Begin typing your search above and press return to search.

మణిపూర్ లో ఘోరం... ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి..!

By:  Tupaki Desk   |   20 July 2023 6:47 AM GMT
మణిపూర్ లో ఘోరం... ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి..!
X

ఈ మధ్య కాలంలో దేశంలో అమానవీయ ఘటనలు ఎక్కువగా వెలుగు చూస్తున్న సంగతి తెలిసిందే. ఒక మనిషి తోటిమనిషిపై మూత్రం పోయడం, కాళ్లు నాకించుకోవడం... ఇలాంటి ఘోరమైన సంఘటనలు తరచూ వెలుగుచూస్తున్నాయి. ఈ క్రమంలో మరో దారుణ సంఘటన తెరపైకి వచ్చింది.

అవును... మణిపూర్ రాష్ట్రంలో ప్రస్తుతం హింసాత్మక ఘటనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అల్లర్లతో మణిపూర్ అల్లకల్లోలంగా మారితుందని కథనాలొస్తున్నాయి. అయితే ఇప్పటివరకూ ఈ విషయంపై కేంద్రప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలూ తీసుకోలేదని విపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాయి!

ఈ నేపథ్యంలో... మణిపూర్ రాజధాని ఇంఫాల్‌ కు 35 కిలోమీటర్ల దూరంలోని కాంగ్‌ పోక్పి జిల్లాలో ఒక దారుణ ఘటన జరిగిందని తెలుస్తుంది. ఓ గ్రామంలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించారట. అనంతరం వారిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడినట్లు గిరిజన సంఘం ఆరోపించింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన మే 4న జరిగిందని తెలుస్తుంది.

ఆదివాసీ గిరిజన నాయకుల ఫోరమ్ (ఐ.టీ.ఎల్‌.ఎఫ్‌.) చెబుతున్న వివరాల ప్రకారం... ఈ ఘటనకు ముందు లోయ ప్రాంతంలోని మెజార్టీ వర్గమైన మైతీ, కొండ ప్రాంతాల్లో నివసించే కుకీ వర్గం మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ సమయంలో కొంతమంది దుండగులు ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించారంట. అనంతరం వారిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారట.

తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వీడియోలో... మహిళలు ఎంత వేడుకున్నా నిందితులు కనికరించకుండా వారిని హింసించారని తెలుస్తుంది. పైగా... ఈ దృశ్యాలను వీడియోలు తీసి, వైరల్ చేయడం కూడా వారి పైశాచికత్వంలో భాగమనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దారుణ ఘటనపై రాజకీయ పార్టీలు, మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి! ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారని అంటున్నారు.

మరోపక్క... ఈ విషయాలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. మణిపూర్ వెళ్లిన ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు ఈ సంఘటన తెలియదా అని ప్రశ్నించారు. మణిపూర్‌ లో కొనసాగుతున్న ఇంటర్నెట్ నిషేధం కారణంగా ఇటువంటి భయంకరమైన సంఘటన దేశం మొత్తం తెలియకపోయినా... ఆ రాష్ట్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి, మణిపూర్ సిఎంతో మాట్లాడటానికి లేదా ఒక ప్రకటన విడుదల చేయడానికి 76 రోజులు వేచి ఉండటం క్షమించరాని విషయం అని జైరాం రమేష్ అన్నారు.

ఇదే సమయంలో కాంగ్రెస్ నేతలు.. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, సచిన్ పైలట్, శివసేన నేతలు.. ఆదిత్య థాకరే, ప్రియాంక చతుర్వేది, తృణమూల్ నేతలు.. మహువా మోయిత్రా, సాకేత్ గోఖలే లు ఈ సంఘటనపై ప్రధాని స్పందించాలని కోరుతూ... ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు.

తరచూ ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తుండటంతో.. బీజేపీ పై అటు రాష్ట్రంలోనూ, ఇటు కేంద్రంలోనూ తీవ్ర వ్యతిరేకత వస్తుందని తెలుస్తుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మణిపూర్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారే ఛాన్స్ ఉందని అంటున్నారు.

కాగా, మణిపూర్‌ లోని బీజేపీ ప్రభుత్వం రెండు నెలల కిందట ఎస్టీ స్టేటస్‌ కోసం డిమాండ్‌ చేస్తున్న మైతీ వర్గానికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే దీనిని కుకీ వర్గం వ్యతిరేకిస్తుంది. దీంతో నాటి నుంచి ఈ రెండు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగుతున్నాయి. ఈ హింసలో వందలాది మంది మరణించగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు.