కాదు.. మంచు విష్ణు సరసన `సూర్యం` అనే చిత్రంలో నటించిన సెలీనా జైట్లీ. తన సోదరుడు విక్రాంత్ అన్యాయంగా గల్ఫ్ జైల్లో చిక్కుకోవడంతో అతడిని విడిపించేందుకు అంతర్జాతీయ న్యాయస్థానాల్లో పోరాడుతున్నారు. అదే సమయంలో తన భర్త కూడా విడాకుల పోరాటంలో పిల్లల్ని దూరం చేయడంతో సెలీనా తీవ్ర మానసిక వేదనను అనుభవిస్తున్నారు.
