సాయిపల్లవి సలహాతో గండం నుంచి గట్టెక్కిన అనుపమ!
ఆ సమయంలో ఇండస్ట్రీ సహా బయట వ్యక్తులు చాలా మందితో కమ్యూనికేషన్ తెగిపోయింది.
By: Srikanth Kontham | 10 Jun 2026 3:00 PM ISTదక్షిణాది చిత్ర పరిశ్రమలో తనదైన నటనతో.. చురుకైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటి అనుపమ పరమేశ్వరన్ తన జీవితంలోని ఓ చీకటి అధ్యాయాన్ని.. ఆ సమయంలో తనకు లభించిన ఒక ఆత్మీయ మద్దతును ఇటీవల రివీల్ చేసారు. 2021వ సంవత్సరం తన వ్యక్తిగత - వృత్తిపరమైన జీవితంలో అత్యంత కష్టమైన కాలమని గుర్తు చేసుకున్నారు. ఆ మానసిక ఒత్తిడి నుండి బయట పడటానికి తనలోని సరికొత్త కళాత్మక కోణాన్ని ఆవిష్కరించుకోవడానికి తోటి నటి సాయి పల్లవి ఎలా సహాయపడిందో? అనుపమ వివరించారు. 2021లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోవిడ్ పరిస్థితులు.. కెరీర్‌లో ఎదురైన కొన్ని ఒడిదుడుకులు అనుపమను తీవ్రమైన మానసిక ఆందోళనకు గురిచేసాయి.
ఆ సమయంలో ఇండస్ట్రీ సహా బయట వ్యక్తులు చాలా మందితో కమ్యూనికేషన్ తెగిపోయింది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సాయి పల్లవి ఆమెకు అండగా నిలిచారు. ఒక నటిగా కాకుండా మంచి స్నేహితురాలిగా అనుపమ బాధను అర్థం చేసుకుని.. ఆమె మనసును ప్రశాంత పరచడానికి నిరంతరం శ్రమించారని అనుపమ కృతజ్ఞతతో చాటుకున్నారు. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఏదైనా సృజనాత్మక పనిపై దృష్టి పెట్టాలని సాయి పల్లవి ఆమెకు సలహా ఇచ్చారు. అందులో భాగంగానే అనుపమకు పెయింటింగ్ అలవాటును పరిచయం చేశారు.
రంగులతో కాన్వాస్‌పై భావాలను పంచుకోవడం ద్వారా మనసులోని భారాన్ని దించుకోవచ్చని సాయి పల్లవి సూచించారుట. అలా మొద లైన పెయింటింగ్ ప్రయాణం, అనుపమ జీవితంలో సరికొత్త ఊరటను, ప్రశాంతతను తసుకొచ్చింది. తొలినాళ్లలో కాలక్షేపం కోసం ..మనశ్శాంతి కోసం వేసిన రంగులు, కాలక్రమేణా అనుపమలో సరికొత్త నైపుణ్యాన్ని వెలికితీశాయి. పెయింటింగ్ వేయడం వల్ల తన ఆలోచనలలో స్పష్టత వచ్చిందని.. తనపై తనకు నమ్మకం పెరిగిందన్నారు. ఆ కష్ట కాలంలో కాన్వాస్ బోర్డు, బ్రష్‌లు తనకు అత్యంత ఆప్తమిత్రులుగా మారాయన్నారు. తనలోని ప్రతికూల ఆలోచనలన్నింటినీ రంగుల రూపంలో సానుకూలంగా మార్చుకోగలిగానని వివరించారు.
చిత్ర పరిశ్రమలో నటీనటుల మధ్య పోటీ వాతావరణం ఉంటుందనే అభిప్రాయం సమాజంలో ఉంది. కానీ ఒకే రంగంలో ఉన్న ఇద్దరు స్టార్ హీరోయిన్ల మధ్య ఇంతటి లోతైన, నిస్వార్థమైన స్నేహబంధం ఉండటం అటు అభిమానులను.. ఇటు పరిశ్రమ వర్గాలను ఎంతగానో ఆకట్టుకుంటోంది. సాయి పల్లవి చూపించిన చొరవ, మానవీయ కోణం ఆమెపై గౌరవాన్ని మరింత రెట్టింపు చేసిందని నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశంసిస్తున్నారు.
కష్టాలను అధిగమించి కెరీర్ పరంగా వైవిధ్యమైన పాత్రలతో దూసుకుపోతున్న అనుపమ ఇప్పటికీ ఖాళీ సమయాల్లో పెయింటింగ్ కొనసాగిస్తున్నారు. జీవితంలో ఎదురయ్యే మానసిక సవాళ్లను ఎదుర్కోవడానికి ఏదో ఒక కళ లేదా అభిరుచి ఎంతగానో తోడ్పడుతుందనే దానికి తన జీవితమే ఓ ఉదాహరణ అని పేర్కొన్నారు. నటనలోనే కాకుండా చిత్రలేఖనంలోనూ సృజనాత్మకతను చాటుకుంటూ తోటివారికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
