Begin typing your search above and press return to search.

టేస్ట్ ఆఫ్ ఆంధ్రా' నుంచి డిజిటల్ పర్యాటకం వరకు.. సీఐఐ సదస్సు విశేషాలు!

విశాఖపట్నంలో ప్రారంభమైన CII భాగస్వామ్య సదస్సు ప్రాంగణం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఏపీ సంస్కృతి, చేనేత, కలంకారీ, హస్తకళలు, ఆహార సంప్రదాయాలు, పర్యాటక ప్రాంతాలను ప్రదర్శనలో ఆవిష్కరించారు. అరకు కాఫీ, కొండపల్లి బొమ్మలు, తోలుబొమ్మలతో పాటు గ్రీన్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, స్టీల్ రంగాల్లో పెట్టుబడి అవకాశాలను వివరించారు.

By:  Tupaki Desk   |   12 Nov 2026 11:47 AM IST
టేస్ట్ ఆఫ్ ఆంధ్రా నుంచి డిజిటల్ పర్యాటకం వరకు.. సీఐఐ సదస్సు విశేషాలు!
X

సాగర తీర నగరం విశాఖపట్నంలో గురువారం ఘనంగా ప్రారంభమైన భారత పరిశ్రమల సమాఖ్య - భాగస్వామ్య సదస్సు (CII - Partnership Summit) వేదిక సరికొత్త శోభను సంతరించుకుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, సరికొత్త ఆలోచనలకు ఊపిరిలూదేలా సదస్సు ప్రాంగణాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. గురువారం ఉదయం సదస్సును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ప్లీనరీ హాల్, మూడు సమావేశ మందిరాలు, పెట్టుబడులకు అంకురార్పణ చేసే వ్యవస్థాపక మందిరంతో పాటు ఆంధ్రప్రదేశ్ ఘన కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పేలా ఏర్పాటు చేసిన ప్రదర్శన సందర్శకులను కట్టిపడేస్తోంది. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు, నోరూరించే వంటకాలు, చేనేత-కలంకారీ హస్తకళలు, పర్యాటక సొబగులు, పారిశ్రామిక ప్రగతి, పెట్టుబడి అవకాశాలను కళ్ళకు కట్టినట్లు ఆవిష్కరించారు.

కట్టిపడేస్తున్న చేనేత, కలంకారీ వైభవం

చేనేత, కలంకారీ కళలకు ఆంధ్రప్రదేశ్ పుట్టినిల్లు. రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. శ్రీకాకుళం నుండి అనంతపురం వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పట్టు, కలంకారీ వస్త్రాలను ప్రదర్శించారు. వస్త్రాల తయారీ విధానాన్ని వివరించడం సందర్శకులను ఆకట్టుకుంటోంది. వీటితో పాటు విభిన్న రకాల అందమైన తివాచీలు (కార్పెట్లు) చూపరులను ఆకట్టుకుంటున్నాయి.

‘హాల్ ఆఫ్ ఫేమ్’ – ‘టేస్ట్ ఆఫ్ ఆంధ్రా’

వివిధ రంగాల్లో విశేష సేవలందించి, రాష్ట్రానికి ఖ్యాతి తెచ్చిన మహనీయుల కీర్తిని చాటుతూ 'హాల్ ఆఫ్ ఫేమ్' పేరుతో లబ్ధప్రతిష్ఠుల చిత్రపటాలను ఏర్పాటు చేశారు. మరోవైపు, ఆంధ్రా రుచులను ప్రపంచానికి పరిచయం చేసే 'టేస్ట్ ఆఫ్ ఆంధ్రా' విభాగం సందర్శకులకు సరికొత్త అనుభూతిని పంచుతోంది. ప్రపంచ ప్రఖ్యాత అరకు కాఫీ ఘుమఘుమలతో పాటు, వంటకాలకు మరింత రుచిని జోడించే సుగంధ ద్రవ్యాలు, ప్రత్యేక మసాలా దినుసులు ప్రదర్శనలో ఉంచారు.

డిజిటల్ సొబగులతో పర్యాటకం, హస్తకళలు

ఆంధ్రప్రదేశ్ పర్యాటక అందాలను ఆధునిక డిజిటల్ విధానంలో ఆవిష్కరించిన తీరు అద్భుతంగా ఉంది. ఎకో టూరిజం, ఆధ్యాత్మిక, వారసత్వ, సాంస్కృతిక పర్యాటక రంగాలతో పాటు రాష్ట్ర సంప్రదాయ జీవనశైలిని కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నారు. అలాగే, 'మేకర్స్ స్టూడియో' విభాగంలో కొలువుదీరిన పెన్ కలంకారీ, కొండపల్లి బొమ్మలు, సవర ఆదివాసీ కళాకృతులు, ప్రఖ్యాత తోలుబొమ్మలు చూడముచ్చట గొలుపుతున్నాయి.

పెట్టుబడుల స్వర్గధామంగా ఆంధ్రప్రదేశ్

ఆధునిక యుగంలో రాష్ట్రం సాధిస్తున్న శరవేగవంతమైన పారిశ్రామిక అభివృద్ధిని ఈ ప్రదర్శన ప్రతిబింబిస్తోంది. ముఖ్యంగా ఆహార శుద్ధి (ఫుడ్ ప్రాసెసింగ్), గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ అమ్మోనియా, ఉక్కు (స్టీల్), ఉపాధి కల్పన రంగాల్లో రాష్ట్ర ప్రగతిని వివరించారు. పెట్టుబడులకు ఉన్న విస్తృత అవకాశాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలను స్పష్టంగా తెలియజేస్తూ— "పెట్టుబడుల స్వర్గసీమ ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టండి" అనే స్ఫూర్తిని పారిశ్రామికవేత్తల్లో నింపేలా ఈ ప్రదర్శన విజయవంతంగా సాగుతోంది.