Begin typing your search above and press return to search.

టీజ‌ర్ టాక్: పైలెట్ ఎమోష‌నల్ లైఫ్ జ‌ర్నీ

By:  Tupaki Desk   |   7 Jan 2020 7:28 PM IST
టీజ‌ర్ టాక్: పైలెట్ ఎమోష‌నల్ లైఫ్ జ‌ర్నీ
X
బ‌యోపిక్ ల ట్రెండ్ అంత‌కంత‌కు వేడెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ కేట‌గిరీలోనే తెర‌కెక్కుతున్న తాజా సినిమా `ఆకాశం నీ హ‌ద్దురా`. త‌మిళ స్టార్ హీరో సూర్య ఈ చిత్రంలో క‌థానాయ‌కుడు. గ‌తంలో వెంక‌టేష్ హీరోగా న‌టించిన `గురు` చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సుధ కొంగ‌ర ఈ బ‌యోపిక్ కి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఎయిర్ డెక్కన్ ఫౌండర్.. పైలెట్ జీ.ఆర్‌. గోపినాధ్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

తాజాగా టీజ‌ర్ రిలీజైంది. టీజ‌ర్ ఆద్యంతం ఇంటెన్స్ లుక్ తో సూర్య ర‌క్తి క‌ట్టించార‌నే చెప్పాలి. ఒక సాధార‌ణ పైలెట్ అసాధార‌ణ ప్ర‌య‌త్నంలో ఎలాంటి ఎమోష‌న్ దాగి ఉంది? అత‌డి దారికి అడ్డుత‌గిలిన ప‌రిస్థితులు ఏమిటి? చుట్టూ ఉన్న‌ మ‌నుషులు త‌న‌ని ఎంత ఎమోష‌న‌ల్ గా మార్చారు? అన్న‌ది క‌ళ్ల‌కుగ‌ట్టిన‌ట్టు తెర‌కెక్కిస్తున్నార‌ని అర్థ‌మ‌వుతోంది. నేటి త‌రానికి ఎంతో స్ఫూర్తి నిచ్చే కంటెంట్ ఈ చిత్రంలో ఉంద‌ని టీజ‌ర్ తోనే అర్థ‌మ‌వుతోంది. ఇక ఈ టీజర్ లో సూర్య‌ ఇంటెన్స్ న‌ట‌న‌తో పాటు.. మోహన్ బాబు వాయిస్ ఓవర్ ప్ర‌త్యేక‌ ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. క‌లెక్ష‌న్ కింగ్ మోహన్ బాబు ఇందులో ఓ కీలకపాత్ర లో న‌టిస్తుండ‌డం ఆస‌క్తి పెంచుతోంది.

ఒక సాధార‌ణ పైలెట్ ఎయిర్ డెక్క‌న్ విమాన‌యాన కంపెనీ అధినేత‌గా ఎద‌గ‌డం అంటే ఆ ఆషామాషీ జ‌ర్నీ కాదు. ఆ జ‌ర్నీని ఆర్.ఆర్ తో ఎలివేట్ చేయాల్సి ఉంటుంది. టీజ‌ర్ లో జీవీ ప్ర‌కాష్ ఆర్.ఆర్ మ‌రో ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా క‌నిపిస్తోంది. అపర్ణ బాలమురళి ఈ చిత్రంలో క‌థానాయిక‌. వ‌రుస వైఫ‌ల్యాల‌తో విసుగెత్తిన సూర్య ఈసారి క‌సిగా ఓ కొత్త‌పంథా క‌థాంశాన్ని ఎంచుకుని న‌టిస్తున్నారు. మ‌రి ఈ చిత్రం అత‌డికి కంబ్యాక్ అవుతుందా లేదా? అన్న‌ది చూడాలి.