Begin typing your search above and press return to search.

బన్నీ విలనే.. సూర్యకు కూడా

By:  Tupaki Desk   |   5 July 2018 6:40 AM GMT
బన్నీ విలనే.. సూర్యకు కూడా
X
అల్లు అర్జున్ కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచిన ‘వరుడు’లో తమిళ నటుడు ఆర్య విలన్ పాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో ఆర్య చాలా బాగానే పెర్ఫామ్ చేశాడు కానీ.. సినిమా తేలిపోవడం రావాల్సిన గుర్తింపు రాలేదు. ఆ సినిమా హిట్టయితే ఆర్య ఇక్కడ బిజీ అయ్యేవాడేమో. తమిళంలో మాత్రం హీరోగా ఆర్య మంచి పేరే సంపాదించాడు. ఒక టైంలో వరుస హిట్లతో సాగిపోయాడు. కానీ ఆ తర్వాత గాడి తప్పిన అతను లైమ్ లైట్లో లేకుండా పోయాడు. త్వరలోనే ‘సంఘమిత్ర’ లాంటి భారీ చిత్రంలో కథానాయకుడిగా నటించబోతున్న ఆర్య.. ఇప్పుడు ఓ మెగా ప్రాజెక్టులో విలన్ పాత్ర దక్కించుకోవడం విశేషం. సూర్య హీరోగా ‘2.0’ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ కె.వి.ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమాలో ఆర్యనే విలన్‌ గా నటిస్తున్నాడు.

నిన్ననే ఈ విషయమై అధికారిక ప్రకటన ఇచ్చారు. సూర్యతో కలిసి షూటింగ్ స్పాట్ నుంచి ఆర్య ఫొటో కూడా దిగి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తాను ఆరాధించిన కథానాయకుడి సినిమాలో కీలక పాత్ర చేస్తుండటం పట్ల ఆర్య చాలా ఎగ్జైట్ అయ్యాడు. విశేషం ఏంటంటే.. ఈ చిత్రంలో అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. ఇంకా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ సైతం ఇంకో ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ‘అఖిల్’ హీరోయిన్ సాయేషా ఈ చిత్రంలో సూర్యకు జోడీగా కనిపించబోతుండటం విశేషం. హ్యారిస్ జైరాజ్ సంగీతాన్నందిస్తున్నాడు. ఇంతకుముందు సూర్య-ఆనంద్ కాంబినేషన్లో ‘వీడొక్కడే’ - ‘బ్రదర్స్’ లాంటి వైవిధ్యమైన సినిమాలొచ్చాయి. దీని కంటే ముందు సూర్య.. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ‘ఎన్జీకే’ అనే సినిమా చేస్తున్నాడు. అది ఈ ఏడాది దీపావళికి విడుదలవుతుంది. సూర్య-ఆనంద్ సినిమా వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకొస్తుంది.