Begin typing your search above and press return to search.

సూర్య మాట నిలబెట్టుకుంటాడా లేదా..?

By:  Tupaki Desk   |   23 July 2016 11:00 PM IST
సూర్య మాట నిలబెట్టుకుంటాడా లేదా..?
X
హీరోలకు ఒకట్రెండు ఫ్లాపులు ఎదురైనా పర్వాలేదు కానీ.. దర్శకులు ఫ్లాప్ ఇస్తే మాత్రం సీన్ మారిపోతుంది. అప్పటిదాకా వెంటపడ్డ హీరోలు కనిపించకుండా పోతారు. నిర్మాతలూ అంతే. పేర్లు చెప్పడం ఎందుకు కానీ.. తెలుగులో తమిళంలో ఇలాంటి ఉదంతాలు చాలా జరిగాయి. అందుకే దర్శకుల పరిస్థితి ఎప్పుడూ ప్రమాదకరమే. ఇప్పుడు ‘కబాలి’ దర్శకుడు పా.రంజిత్ పరిస్థితి ఏంటన్నదే అర్థం కావడం లేదు.

గత రెండు మూడు నెలల్లో ఇండియాలో అత్యధికంగా చర్చనీయాంశంగా మారిన దర్శకుడు రంజితే. సూపర్ స్టార్ రజినీకాంత్ ను నయా అవతార్ లో ప్రెజెంట్ చేస్తూ రంజిత్ ‘కబాలి’ టీజర్ వదలగానే అతడి పేరు మార్మోగిపోయింది. ఎవరీ రంజిత్ అంటూ జనాలు చర్చించుకోవడం మొదలుపెట్టారు. ‘కబాలి’ తర్వాత అతడితో పని చేయడానికి చాలామంది హీరోలు ముందుకొచ్చారు. ఐతే తాను చెప్పిన కబాలి కథను రజినీకి సిఫారసు చేసి.. తనకు గొప్ప అవకాశం తెచ్చిపెట్టిన సూర్యతోనే తన తర్వాతి సినిమా చేయడానికి కమిటయ్యాడు రంజిత్.

ఐతే ‘కబాలి’ చూశాక రంజిత్ మీద ఉన్న ఇంప్రెషన్ అంతా పోయింది. అతడి భవిష్యత్తు మీద సందేహాలు రేకెత్తాయి. ఇంతకుముందు రంజిత్ ను పొగిడిన నోళ్లే తిడుతున్నాయి. రజినీ అభిమానులైతే అతడి మీద మామూలు కోపంతో లేరు. ఈ పరిస్థితుల్లో సూర్య.. రంజిత్ తో పని చేయడానికి అంగీకరిస్తాడా లేదా అన్నది సందేహం. ఇప్పటికే సూర్యకు రంజిత్ రెండు కథలు చెప్పాడని.. అందులో ఏది ఎంచుకోవాలన్న సందిగ్ధతలో సూర్య ఉన్నాడని వార్తలొచ్చాయి. ఇప్పుడసలు రంజిత్ తో పని చేయాలా వద్దా అన్న సందిగ్ధత అతణ్ని వెంటాడుతూ ఉండొచ్చు. మరి సూర్య ఏ నిర్ణయం తీసుకుంటాడో?