Begin typing your search above and press return to search.

అపర్ణ బాలమురళిని అంత మాట అనేస్తారా?

By:  Tupaki Desk   |   15 Sept 2022 5:50 PM IST
అపర్ణ బాలమురళిని అంత మాట అనేస్తారా?
X
అపర్ణ బాలమురళి .. ఈ పేరు వినగానే తెలుగు ప్రేక్షకులకు 'ఆకాశం నీ హద్దురా' సినిమా గుర్తుకు వస్తుంది. ఆ సినిమాలో సహజమైన ఆమె నటన కళ్లముందు కదలాడుతుంది. ఈ కేరళ అమ్మాయికి మలయాళంలోనే కాదు, తమిళంలోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం ఆమె అరడజను సినిమాలతో బిజీగా ఉంది. అటు సినిమాల్లోనే కాదు .. ఇటు సోషల్ మీడియాలోను అపర్ణ యాక్టివ్ గానే ఉంటుంది. అలాంటి అపర్ణ రీసెంట్ గా సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న కామెంట్ల దండయాత్రపై ఆవేదనను .. అసహనాన్ని వ్యక్తం చేస్తోంది.

సహజంగానే అపర్ణ కాస్త బొద్దుగా ఉంటుంది. ఆమె ఎక్కువగా చేసేది మలయాళ .. తమిళ సినిమాలే. అక్కడ కథానాయికలు బొద్దుగా ఉండాలనే అభిమానులు కోరుకుంటారు .. అలా ఉంటేనే ఇష్టపడతారు. అందువలన అక్కడ లావు అనే సమస్య భూతద్దంలో కనిపించదు.

అయితే తాజాగా అపర్ణ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని 'నితం ఒరు వానం' అనే సినిమా నుంచి ఆమె పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ఆమె కాస్త లావుగా ఉండటంతో ట్రోలింగ్ మొదలైపోయింది. ఇకపై 'అమ్మ' పాత్రలు చేయడానికి రెడీగా ఉండమంటూ కామెంట్లు గుప్పిస్తున్నారట.

ఈ విషయాన్ని గురించి అపర్ణ మాట్లాడుతూ .. మొదటి నుంచి కూడా లావుగా ఉన్నాననే కామెంట్లను ఎదుర్కుంటూనే వస్తున్నాను. తొలినాళ్లలో ఈ విమర్శలను తట్టుకోలేకపోయేదానిని. ఆ కామెంట్లను గురించి ఆలోచిస్తూ అదే పనిగా బాధపడుతూ ఉండేదానిని. కానీ ఆ తరువాత అలవాటు పడిపోయాను. ఇప్పుడు ఇలాంటి కామెంట్లను పెద్దగా పట్టించుకోవడం లేదు. నేను లావుగా ఉండటం వలన 'అమ్మ' పాత్రలను చేసుకోమని ట్రోల్ చేస్తున్నారు. అలాంటివారిని చూసి నేను జాలి పడుతున్నాను.

ఎందుకంటే ఒక వ్యక్తి ఆకారాన్ని కాకుండా ప్రతిభను గురించి ఆలోచన చేసే సంస్కారం కొంతమందికి మాత్రమే ఉంటుంది. అలాంటి ప్రతిభను గురించి మాత్రమే నేను ఆలోచన చేస్తాను. నాజూకుగా ఉండటం వల్లనే రాణిస్తారనేది అందరి విషయంలోను వర్తించడం లేదు కదా.

అలాంటప్పుడు నా బరువును గురించిన చర్చ అవసరమా? అంటూ తన మనసులోని మాటను చెప్పుకొచ్చింది. ఒకప్పుడు సినిమా తారలకు వేదికలపై ప్రశంసల జల్లు కురిసేది. విమర్శలు వారి వరకూ చేరే అవకాశం లేకుండా ఉండేది. కానీ సోషల్ మీడియా పుణ్యమా అని అన్ని రకాల కామెంట్లను ఎదుర్కోవలసి వస్తోంది. దీని దండయాత్రకు భయపడి సోషల్ మీడియాకు దూరమవుతున్నవారూ లేకపోలేదు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.