Begin typing your search above and press return to search.

తెలుగు మహాస‌భ‌లు...జ‌క్క‌న్న స‌ల‌హా క‌రెక్టేనా?

By:  Tupaki Desk   |   19 Dec 2017 4:31 PM IST
తెలుగు మహాస‌భ‌లు...జ‌క్క‌న్న స‌ల‌హా క‌రెక్టేనా?
X
భాగ్య న‌గ‌రి హైద‌రాబాదు వేదిక‌గా జ‌రుగుతున్న ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భల పుణ్య‌మా అని తెలుగును బ‌తికించుకునే దిశ‌గా ప‌లు స‌ల‌హాలు - సూచ‌న‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం తెలుగు ప్ర‌జ‌లుగా గుర్తింపు ఉన్న మ‌నం మ‌న మాతృభాష అయిన తెలుగునే వాడుతున్నామా? లేదంటే ప‌రాయి భాష మోజులో ప‌డిపోయి మాతృభాష‌ను చంపుకుంటున్నామా? అన్న కోణంలోనూ ఈ స‌భ‌లు జ‌నాల‌ను ప్ర‌శ్నించేలా చేశాయ‌ని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్ర‌మంలో మ‌హాస‌భ‌ల్లో నాలుగో రోజు కార్య‌క్ర‌మాల్లో భాగంగా తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప్ర‌ముఖుల‌ను ఆహ్వానించిన తెలంగాణ స‌ర్కారు.. వారిని ఘ‌నంగా స‌న్మానించింది. ఈ సంద‌ర్భంగా మాట్లడిన ద‌ర్శ‌క ధీరుడు ఎస్ ఎస్ రాజ‌మౌళి తెలుగు క్ర‌మంగా తెర‌మ‌రుగువుతున్న వైనం - పొరుగు రాష్ట్రం త‌మిళ‌నాడులో విక‌సిస్తున్న త‌మిళాన్ని ప్ర‌స్తావించారు. ఏ ఇద్ద‌రు త‌మిళులు క‌లిసినా... వారి మ‌ధ్య చ‌ర్చ మొత్తం త‌మిళంలోనే కొన‌సాగుతుంద‌ని చెప్పిన జ‌క్క‌న్న‌... ఇద్ద‌రు తెలుగోళ్లు క‌లిస్తే మాత్రం తెలుగుకు బ‌దులుగా ఇత‌ర భాష‌ల్లో చ‌ర్చలు జ‌రుగుతున్నాయ‌ని ఆవేద‌న వ్యక్తం చేశారు.

అదే స‌మ‌యంలో తెలుగును బ‌తికించుకునేందుకు ఏమేం చేయాల‌న్న విష‌యాన్ని ఆయ‌న ప్ర‌స్తావించారు. త‌మిళ‌నాడు ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఓ గుడి వ‌ద్ద త‌న‌కు ఎదురైన ఓ అనుభ‌వాన్ని జ‌క్క‌న్న ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తావించారు. ఓ గుడి వ‌ద్ద కూర్చున్న చిన్నారులు... త‌మ పాఠ్య పుస్త‌కాల‌కు బ‌దులుగా త‌మిళ నేప‌థ్యం - జీవ‌న విధానం - మాన‌వ‌తా విలువ‌ల‌ను బోధించేందుకు ఉద్దేశించిన త‌మిళ పుస్త‌కం తిరుక్క‌ర‌ల్ ను ఆస‌క్తిగా చ‌దువుతున్నార‌ట‌. ఇదేంటీ... పాఠ్య పుస్త‌కాలు కాకుండా ఈ క‌థ‌ల పుస్తకాన్ని చ‌దువుతున్నార‌ని జ‌క్క‌న్న ప్ర‌శ్నిస్తే... ఈ పుస్త‌కంలోని క‌థ‌లు - క‌విత‌ల‌ను కంఠ‌త చేసి చెబితే ప్ర‌భుత్వం నుంచి న‌గ‌దు బ‌హుమ‌తులు ల‌భిస్తాయ‌ని వారు ఆయ‌న‌కు చెప్పార‌ట‌. అంటే... త‌మిళ భాష‌ను పిల్ల‌ల మెద‌ళ్ల‌లోకి ఎక్కించేందుకు త‌మిళులు - అక్క‌డి ప్ర‌భుత్వం చేప‌డుతున్న ఈ చ‌ర్య‌ను రాజ‌మౌళి కీర్తించారు.

ప్ర‌స్తుతం తెలంగాణ ప్ర‌భుత్వం కూడా అదే రీతిన వేమ‌న శ‌త‌కాన్నో, తెలుగు భాష‌లో ఇంకేదైనా చ‌దివి కంఠ‌తా చేస్తే న‌గ‌దు పుర‌స్కారాలు ప్ర‌క‌టించాల‌ని, దానితో విద్యార్థులు తెలుగును ఆస‌క్తిగా నేర్చుకునే అవ‌కాశం ఉంద‌ని కూడా ఆయ‌న చెప్పారు. అయితే తెలుగు భాష‌ను నేర్పించేందుకు న‌గ‌దు బ‌హుమ‌తులు ఇద్దామంటే... లంచ‌మిచ్చిన‌ట్లే క‌దా అన్న ఓ కొత్త వాద‌న వినిపిస్తోంది. అయినా మాతృభాష‌ను నేర్పించేందుకు న‌గ‌దు బ‌హుమ‌తులు అవ‌స‌ర‌మా? అన్న ప్ర‌శ్న‌లు కూడా వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో న‌గ‌దు బ‌హుమ‌తుల‌కు బ‌దులుగా గ్రేస్ మార్కులు ఇస్తే స‌రిపోతుంద‌న్న మ‌రో కొత్త వాద‌న కూడా తెరపైకి వ‌చ్చింది. మొత్తంగా రాజ‌మౌళి సూచించిన స‌ల‌హాతో... పిల్ల‌ల బుర్ర‌ల్లోకి తెలుగును ఎక్కించేందుకు ఇన్నేసి స‌ల‌హాలు, ఇన్నేసి వ‌క్ర మార్గాలు అవ‌స‌ర‌మా? అని భాషాభిమానులు - పండితులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.