మెరుగైన సమాజం కోసం అల్లు అర్జున్!
డ్రగ్స్ మహమ్మారీ ఇరు తెలుగు రాష్ట్రాల్లో పెనుసమస్యగా మారింది. మాదకద్రవ్యాల వినియోగం అంతకంతకు పెరుగుతోందే కానీ తగ్గడం లేదు.
By: Tupaki Desk | 29 Nov 2024 6:05 AM GMTడ్రగ్స్ మహమ్మారీ ఇరు తెలుగు రాష్ట్రాల్లో పెనుసమస్యగా మారింది. మాదకద్రవ్యాల వినియోగం అంతకంతకు పెరుగుతోందే కానీ తగ్గడం లేదు. స్కూల్స్, కాలేజీల్లో అమాయక విద్యార్థులు మత్తుకు బానిసవుతున్న వైనం భయపెడుతోంది. నార్కోటిక్స్ బ్యూరో ఎంతగా కంట్రోల్ చేయాలనుకున్నా.. ఇది ఆగడం లేదు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో నిరంతరం గంజాయి పట్టుబడుతుండడంతో అక్కడ పోలీస్ తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారు. డ్రగ్స్, గంజాయిపై ఉక్కు పాదం మోపేందుకు ఈగల్ అనే టీమ్ ని బరిలో దించింది. ప్రత్యేక అలవెన్సులతో ఈగల్ టీమ్ కి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు.
అయితే ఇరు తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ నియంత్రణకు ముఖ్యమంత్రులు తగినంతగా కృషి చేస్తున్నారనే చెప్పాలి.
డ్రగ్స్ వ్యతిరేక ప్రచారానికి తెలుగు సినీ పరిశ్రమలోని స్టార్ హీరోలు మద్దతు ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంతకుముందు కోరగా.. మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్ సహా అల్లు అర్జున్ మద్ధతుగా నిలిచారు. డ్రగ్స్ వ్యతిరేక ధీక్షలోకి అగ్ర హీరోలతో పాటు పలువురు స్టార్లు చేరుతున్నారు.
పుష్ప రిలీజ్ ముందు అల్లు అర్జున్ కూడా ఈ జాబితాలో చేరారు. ఆయన ఎక్స్‌లో వీడియోను షేర్ చేస్తూ.. బాధితుల గురించి తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు తెలియజేయాలని అందరినీ కోరారు. ``బాధితులను ఆదుకోవడానికి ఐక్యంగా ఉందాం. సురక్షితమైన, ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడానికి కృషి చేద్దాం. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రభావవంతమైన ఇనిషియేషన్‌లో చేరడాన్ని వినయపూర్వకంగా భావిస్తున్నాను`` అని అల్లు అర్జున్ రాశారు. ప్రచారవీడియోని కూడా బన్నీపై చిత్రీకరించారు.
అయితే చిరు, బన్ని, చరణ్, ప్రభాస్ లాంటి ప్రభావవంమైన స్టార్లు తెలంగాణతో పాటు, ఏపీ ప్రభుత్వానికి తగినంత మద్ధతు ఇవ్వాల్సి ఉంటుంది. తారల ప్రచారం విస్త్రతంగా జనబాహుళ్యంలోకి వెళుతుంది. తద్వారా డ్రగ్స్ విచ్చలవిడితనాన్ని తగ్గించే వీలుంటుంది. స్టార్ల ప్రచారంతో ప్రజలు దీనిని అర్థం చేసుకోగలుగుతారు. ఇక ముఖ్యమంత్రులకు ఫేవర్‌గా సెలబ్రిటీలు సహకరిస్తుండడంతో అది పరిశ్రమకు సహకారంగా మారుతుందనడంలో సందేహం లేదు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో మొదటి వారంలో టికెట్ ధరల పెంపు, పరిశ్రమ అభివృద్ధికి నాయకులు సహకరిస్తారని ఆశించవచ్చు. డిసెంబర్ 5న వస్తున్న `పుష్ప 2` టికెట్ ధరల పెంపునకు తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల నుంచి సహకారం అందుతుందని భావిస్తున్నారు.