Begin typing your search above and press return to search.

మరోసారి మంచి మనసు చాటుకున్న హీరో సూర్య..!

By:  Tupaki Desk   |   17 April 2022 2:30 AM GMT
మరోసారి మంచి మనసు చాటుకున్న హీరో సూర్య..!
X
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. వైవిధ్యమైన సినిమాలతో తన విలక్షణ నటనతో తమిళంతో పాటు తెలుగులోనూ ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు.ఇక రీల్ హీరోగానే కాకుండా రియల్ లైఫ్ లోనూ హీరో అనిపించుకున్నారు సూర్య.

ఆగారం ఫౌండేషన్ ను స్థాపించి సూర్య గత పదేళ్లుగా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎంతోమంది పిల్లలకు ఉచితంగా చదువులు చెప్పించడమే కాదు.. ఎందరో పేదలను ఆదుకుంటున్నారు.కరోనా పాండమిక్ టైంలో నిర్విరామంగా సేవలు కొనసాగించారు. ఈ క్రమంలో తాజాగా మరోసారి సూర్య తన ఉదార మనసు చాటుకున్నారు.

ఇటీవల 'ఈటీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూర్య.. విలక్షణ దర్శకుడు బాలా దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు.ఇది అగ్ర హీరో కెరీర్ లో 41వ చిత్రం. ఇందులో సూర్య ఒక జాలరి (మత్స్యకారుడు) గా కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కన్యాకుమారి సముద్ర తీర ప్రాంతంలో జరుగుతోంది.

#Suriya41 సినిమా కోసం తీర ప్రాంతంలో భారీ ఖర్చుతో సెట్స్ నిర్మాణం చేపడుతున్నారు. ఇందులో భాగంగా మత్స్యకారులు నివసించే ఇల్లు - గుడిసెలను నిర్మిస్తున్నారు. అయితే షూటింగ్ తరువాత ఈ నిర్మాణాలను కూల్చేయకుండా ఇళ్లు లేని జాలర్లకు ఉచితంగా ఇవ్వాలని సూర్య నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

సినిమాలో మత్స్యకారుడి పాత్రలో నటిస్తున్న సూర్య.. వారి జీవితాలను దగ్గరగా చూసి.. ఇల్లు లేని వారి కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు.సూర్య చేసిన పనికి ఆయన అభిమానులే కాకుండా ప్రతీ ఒక్కరూ అభినందిస్తున్నారు. సూర్య ఉదారగుణం గురించి గొప్పగా చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

ఇకపోతే సూర్య - డైరెక్టర్ బాలా కాంబో గతంలో 'నందా' 'పితామహన్' వంటి చిత్రాలు వచ్చాయి.ఈ క్రమంలో ఇప్పుడు మరోసారి జత కడుతుండటంతో అందరిలో ఆసక్తి నెలకొంది. సూర్య హోమ్ ప్రొడక్షన్ లో రూపొందుతోన్న ఈ చిత్రంలో 'ఉప్పెన' బ్యూటీ కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.

అలానే వెట్రిమారన్ దర్శకత్వంలో సూర్య 'వాడివసల్' అనే సినిమాలో నటిస్తున్నారు.ఇది సూర్య కెరీర్ లో వస్తున్న 40వ చిత్రం.వి క్రియేషన్స్ బ్యానర్ పై కలైపులి ఎస్. థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మదురై బ్యాక్ డ్రాప్ లో తమిళుల సాంప్రదాయ క్రీడ 'జల్లికట్టు' ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతుంది. దీని కోసం సూర్య శిక్షణ కూడా తీసుకున్నారని సమాచారం.