Begin typing your search above and press return to search.

సూర్య బర్త్‌ డే సందర్భంగా 'వాడివసల్‌' ఫస్ట్‌ లుక్ విడుదల...!

By:  Tupaki Desk   |   23 July 2020 2:00 PM GMT
సూర్య బర్త్‌ డే సందర్భంగా వాడివసల్‌ ఫస్ట్‌ లుక్ విడుదల...!
X
సౌత్ ఇండస్ట్రీలో ప్రతిభావంతులైన నటుల్లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నారు హీరో సూర్య. వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ అటు తెలుగు ప్రేక్షకులే కాకుండా ఇటు తెలుగు ప్రేక్షకులు కూడా అభిమానించే స్థాయికి చేరుకున్నారు సూర్య. సీనియర్ నటుడు శివకుమార్ తనయుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సూర్యకు స్టార్ ఇమేజ్ అంత ఈజీగా ఏమీ రాలేదు. కెరీర్ ప్రారంభంలో చిన్న రోల్స్ చేసిన సూర్య 'నంద' సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత 'కాక్క కాక్క' సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక బాలా దర్శకత్వంలో వచ్చిన 'శివపుత్రుడు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు. అప్పటి నుండి ప్రతి సినిమాని యూనివర్సల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తూ టాలీవుడ్ లో కూడా మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. ఈ క్రమంలో వచ్చిన 'గజినీ' సినిమాతో తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఇక 'దేవా' 'వీడోక్కడే' 'సెవెంత్ సెన్స్' 'యముడు' 'సింగం' 'సింగం 3' 'బ్రదర్స్' '24' వంటి చిత్రాలతో ప్రేక్షకుల మన్ననలు పొందారు. ఇక రియల్ లైఫ్ లో కూడా సూర్య రియల్ హీరో అనిపించుకున్నారు. అగరం ఫౌండేషన్ స్థాపించి పేద విద్యార్థులకు చదువులు చెప్పిస్తూ సేవా గుణాన్ని చాటుకుంటున్నాడు.

కాగా నేడు సూర్య బర్త్ డే. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో సూర్య ఫ్యాన్స్ సెలెబ్రేషన్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నటిస్తున్న సినిమాల అప్డేట్స్ ఇచ్చారు. ప్రస్తుతం సూర్య నటిస్తున్న 'ఆకాశం నీ హద్దురా' సినిమా నుంచి 'కాటుక కనులే..' అంటూ సాగే సాంగ్ ప్రోమోను చిత్ర బృందం విడుదల చేసింది. 'గురు' ఫేమ్ సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు కెప్టెన్ గోపీనాథ్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. దీంతో పాటు వెట్రిమారన్‌ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న 'వాడివసల్‌' అనే చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్ ను కూడా చిత్ర బృందం విడుదల చేసింది. మెడలో తాడు, పులిగోరుతో ఉన్న సూర్య లుక్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ పోస్టర్ లో హరప్పా సింధు నాగరికతకు సంబంధించిన బొమ్మలు కనిపిస్తున్నాయి. దీనిని బట్టి చూస్తుంటే సూర్య మరో ఛాలెంజింగ్ రోల్ చేస్తున్నారని అర్థం అవుతోంది. ఈ చిత్రాన్ని వి క్రియేషన్స్ బ్యానర్ పై కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. వీటితో పాటు హరి దర్శకత్వంలో సూర్య ఓ సినిమాలో నటించనున్నాడు.