Begin typing your search above and press return to search.

సూర్య కూడా వచ్చేస్తున్నాడా?

By:  Tupaki Desk   |   7 Sept 2017 7:49 PM IST
సూర్య కూడా వచ్చేస్తున్నాడా?
X
ఇండియాలో రాజకీయాలతో సినిమా వాళ్లకు అత్యంత అనుబంధం ఉన్న రాష్ట్రం ఏదంటే మరో మాట లేకుండా తమిళనాడు పేరు చెప్పేయొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో కూడా రాజకీయాలకు సినిమా టచ్ ఉంది కానీ.. తమిళనాడు స్థాయిలో మాత్రం కాదు. అక్కడ సినిమా వాళ్లే దశాబ్దాల తరబడి రాష్ట్రానికి నాయకత్వం వహించారు. ఎంజీఆర్.. కరుణానిధి.. జయలలిత.. తమిళనాడును సుదీర్ఘ కాలం పాలించిన ఈ ముగ్గురూ సినిమా వాళ్లే.

వీళ్లే కాక విజయ్ కాంత్.. శరత్ కుమార్ లాంటి వాళ్లు కూడా తమిళ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. త్వరలోనే రజినీకాంత్.. కమల్ హాసన్ రాజకీయారంగేట్రం చేసి.. వచ్చే ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు విజయ్.. అజిత్ లాంటి సూపర్ స్టార్ల రాజకీయారంగేట్రం గురించి కూడా ఎప్పట్నుంచో చర్చ నడుస్తోంది. తాజాగా తమిళనాట మరో స్టార్ హీరో పొలిటికల్ ఎంట్రీ గురించి డిస్కషన్ మొదలైంది. ఆ హీరో మరెవరో కాదు.. సూర్య.

తమిళనాట జనాల్లో ఎలాంటి వివాదాల్లేకుండా చాలా మంచి ఇమేజ్ ఉన్న స్టార్లలో సూర్య ఒకడు. సూర్యకు సంబంధించి ఇప్పటిదాకా ఏ వివాదమూ లేదు. నటుడిగా మంచి పేరు సంపాదించడమే కాక.. అగరం ఫౌండేషన్ ద్వారా చేసే సేవా కార్యక్రమాలతో వ్యక్తిగానూ మంచి పేరు తెచ్చుకున్నాడు సూర్య. అతను వచ్చే ఎన్నికల నాటికి రాజకీయాల్లోకి రావచ్చన్న ప్రచారం జరుగుతోంది. సూర్య గత ఏడాది జల్లికట్టు వివాద సమయంలో బయటికొచ్చి పోరాటానికి నాయకత్వం వహించాడు.

ఇప్పుడు మెడికల్ సీటు రానందుకు ఆత్మహత్య చేసుకున్న అనిత వ్యవహారం మీద కూడా తీవ్రంగా స్పందించాడు సూర్య. అతను చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. గతంలో ఒకసారి రాజకీయాల ప్రస్తావన తెస్తే తనకు సరిపడవన్న సూర్య.. ఈ మధ్య ప్రజలకు మంచి జరుగుతుందంటే రాజకీయాల ద్వారా ఏదైనా చేయడానికి సిద్ధమని ప్రకటించడం గమనార్హం. తమిళనాట ప్రస్తుతం రాజకీయ శూన్యత నెలకొన్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి సినిమా వాళ్లకు మంచి అవకాశాలుంటాయన్న అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో సూర్య కూడా రాజకీయాల్లో తన వంతు పాత్ర పోషించడానినికి ముందుకొస్తే ఆశ్చర్యం లేదేమో.