Begin typing your search above and press return to search.

వార్-2.. హృతిక్ ప‌వ‌ర్ చూపిస్తున్నాడు

జూనియ‌ర్ ఎన్టీఆర్ తొలి బాలీవుడ్ మూవీ వార్-2 మీద నంద‌మూరి చాలా ఆశ‌లు పెట్టుకున్నారు కానీ.. వారి ఆశ‌లు ఫ‌లించ‌న‌ట్లే.

By:  Tupaki Desk   |   18 Aug 2025 10:58 AM IST
వార్-2.. హృతిక్ ప‌వ‌ర్ చూపిస్తున్నాడు
X

జూనియ‌ర్ ఎన్టీఆర్ తొలి బాలీవుడ్ మూవీ వార్-2 మీద నంద‌మూరి చాలా ఆశ‌లు పెట్టుకున్నారు కానీ.. వారి ఆశ‌లు ఫ‌లించ‌న‌ట్లే. తార‌క్ హిందీలో మార్కెట్ పెంచుకుంటాడ‌ని.. తెలుగులోనూ ఈ మూవీతో స‌త్తా చూపిస్తాడ‌ని అభిమానులు ఆశించగా.. రెండు ర‌కాలుగా నిరాశ త‌ప్ప‌లేదు. తెలుగు హ‌క్కుల‌ను రూ.80 కోట్ల‌కు పైగా రేటు పెట్టి కొంటే.. అందులో స‌గం షేర్ రావ‌డం కూడా క‌ష్టంగా ఉంది.

అడ్వాన్స్ బుకింగ్స్‌లో తెలుగు రాష్ట్రాల వ‌ర‌కు జోరు చూపించిన ఈ సినిమా.. రిలీజ్ త‌ర్వాత ఇక్క‌డ జోరు త‌గ్గిపోయింది. కానీ హిందీలో ఈ సినిమా రిలీజ్ త‌ర్వాత మెరుగ్గా పెర్ఫామ్ చేస్తోంది. హృతిక్ స్టార్ ప‌వ‌ర్ విడుద‌ల‌కు ముందు పెద్ద‌గా క‌నిపించ‌లేదు. కానీ తొలి వీకెండ్లో ఈ సినిమా హిందీలో అంచ‌నాల‌ను మించి వ‌సూళ్లు రాబ‌డుతోంది. అందుక్కార‌ణం ప్ర‌ధానంగా హృతికే అన‌డంలో సందేహం లేదు. వార్-2కు హిందీలో కూడా పాజిటివ్ టాకేమీ లేదు. రివ్యూలు కూడా నెగెటివ్‌గానే వ‌చ్చాయి. కానీ ఈ సినిమాకు హిందీలో వ‌సూళ్లు మాత్రం నిల‌క‌డ‌గానే ఉన్నాయి.

తొలి రోజు త‌ర్వాత వార్‌-2కు తెలుగులో వ‌సూళ్లు త‌గ్గుతూ వెళ్తుంటే.. హిందీలో మాత్రం నిల‌క‌డ‌గా వ‌సూళ్లు వ‌స్తున్నాయి. డే-1 హిందీలో రూ.29 కోట్లు క‌లెక్ట్ చేసిన ఈ చిత్రం.. రెండో రోజు రూ.35 కోట్ల దాకా రాబ‌ట్టింది. త‌ర్వాతి రెండు రోజుల్లో క‌లిపి హిందీలో ఈ సినిమా రూ.50 కోట్ల మేర వ‌సూళ్లు తెచ్చుకుంది. విదేశాల్లో కూడా వార్-2 తెలుగు వెర్ష‌న్‌తో పోలిస్తే హిందీ వెర్ష‌న్‌కే ఎక్కువ క‌లెక్ష‌న్లు వ‌స్తున్నాయి. హిందీలో ప్రేక్ష‌కులు అడ్వాన్స్ బుకింగ్స్ ప‌ట్ల అంత‌గా ఉత్సాహం చూపించరు.

అక్క‌డ వాకిన్స్ ఎక్కువ ఉంటాయి. సినిమాల‌కు పాజిటివ్ టాక్ ఉంటే లాంగ్ ర‌న్ ఉంటుంది. మ‌న ద‌గ్గ‌ర ప్రేక్ష‌కులు ఎగ‌బ‌డ్డ‌ట్లు అక్క‌డ ఎగ‌బ‌డ‌రు. తొలి రోజు, తొలి వీకెండ్లోనే సినిమా చూసేయాల‌న్న ఉత్సాహం ఉండ‌దు. సినిమా బాగుంటే ఎక్కువ రోజులు ఆడుతుంది. వార్-2కు డివైడ్ టాక్ ఉన్న‌ప్ప‌టికీ.. హృతిక్ కోసం అక్క‌డి ప్రేక్ష‌కులు సినిమాను బాగానే చూస్తున్నారు. అయినా స‌రే.. ఈ సినిమా న‌ష్టాలు మిగిల్చేలాగే క‌నిపిస్తోంది. భారీ బ‌డ్జెట్ పెట్ట‌డ‌మే అందుక్కార‌ణం.