ఆ డైరెక్టర్‌తో ఆమీర్‌ఖాన్ కల నెరవేరేనా?
ఇందులో జెనీలియా కూడా నటించడంతో ఇప్పుడు అందరి దృష్టి ఈ సినిమాపై పడింది.
By: Tupaki Desk | 9 Jun 2025 7:00 PM ISTమూడేళ్ల విరామం తరువాత బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్ నటించిన మూవీ `సితారే జమీన్ పర్`. ఆర్.ఎస్. ప్రసన్న దర్శకత్వంలో ఆమీర్‌ఖాన్, అపర్ణా పురోహిత్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. 2018లో వచ్చిన స్పానిష్ ఫిల్మ్ `ఛాంపియన్స్` ఆధారంగా ఈ సినిమాని రీమేక్ చేశారు. జూన్ 20న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాల్ని పెంచేశాయి.
ఇందులో జెనీలియా కూడా నటించడంతో ఇప్పుడు అందరి దృష్టి ఈ సినిమాపై పడింది. ప్రస్తుతం రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆమీర్ ఖాన్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఇందులో భాగంగా ఆమీర్ ఖాన్ పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. ప్రముఖ దర్శకుడు మణిరత్నం అంటే తనకు ఎంతో ఇష్టమన్నారు. అవకాశం వస్తే తప్పకుండా ఆయనతో సినిమా చేస్తానన్నారు.
దర్శకుడు మణిరత్నంకు నేను వీరాభిమానిని. ఆయనతో వర్క్ చేయాలని ఎంతో కాలంగా అనుకుంటున్నాను. ఇప్పటికే చాలా సందర్భాల్లో ఆయన్ని కలిశాను. ఆయన ఇంటికి కూడా వెళ్లాను. మేమిద్దరం ఎన్నో విషయాల గురించి చర్చించుకున్నాం. మా కాంబినేషన్‌లో `లజో` అనే సినిమా కూడా ఫిక్స్ చేశాం. అన్నీ అనుకున్నట్టు కుదిరితే అది ఎప్పుడో ప్రేక్షకుల ముందుకొచ్చేది. ఇప్పటికీ ఆయన మీద అభిమానం అలాగే ఉంది.
ఆయన వర్కింగ్ స్టైల్ నాకెంతో నచ్చుతుంది. తప్పకుండా ఏదో ఒకరోజు ఆయనతో కలిసి వర్క్ చేయాలనుకుంటున్నా` అంటూ మన సౌత్ డైరెక్టర్ మణిరత్నంపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు ఆమీర్ ఖాన్. రానున్న రోజుల్లో ఈ కాంబినేషన్‌లో సినిమా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అంతా ఆశించిన స్థాయిలో మాత్రం వీరి కలయికలో వచ్చే సినిమా ఉంటుందన్న గ్యారంటీ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. దానికి జస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్‌గా విడుదలైన `థగ్ లైఫ్`. ఈ దశలో మణిరత్నంతో ఆమీర్‌ఖాన్ సినిమా చేయడం అంటే పెద్ద సాహసం చేయడమే అనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి.
