హృతిక్ (X) తారక్: ఎదురుపడితే బస్తీ మే సవాల్!
హృతిక్-ఎన్టీఆర్ మధ్య నువ్వా నేనా అని పోటీపడేంత ఘర్షణ ఎలివేట్ కావడానికి తీవ్రమైన కథాంశాన్ని సృష్టించడం ప్రధాన సవాల్‌గా మారిందని అయాన్ ముఖర్జీ అంగీకరించాడు.
By: Tupaki Desk | 21 Jun 2025 5:42 AMభారతీయ సినీరంగంలో ఇద్దరు పెద్ద సూపర్ స్టార్లు హృతిక్ - ఎన్టీఆర్‌తో సినిమా చేయడంలో ఉన్న ఛాలెంజ్ గురించి అయాన్ ముఖర్జీ తాజా ఇంటర్వ్యూలో ఓపెనయ్యాడు. 'వార్ 2' స్టార్లు నువ్వా నేనా? అంటూ బాహా బాహీకి దిగితే, అభిమానులను సంతృప్తి పరిచేలా ఇరువైపులా ఆలోచించి ప్రతి సన్నివేశాన్ని అత్యంత జాగ్రత్తగా మలచాలి. పైగా యాక్షన్ ఎపిసోడ్స్ లో ఎవరినీ తక్కువగా చూపించకూడదు. పోటాపోటీగా ఢీకొట్టేలా సరైన ఘర్షణ వాతావరణాన్ని ఆ రెండు పాత్రల మధ్యా పుట్టించాలి. ఒకరితో ఒకరు తలపడుతున్నారంటే దానికి సరైన లాజిక్ కావాలి. అందుకే యాక్షన్ సీన్స్ ని తెరకెక్కించేందుకు చాలా సమయం పట్టిందని అన్నాడు అయాన్.
హృతిక్-ఎన్టీఆర్ మధ్య నువ్వా నేనా అని పోటీపడేంత ఘర్షణ ఎలివేట్ కావడానికి తీవ్రమైన కథాంశాన్ని సృష్టించడం ప్రధాన సవాల్‌గా మారిందని అయాన్ ముఖర్జీ అంగీకరించాడు. ''వార్ లాంటి ఫ్రాంచైజీని ముందుకు తీసుకెళ్లడం.. మన సొంత ముద్ర వేయడం చాలా పెద్ద బాధ్యత. మొదటి భాగంలో ఏది వర్కవుటైందో దానిని గౌరవిస్తూనే, కొత్త కథను చెప్పాలి. కానీ అనుభవాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లాలని కూడా భావించాను'' అని అయాన్ ముఖర్జీ చెప్పారు.
ప్రతిదీ ఫ్యాన్ బేస్ ఆధారంగా అయాన్ ముఖర్జీ ఆలోచించానని చెప్పారు. అంటే హృతిక్ అభిమానులతో పాటు, ఎన్టీఆర్ అభిమానులను సంతృప్తి పరిచే స్థాయి యాక్షన్ సన్నివేశాల కోసం చాలా ఎక్కువ సమయం తీసుకున్నానని తెలిపాడు. ఆ రెండు పాత్రలు ఎదురు పడితే ఎదురయ్యే ఘర్షణ ఎప్పటికీ మర్చిపోనిదిగా ఉండాలి. అందుకోసం చాలా ఆలోచించాల్సి వచ్చిందని అన్నాడు. ముఖ్యంగా వార్ చిత్రంలో హృతిక్ రోషన్- టైగర్ ష్రాఫ్ మధ్య భీకరమైన పోరాట సన్నివేశాలున్నాయి. వాటన్నిటినీ మించేలా ఇప్పుడు కొత్త యాక్షన్ సీక్వెన్సులను చూపించాలి... ఫ్రాంఛైజీకి కొత్త దర్శకుడిగా ఇది అతడికి సవాల్ లాంటిది.
అయితే అయాన్ ముఖర్జీ ప్రస్థావించని మరో ముఖ్యమైన అంశం ఒకటి ఉంది. ఇప్పటికే ధూమ్ సిరీస్, క్రిష్ ఫ్రాంఛైజీ సినిమాల్లో హృతిక్ యాక్షన్ అవతార్ ని, ప్రదర్శనను పీక్స్ లో ఎంజాయ్ చేసారు ప్రజలు. అందువల్ల ఆ సినిమాల యాక్షన్ స్థాయిని మించేలా వార్ 2లో సీక్వెన్సులను రూపొందించాల్సి ఉంటుంది. అలా చేయలేని పక్షంలో అయాన్ ముఖర్జీ పూర్తిగా విఫలమైనట్టు. ఈ సవాల్ ని అతడు ఎలా అధిగమించాడో థియేటర్లలో ప్రజలు స్వయంగా చూసి చెప్పాలి. ఇటీవల విడుదలైన టీజర్ పై విమర్శలొచ్చాయి. నాశిరకం గ్రాఫిక్స్ తో యాక్షన్ ఎపిసోడ్స్ తేలిపోయాయని విమర్శించారు. ఈ విమర్శల్ని ఫైనల్ ఔట్ పుట్ లో తిప్పి కొట్టాలి. ట్రైలర్ తో దానిని సవరించి తన సినిమా గొప్ప ఎత్తున ఉంటుందని నిరూపించాల్సి ఉంది. ఎన్టీఆర్- హృతిక్ ప్రత్యేకమైన జోడీ అని నిరూపిస్తూ, ప్రేక్షకులకు ప్రత్యేకమైనది అందిస్తానని అయాన్ చెబుతున్నాడు. అయితే అది మాటలను మించి చేతలుగా మారాలని ఆకాంక్షిద్దాం.