Begin typing your search above and press return to search.

అయ్యో అనిపించే విషాదం.. ఒకే ఇంట్లో 7గురు సూసైడ్

విన్నంతనే ఉలిక్కిపడే విషాదం ఒకటి చోటు చేసుకుంది.

By:  Tupaki Desk   |   29 Oct 2023 11:01 AM IST
అయ్యో అనిపించే విషాదం.. ఒకే ఇంట్లో 7గురు సూసైడ్
X

విన్నంతనే ఉలిక్కిపడే విషాదం ఒకటి చోటు చేసుకుంది. చేసిన అప్పులు కొండలా మారి.. తీర్చేందుకు అవకాశాల్లేని వేళ.. దిక్కుతోచని స్థితిలో ప్రాణాలు తీసుకోవటమే పరిష్కారంగా భావించిన ఒక కుటుంబం మొత్తం ఆత్మహత్యలకు పాల్పడిన వైనం అయ్యో అనిపించేలా మారింది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు విగతజీవులుగా పడి ఉన్న వైనం చూసినంతనే.. మనసు వికలమయ్యే పరిస్థితి.

గుజరాత్ లోని వజ్రాల నగరంగా పేర్కొనే సూరత్ లో ఈ దారుణం చోటు చేసుకుంది. కాంట్రాక్టర్ గా పని చేసే మనీశ్ సోలంకి.. ఆయన తల్లిదండ్రులు.. భార్య.. ఆరేళ్ల కొడుకుతో పాటు.. పది.. పదమూడేళ్ల కుమార్తెలు మొత్తం ఏడుగురు ఆత్మహత్య చేసుకున్న వైనం స్థానికంగా షాకింగ్ గా మారింది. ఎంత అప్పులైతే మాత్రం ఇలా కుటుంబం మొత్తం కడతేరిపోవటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

మనీశ్ సోలంకి ఉరి వేసుకొని ఉండగా.. మిగిలిన వారంతా మంచం మీదా.. నేల మీదా పడి ఉన్నారు. ఇంట్లో విషం సీసా.. ఆత్మహత్య లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొందరి నుంచి తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేని పరిస్థితుల్లో దిక్కు తోచక ఆత్మహత్య చేసుకున్నట్లుగా అందులో పేర్కొన్నారు. మనీశ్ సోలంకి ముందుగా ఇంట్లోని వారందరికి విషం తాగించి.. ఆ తర్వాత తాను ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లుగా భావిస్తున్నారు. ఈ తీవ్ర విషాదం ఇప్పుడు షాకింగ్ గా మారింది.