బంగారం అమ్మి భర్త హత్యకు సుపారీ!
అక్రమ సంబంధాలు ఎంత దూరం తీసుకు వెళ్తాయో ఇప్పటికే పలు సంఘటనలు చూశాం. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన ఘటనలు చాలానే జరిగాయి.
By: Tupaki Desk | 24 April 2026 12:21 PM ISTఅక్రమ సంబంధాలు ఎంత దూరం తీసుకు వెళ్తాయో ఇప్పటికే పలు సంఘటనలు చూశాం. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన ఘటనలు చాలానే జరిగాయి. ప్రియురాలితో కలిసి భార్యను హత్య చేసిన భర్తలు చాలా మంది ఉన్నారు. ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకుని జీవిత భాగస్వామిని హత్య చేయడం ఆ తర్వాత పోలీసుల విచారణలో బయట పడటం ఈ మధ్య కాలంలో చాలా కామన్‌గా జరుగుతోంది. ముఖ్యంగా ఆడవారు ప్రియుడితో కలిసి చేస్తున్న హత్యలు, హత్యాయత్నాలకు సంబంధించిన వార్తలు కుర్రాళ్లను కంగారు పెడుతున్న విషయం తెల్సిందే. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో పెళ్లి చేసుకోవాలి అంటే భయంగా ఉందంటూ అబ్బాయిలు పోస్ట్ చేయడం, మీమ్స్ క్రియేట్ చేయడం మనం చూశాం. ఇప్పుడు మరోసారి ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసేందుకు ప్రయత్నించిన వివాహిత కేసు సంచలనంగా మారింది.
ప్రియుడితో కలిసి భర్త హత్యకు కుట్ర...
ప్రొద్దుటూరు మండల కేంద్రానికి సమీపంలో ఉండే లింగాపురంకు చెందిన దంపతులు ఈశ్వర్ రెడ్డి, శిల్పారెడ్డి మధ్య గత కొన్నాళ్లుగా గొడవలు ఉన్నాయి. ఇద్దరూ తరచు గొడవ పడుతూ ఉన్నప్పటికీ కలిసే ఉంటున్నారు. భర్తపై కోపంతో పలు సార్లు శిల్పా రెడ్డి దూరంగా వెళ్లింది. కానీ కుటుంబ సభ్యుల ఒత్తిడి కారణంగా తిరిగి ఈశ్వర్ రెడ్డి వద్దకు వచ్చేది. కొన్నాళ్ల క్రితం శిల్పా రెడ్డికి ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రిలో పనిచేసే దాసరిగాళ్ల నాగ సుధీర్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరి పరిచయం అక్రమ సంబంధానికి దారితీసింది. దాసరిగాళ్ల నాగ సుధీర్ వివాహితుడు అయినప్పటికీ ఇద్దరి మధ్య సంబంధం చాలా దూరం వెళ్ళింది. ఇద్దరూ వివాహం చేసుకోవాలి అనుకున్నారు. అందుకు శిల్పారెడ్డి భర్త ఈశ్వర్ రెడ్డి అడ్డుగా ఉన్నాడు. అతడిని తప్పించాలని వారు అనుకున్నారు. అంతలోనే శిల్పా రెడ్డి అక్రమ సంబంధ వ్యవహారం ఈశ్వర్ రెడ్డికి తెలిసింది.
అక్రమ సంబంధం బయట పడటంతో...
భార్య అక్రమ సంబంధం విషయం తెలిసిన ఈశ్వర్ రెడ్డి మండి పడ్డాడు. పలు సార్లు మందలించినా కూడా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. పదే పదే ఫోన్ మాట్లాడుతూ ఉండటంతో ఈశ్వర్ రెడ్డి కఠినంగా వ్యవహరించాడని సమాచారం. ఈశ్వర్ రెడ్డి బతికి ఉంటే తాము కలిసి ఉండలేమనే నిర్ణయానికి వచ్చిన శిల్పా రెడ్డి, నాగ సుధీర్‌లు అతడిని తప్పించాలనే నిర్ణయానికి వచ్చారు. అందుకోసం నాగ సుధీర్ తెలిసిన వారికి సుపారీ ఇచ్చి మరీ హత్య చేసేందుకు మాట్లాడాడు. రూ.10 లక్షలు సుపారీ తీసుకుని చంపేందుకు హిందూపురానికి చెందిన కిరాయి ముఠా ఒకటి రెడీ అయింది. ఈశ్వర్ రెడ్డి కదలికల గురించి ఎప్పటికప్పుడు శిల్పా రెడ్డి సమాచారం ఇవ్వడంతో అందుకు తగ్గట్టుగా హత్య ప్రయత్నాలు మొదలు పెట్టారు. బైక్ పై వెళ్తున్న ఈశ్వర్ రెడ్డిని కారుతో గుద్ది కింద పడ్డ తర్వాత కత్తులతో పొడిచి చంపాలి అనేది ముఠా ప్లాన్.
బైక్ పై వెళ్తున్న ఈశ్వర్ పై కత్తులతో దాడి...
ఈశ్వర్ రెడ్డిని హత్య చేసేందుకు ఒప్పుకున్న ముఠాకు శిల్పా రెడ్డి తన బంగారం అమ్మి మరి అడ్వాన్స్ ఇచ్చింది. ప్రియుడు నాగ సుధీర్‌కి శిల్పా రెడ్డి తనవద్ద ఉన్న 14 తులాల బంగారం ను ఇచ్చింది. అందులో కొంత మొత్తంను అమ్మిన సుధీర్, కొంత మొత్తంను తనకా పెట్టాడు. మొత్తంగా అయిదు లక్షల రూపాయలను సుపారీ ముఠాకు అడ్వాన్స్‌గా ఇచ్చాడు. అడ్వాన్స్ అందుకున్న గ్యాంగ్ ఈశ్వర్ రెడ్డి ని చంపేందుకు రెడీ అయ్యారు. ప్రొద్దుటూరులో ఈశ్వర్ రెడ్డి ప్రయాణిస్తున్న బైక్ ను కారుతో ఢీ కొట్టారు. అంతటితో ఆగకుండా కత్తులతో దాడి చేసి చంపేందుకు గాను మీదకు దూసుకు వచ్చారు. అదృష్టవశాత్తు ఈశ్వర్ రెడ్డి హంతకుల నుంచి తప్పించుకున్నాడు. పోలీస్ స్టేషన్‌కి చేరుకున్న ఈశ్వర్ రెడ్డి బతికి బయట పడ్డాడు. కేసు నమోదు చేసిన పోలీసులు లోతుగా విచారిస్తే మొత్తం విషయం బయటకు వచ్చింది. శిల్పా రెడ్డి, ఆమె ప్రియుడితో పాటు, సుపారీ ముఠాను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమ సంబంధంతో అందమైన కుటుంబం ను శిల్పా రెడ్డి నాశనం చేసుకుని ఇప్పుడు జైలు జీవితం ను అనుభవిస్తోంది.
