సూర్య ఔట్.. మరో హీరోతో ప్రముఖ దర్శకుడు
సూర్య హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో 'వాడివాసల్' అనే సినిమా రూపొందాల్సి ఉంది.
By: Tupaki Desk | 10 Jun 2025 4:00 PM ISTసూర్య హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో 'వాడివాసల్' అనే సినిమా రూపొందాల్సి ఉంది. చాలా కాలం క్రితమే వీరి కాంబో మూవీని అధికారికంగా ప్రకటించడం జరిగింది. జల్లికట్టు నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించబోతున్నట్లుగా కూడా ప్రకటించారు. సినిమా నుంచి సూర్య ఫస్ట్ లుక్‌ను విడుదల చేయడం ద్వారా అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించారు. వెట్రిమారన్ సినిమాలను ఇష్టపడే వారు ఆయన దర్శకత్వంలో సూర్య సినిమా అనగానే అంచనాలు పెంచేసుకున్నారు. విడుదల పార్ట్ 1, విడుదల పార్ట్ 2 సినిమాల తర్వాత సూర్యతో వెట్రిమారన్ సినిమా చేయాల్సి ఉంది. కానీ కంగువా సినిమా ఫలితమో లేదా మరేదైనా కారణమో కానీ ఆ సినిమా రద్దు అయింది అనే వార్తలు వస్తున్నాయి.
వెట్రిమారన్ మొన్నటి వరకు వాడివాసల్ సినిమాను చేస్తాడని ఇండస్ట్రీ వర్గాల వారు సైతం అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఆ సినిమాను పక్కన పెట్టి తమిళ హీరో శింబుతో సినిమాకు వెట్రిమారన్ రెడీ అయ్యాడు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే వీరి కాంబో మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభం అయింది. సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అతి త్వరలోనే సినిమా గురించి అధికారిక ప్రకటన వస్తుందని తెలుస్తోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన నటీ నటుల ఎంపిక జరుగుతుంది అనే వార్తలు సైతం తమిళ మీడియాలో వస్తున్నాయి.
సూర్య బ్యాక్ టు బ్యాక్ కంగువా, రెట్రో సినిమాలతో నిరాశ పరిచిన నేపథ్యంలో తదుపరి సినిమా విషయమై చాలా అంచనాలు ఉన్నాయి. బాలాజీ దర్శకత్వంలో ఇప్పటికే సూర్య సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత అయినా వెట్రిమారన్‌తో సినిమాను చేయవచ్చు. కానీ వెట్రిమారన్ తో కాకుండా తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరితో సూర్య సినిమాకు రెడీ అయ్యాడు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సూర్య ఈ రెండు సినిమాల తర్వాత కూడా వెట్రిమారన్ దర్శకత్వంలో సినిమా చేయక పోవచ్చు. అందుకు గల కారణాలు ఏంటి అనేది మాత్రం క్లారిటీ లేదు. సూర్య, వెట్రిమారన్ కాంబో ను ఇష్టపడే వారికి ఇది నిరాశ కలిగించే విషయం.
ఇక శింబు ఇటీవల బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దుమ్ము లేపుతున్నాడు. తాజాగా కమల్ హాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన థగ్ లైఫ్ సినిమాలో శింబు ముఖ్య పాత్రలో నటించాడు. ఆ సినిమా ఫలితం బెడిసికొట్టడంతో తదుపరి సినిమాపై ఆయన ఆశలు పెట్టుకున్నాడు. రామ్ కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వంలో శింబు ప్రస్తుతం సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమా కాకుండా శింబు కొత్తగా రెండు మూడు సినిమాలు కమిట్ అయ్యాడని, అందులో వెట్రిమారన్ దర్శకత్వంలో ఒక సినిమా అనే తెలుస్తోంది. వీరిద్దరి కాంబో కచ్చితంగా ఆకట్టుకునే విధంగా ఉంటుంది. అయితే శింబుతో తీయబోతున్న కథ గతంలో సూర్యతో అనుకున్నదేనా అనేది తెలియాల్సి ఉంది.