Begin typing your search above and press return to search.

ముంబై వెళ్లిపోతున్న వ‌ర్మ

By:  Tupaki Desk   |   26 Dec 2015 7:00 PM IST
ముంబై వెళ్లిపోతున్న వ‌ర్మ
X
రామ్‌ గోపాల్ వ‌ర్మ చాలా రోజులుగా తెలుగు సినిమాలే తీస్తూ హైద‌రాబాద్‌ లోనే గ‌డుపుతున్నాడు. ఒక‌ప్పుడు బాలీవుడ్‌ ని ద‌డ‌ద‌డ‌లాడించిన వ‌ర్మకి అక్క‌డ మార్కెట్ ప‌డిపోవ‌డంతోనే ఇక్క‌డికి షిఫ్ట్ అయిపోయాడ‌ని మాట్లాడుకొన్నారు జ‌నాలు. కానీ అది నిజం కాక‌పోవ‌చ్చు. వ‌ర్మ సినిమా తీయాల‌నుకుంటే మార్కెట్‌ తో సంబంధం లేకుండా ఎక్క‌డైనా తీయ‌గ‌ల‌డు. ఆ మాట‌కొస్తే వ‌ర్మ‌కి తెలుగులోనూ గొప్ప మార్కెట్టేమీ లేదు. ప‌రిమిత వ్య‌యంతో సినిమాలు తీస్తూ త‌న‌దైన శైలి ప‌బ్లిసిటీతో జ‌నాల్ని థియేట‌ర్ల‌కి ర‌ప్పిస్తుంటాడు. రెండు మూడు రోజులు సినిమా ఆడితే ఆయ‌న సినిమాల పెట్టుబ‌డి వెన‌క్కి తిరిగొచ్చేస్తుంటుంది. అందుకే వ‌ర్మ అక్క‌డ ఇక్క‌డ అనే తేడా లేకుండా విరామం లేకుండా ఏదో ఒక సినిమా తీస్తూనే ఉంటాడు. ఏవో కార‌ణాల‌తో ఆయ‌న కొంత‌కాలంగా తెలుగు సినిమాపైనే కాన్సంట్రేట్ చేశాడు. అయితే త్వ‌ర‌లోనే ఆయ‌న మ‌ళ్లీ ముంబై షిఫ్ట‌వ్వ‌బోతున్నాడు. ఆ విష‌యాన్ని ట్వీట్ చేసి వెల్ల‌డించాడు వ‌ర్మ‌.

త్వ‌ర‌లో విడుద‌ల కానున్న `కిల్లింగ్ వీర‌ప్ప‌న్` విడుద‌ల త‌ర్వాత తాను మ‌ళ్లీ ముంబై షిఫ్ట‌వ్వ‌బోతున్నాన‌నీ, తన శిష్యుడైన పూరి జ‌గ‌న్నాథ్‌ ని, కేసీఆర్‌ నీ, త‌న త‌ల్లినీ, మెగా కుటుంబంపై ట్వీట్ల‌నీ మిస్ అవ్వ‌బోతున్నాన‌ని వ‌ర్మ ట్వీట్ చేశాడు. ర‌ణ్‌ - డిపార్ట్‌ మెంట్‌ - 26/11ముంబై ఎటాక్స్ లాంటి చిత్రాల త‌ర్వాత వ‌ర్మ హైద‌రాబాద్‌ కి త‌న మ‌కాంని మార్చేశాడు. అప్ప‌ట్నుంచి తెలుగులోనే సినిమాలు తీస్తున్నాడు. త‌న శిష్యుడైన పూరిని త‌ర‌చుగా క‌లుసుకుంటూ, ఆయ‌న తీస్తున్న సినిమాలు చూస్తూ, వాటితోపాటు... ప‌వ‌న్‌ క‌ళ్యాణ్‌ - కేసీఆర్‌ ల గురించి ట్వీట్లు చేస్తూ వార్త‌లో క‌నిపిస్తూ వ‌చ్చాడు వ‌ర్మ‌. త్వ‌ర‌లో అమితాబ్ బ‌చ్చ‌న్‌ తో ఓ సినిమా తీయ‌డం కోస‌మే వ‌ర్మ ఈసారి ముంబై వెళ్లిపోతున్న‌ట్టు తెలిసింది. స‌చిన్‌ జోషి తోనూ అక్క‌డ ఓ చిత్రం చేస్తున్నాడు.