Begin typing your search above and press return to search.

ఫ్రీగా నటిస్తానంటున్న సూర్య

By:  Tupaki Desk   |   26 April 2016 5:00 PM IST
ఫ్రీగా నటిస్తానంటున్న సూర్య
X
తమిళనాట సామాజిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేసే స్టార్ హీరోల్లో సూర్య ఒకడు. ‘అగరం’ పేరుతో ఓ ఫౌండేషన్ పెట్టి ఎంతో మంది అభాగ్యులకు సాయపడుతున్నాడతను. ఇక ఇండస్ట్రీకి సంబంధించి ఏవైనా సేవా కార్యక్రమాలన్నా సరే.. తానున్నానంటూ ముందుకొస్తాడు సూర్య. మొన్న ‘నడిగర్ సంఘం’ కోసం భవనం నిర్మించడానికి క్రికెట్ మ్యాచ్ పెడితే.. అన్నీ తానై వ్యవహరించాడు సూర్య. ఈ సంఘం కోసం అవసరమైతే ఉచితంగా సినిమా చేయడానికి కూడా తాను సిద్ధమని ప్రకటించాడు సూర్య.

పేద సినీ కళాకారుల సంక్షేమం కోసం కొత్త భవనాన్ని నిర్మించి.. దాని ద్వా రా నెలకు రూ.50 లక్షల ఆదాయం ఆర్జించడానికి నడిగర్ సంఘం ప్రణాళికలు రచించిందని.. ఇందుకోసమే క్రికెట్ మ్యాచ్ నిర్వహించారని.. అలాగే సంఘం తరఫున మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేయడం కోసం విశాల్.. కార్తి.. ఓ సినిమా చేయాలని భావిస్తున్నారని.. ఆ సినిమా కోసం ఉచితంగా నటించడానికి తాను కూడా సిద్ధమని సూర్య ప్రకటించాడు. తన కుటుంబం నడుపుతున్న ‘అగరం’ ఫౌండేషన్ ద్వారా ఇప్పటిదాకా 1300 మంది విద్యార్థుల్ని చదివించామని.. మున్ముందు మరింత మందికి సాయం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని సూర్య తెలిపాడు.

తన కొత్త సినిమా ‘24’ గురించి చెబుతూ.. ఇది తన మనసుకు నచ్చిన సినిమా అన్నాడు. కమల్ హాసన్ 30 ఏళ్ల ప్రాయంలో నటించిన తరహా వైవిధ్యమైన మంచి కథలు ప్రస్తుతం తనను వెదుక్కుంటూ వస్తున్నాయని.. ఇది తన అదృష్టమని సూర్య చెప్పాడు. ‘24’లో తాను మూడు పాత్రలు చేశానని.. అందులో విలన్ ఆత్రేయ పాత్ర చాలా ప్రత్యేకమని.. సినిమాకు అదే వెన్నెముక అని సూర్య అన్నాడు. తన సినిమాల్లో సామాజిక బాధ్యత అనేది మరిచిపోనని.. పొగ తాగే సీన్లు.. మద్యం సేవించే సన్నివేశాల్ని దాదాపుగా లేకుండా చూడ్డానికి ప్రయత్నిస్తానని సూర్య చెప్పాడు.