బర్త్ డే పార్టీలో ముగ్గురు ఫ్రెండ్స్ చంపినోడు ఎన్ కౌంటర్
కొన్ని ఉదంతాల గురించి విన్నప్పుడు విస్మయానికి గురి అవుతాం. అలా ఎలా? అన్న ప్రశ్న మనసును తొలిచేస్తుంది.
By: Tupaki Desk | 1 May 2026 10:17 AM ISTకొన్ని ఉదంతాల గురించి విన్నప్పుడు విస్మయానికి గురి అవుతాం. అలా ఎలా? అన్న ప్రశ్న మనసును తొలిచేస్తుంది. ఎంత మర్చిపోదామన్నా మర్చిపోనివ్వకుండా వెంటాడే ఉదంతాలు కొన్ని అప్పుడప్పుడు వార్తల రూపంలో వస్తుంటాయి. ఇప్పుడు చెప్పే ఉదంతం కూడా ఆ కోవకు చెందిందే. మూడు నాలుగు రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకున్న మూడు హత్యల ఉదంతం అందరిని షాక్ కు గురి చేసింది.
ఈ మాత్రం దానికి ముగ్గురు స్నేహితుల్ని చంపేయటమా? అన్న సందేహం కలిగింది. ఎంత విపరీతమైన మనస్తత్వం అయితే మాత్రం మరీ ఇంత దారుణమా? అన్నది ఒక ప్రశ్న అయితే.. స్నేహితుడిలోని ఈ విపరీతాన్ని మిగిలిన స్నేహితులు గుర్తించలేదా? సరదాగా చేసిన పనిని సీరియస్ గా తీసుకొని ముగ్గురు ఫ్రెండ్స్ ప్రాణాల్ని తీసిన వైనం షాక్ కు గురి చేసింది. అవును.. పుట్టినరోజు పార్టీలో బర్త్ డే కేక్ ను ముఖానికి పులిమేశారన్న ఆగ్రహంతో ముగ్గురు స్నేహితుల్ని (అమరదీప్(30), మనీశ్ (28), ఆకాశ్ (18) కాల్చి చంపిన ఒక ప్రబుద్దుడి వైనం దేశ వ్యాప్తంగా అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
ఈ కేసుకు సంబంధించిన తాజా అప్డేట్ వెలుగు చూసింది. ఉత్తరప్రదేశ్ లోని బులంద్ శహర్ జిల్లాలో జరిగిన ఈ మూడు హత్యలకు కొనసాగింపుగా మరో మరణం చోటు చేసుకుంది. ఈసారి ముగ్గురు స్నేహితుల్ని చంపేసినోడి ప్రాణాలు పోయాయి. ముగ్గురు ఫ్రెండ్స్ ను చంపేసిన ప్రధాన నిందితుడు జీతూ సైనీ కోసం పోలీసులు తీవ్రంగా గాలించారు. ఒకదశలో స్నేహితుల్ని పొట్టన పెట్టుకున్న అతగాడిని పట్టించిన వారికి.. అతడి సమాచారాన్ని ఇస్తే రూ.50వేల రివార్డును పోలీసులు ప్రకటించారు. ఈ ఉదంతంలో జీతూతో పాటు మరో ఇద్దరు స్నేహితులు కూడా నిందితులుగా ఉన్నారు.
వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. ఖుర్జా గ్రామీణ పోలీసు స్టేషన్ పరిధిలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. ముగ్గురు స్నేహితుల ప్రాణాల్ని తీసిన జీతూను పోలీసులు గుర్తించారు.అతడ్ని అదుపులోకి తీసుకునే క్రమంలో అతను పారిపోయే ప్రయత్నం చేశాడు. పోలీసులపై దాడికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో జీతూ ఎన్ కౌంటర్ అయ్యాడు. ఈ క్రమంలో ఇద్దరు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. మొత్తంగా చూస్తే.. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన కేసులోని ప్రధాననిందితుడు ఎన్ కౌంటర్ కావటం ఇప్పుడు మరో సంచలనంగా మారింది. తీవ్రమైన నేరాలకు పాల్పడే వారు ఎవరైనా ఉత్తరప్రదేశ్ లో ఎన్ కౌంటర్ అవుతున్నారన్న వ్యాఖ్యకు తగ్గట్లే తాజా ఉదంతం ఉండటం గమనార్హం.
